Maharashtra CM : మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్.. ఏక్‌నాథ్ షిండే కుమారుడికి డిప్యూటీ సీఎం!
02 December 2024, 12:40 IST
- Maharashtra CM : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై అందరికీ ఆసక్తి నెలకొంది. అయితే ఎట్టకేలకు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దేవేంద్ర ఫడ్నవీస్‌కు సీఎం పీఠం దక్కినట్టుగా సమాచారం.
ఏక్నాథ్ షిండే- దేవేంద్ర ఫడ్నవీస్
మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి సూపర్ విక్టరీ సాధించింది. ఎన్నికలలో భారీ విజయాన్ని సాధించి వారం దాటినా మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ డిసెంబరు 5న మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఆయన పేరు ఖరారైందని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. మరోవైపు శివసేన నాయకులు ఏక్‌నాథ్ షిండే సీఎం కావాలని కోరుకున్నారు. కానీ బీజేపీ మాత్రం వేరే నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ త్వరలో జరిగే సమావేశంలో ఫడ్నవీస్‌ను శాసనసభా పక్ష నేతగా ఎన్నిక చేసే అవకాశం ఉంది. , 288 అసెంబ్లీ స్థానాల్లో 230 స్థానాలను మహాయుతి గెలుచుకుంది. బీజేపీ 132 స్థానాలు, శివసేన 57, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్‌సీపీ) 41 స్థానాల్లో గెలుపొందాయి.
డిసెంబర్ 5 సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ప్రధాని మోదీ సమక్షంలో మహాయుతి ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. శాసనసభా పక్ష నేతగా ఫడ్నవీస్‌ను ఎన్నుకోనున్నట్టుగా బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఏక్నాథ్ షిండే కూడా బీజేపీ నిర్ణయానికి మద్దతు ఇచ్చినట్టుగా వెల్లడించారు.
మరోవైపు కొత్త ప్రభుత్వం రూపుదిద్దుకుంటున్న తీరు పట్ల తాను సంతోషంగా లేరనే ఊహాగానాల మధ్య ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే శుక్రవారం సతారా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్లారు. తీవ్రం జ్వరంతో ఉన్న ఆయన ఆదివారం ముంబయికి వచ్చారు. అంతకుముందు విలేకరులతో మాట్లాడారు. 'బీజేపీ నాయకత్వం తీసుకున్న సీఎం పదవి నిర్ణయం నాకు, శివసేనకు ఆమోదయోగ్యమైనది. నా పూర్తి మద్దతు ఉంటుందని నేను ఇప్పటికే చెప్పాను.' అని అన్నారు.
అయితే కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ముందే మరో పేరు తెరపైకి వచ్చింది. ఏక్‌నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే డిప్యూటీ సీఎం అవుతారని అంటున్నారు. మరోవైపు అజిత్ పవార్ ఎన్‌సీపీ నేతలు కూడా ఈ నిర్ణయాల విషయంలో సందిగ్ధంలో ఉన్నారు.