Priyanka Gandhi: ‘‘ఇప్పుడు మొదటి సారి నా కోసం..’’: వయనాడ్ ప్రచారంలో ప్రియాంక గాంధీ భావోద్వేగం
Priyanka Gandhi: వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంక గాంధీ ప్రారంభించారు. వయనాడ్ నియోజకవర్గంతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని తెలిపారు. ప్రచారంలో భాగస్వామ్య పక్షాలతో సంబంధాలను బలోపేతం చేసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఎన్నిక తనకెంతో ప్రత్యేకమన్నారు.
Priyanka Gandhi: మొదటి సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా కేరళలోని వయనాడ్ లో తన ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించారు. రాయబరేలీ, వయనాడ్ లోక్ సభ స్థానాల్లో గెలిచిన రాహుల్ గాంధీ వయనాడ్ లోక్ సభ స్థానానికి రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వయనాడ్ స్థానం నుంచి ప్రియాంక గాంధీని కాంగ్రెస్ నాయకత్వం బరిలో నిలిపింది.
ప్రచారంలో భావోద్వేేగం
కాంగ్రెస్ (congress) నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం వయనాడ్ ఉప ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. తను మొదట తన తండ్రి కోసం రాజకీయ ప్రచారం చేశానని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తొలిసారి తన కోసం తాను ప్రచారం చేసుకుంటున్నానన్నారు. వయనాడ్ ప్రజలతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు.
అగ్రనేతల ప్రచారం..
కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ (sonia gandhi), మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా పార్టీ ముఖ్య నాయకులు ప్రియాంక గాంధీ కోసం ప్రచారం చేస్తున్నారు. బుధవారం జరిగిన ర్యాలీలో వారంతా పాల్గొన్నారు. ఆ ర్యాలీలో ప్రియాంక మాట్లాడుతూ, తన కుటుంబానికి, వయనాడ్ నియోజకవర్గ ప్రజలకు మధ్య శాశ్వతమైన బంధం ఉందన్నారు. రాహుల్ గాంధీకి వయనాడ్ అందించిన మద్దతును ఆమె తన ప్రసంగంలో ప్రస్తావించారు.
అన్నపై అనురాగం..
‘‘సత్యాహింస విలువల కోసం, దేశ ప్రజల మధ్య ప్రేమ, ఐక్యత కోసం భారతదేశం అంతటా 8000 కిలోమీటర్లు నడవడానికి నా సోదరుడు రాహుల్ గాంధీ (rahul gandhi) ని ప్రేరేపించాయి. మీ సపోర్ట్ లేకుండా అతను అలా చేసేవాడు కాదు. ప్రపంచం మొత్తం నా సోదరుడికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మీరు అతనికి అండగా నిలిచారు. మీరు ఆయనకు పోరాడే శక్తిని, ధైర్యాన్ని ఇచ్చారు’’ అని ప్రియాంక పేర్కొన్నారు. ‘‘నా కుటుంబం మొత్తం మీకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. నా అన్న మిమ్మల్ని విడిచిపెట్టాల్సి వచ్చిందని నాకు తెలుసు. నేను మీకు, అతడికి మధ్య వారధిగా ఉండి, మీ బంధాన్నిమరింత బలోపేతం చేస్తాను’’ అని వయనాడ్ ప్రజలకు ప్రియాంక గాంధీ (priyanka gandhi) హామీ ఇచ్చారు.
అప్పుడు కుటుంబం కోసం, ఇప్పుడు నా కోసం
తాను తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భాన్ని ప్రియాంక గాంధీ గుర్తు చేసుకున్నారు. 1989 లో తాను తన తండ్రి రాజీవ్ గాంధీ కోసం మొదటి సారి ఎన్నికల ప్రచారం నిర్వహించానన్నారు. ‘‘1989 లో,నా 17 ఏళ్ళ వయస్సులో నేను నా తండ్రి రాజీవ్ గాంధీ కోసం మొదటి సారి ఎన్నికల ప్రచారం నిర్వహించాను. ఆ తరువాత పలు మార్లు నా తల్లి సోనియా గాంధీకి, సోదరుడు రాహుల్ గాంధీకి ప్రచారం చేశారు. ఇంకా చాలా మంది కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించాను. ఇప్పుడు మొదటి సారి నా కోసం నేను ప్రచారం చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో మీ ఆశీర్వాదం కోరుతున్నాను’’ అని ప్రియాంక గాంధీ వయనాడ్ ప్రజలను కోరారు.