Delhi rains : ఢిల్లీ వర్షాలకు 50ఏళ్ల రికార్డు బ్రేక్!
09 October 2022, 20:13 IST
Delhi rains today : ఢిల్లీలో భారీ వర్షాలకు 50ఏళ్ల రికార్డు ఒకటి బ్రేక్ అయ్యింది. మరోవైపు సోమవారం నుంచి ఢిల్లీలో వర్షాలు తగ్గుముఖం పడతాయని ఐఎండీ వెల్లడించింది.
ఢిల్లీ వర్షాలకు 50ఏళ్ల రికార్డు బ్రేక్!
Delhi rains today : ఢిల్లీలో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు.. ప్రజలను వణికించాయి. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ రికార్డు బ్రేక్ అయ్యింది.
ఆదివారం ఉదయం 8:30 గంటల నాటికి.. 24గంటల్లో 74ఎం.ఎంల వర్షపాతం నమోదైంది. అయితే.. ఈ వర్షాల కారణంగా.. ఢిల్లీ అత్యల్ప- అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం దారుణంగా పడిపోయింది. శుక్రవారం అత్యల్ప ఉష్ణోగ్రత 20.8 డిగ్రీలుగా ఉండగా.. శనివారం అత్యధిక ఉష్ణోగ్రత 23.4 డిగ్రీలుగా నమోదైంది. అంటే ఆ వ్యత్యాసం 2.6 డిగ్రీ సెల్సియస్‌గా ఉంది. 1969 తర్వాత ఇంత తక్కువ వ్యత్యాసం నమోదుకావడం ఇదే తొలిసారి. 1998 అక్టోబర్ 19న, ఉష్ణోగ్రతల మధ్య తేడా 3.1డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.
Heavy rains in Delhi : ఇక భారత వాతావరణశాఖ ప్రకారం.. 2007 తర్వాత ఢిల్లీలో కురిసిన అతిపెద్ద వర్షం ఇదే. అయితే.. భారీ వర్షాల కారణంగా ఢిల్లీ వాయు నాణ్యత మెరుగుపడింది. వాయు నాణ్యత సంతృప్తికర స్థాయిలో ఉందని అధికారులు వెల్లడించారు.
ఇక రోడ్లన్నీ జలమయం అవ్వడంతో ఢిల్లీ వ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ విరిగిపోయాయి. ఈ పరిస్థితులపై ఢిల్లీవాసులు సామాజిక మాధ్యమాల్లో తమ అసంతృప్తిని బయటపెట్టారు. ఫలితంగా ఢిల్లీ వర్షాలపై నెట్టింట్లో మీమ్స్ పేలాయి.
Delhi rains news : ఆనంద్ విహార్, వజీరాబాద్, ఎయిమ్స్, మెహ్రౌలి- బదర్పూర్ రోడ్డు, తుగ్లకాబాద్, సంగం విహార్, కిరారి, రోహ్తక్ రోడ్, వికాస్ మార్గ్, నజఫ్‌గఢ్, మహిపల్పూర్, రంగ్‌పూర్ ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది. మోకాలు లోతు నీరులోనే ప్రజలు ప్రయాణించాల్సి వచ్చింది.
Rains in Delhi : ఇక సోమవారం నుంచి ఢిల్లీలో వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణశాఖ వెల్లడించింది. అయితే అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
ఆరెంజ్ అలర్ట్..
Rains in India : ఇక ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్, తూర్పు ఉత్తర్‌ప్రదేశ్, తూర్పు రాజస్థాన్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. రానున్న రెండు రోజుల్లో ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
పశ్చిమ్ బెంగాల్‌లోని ఉత్తర ప్రాంతాల్లో బుధవారం వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ఆ తర్వాత శుక్రవారం వరకు వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. డార్జిలింగ్, కలింపోంగ్ జిల్లాల్లో కొండచరియలు విరిగి పడే ఘటనలు నమోదు అయ్యే అవకాశం ఉందని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆ ప్రాంతంలో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తాయని స్పష్టం చేసింది.
Rains in West Bengal : కలింపోంగ్, డార్జిలింగ్‌లో మంగళవారం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి. వీటితో పాటు పశ్చిమ్ బెంగాల్‌లోని అనేక ప్రాంతాల్లో వానలు పడుతూనే ఉన్నాయి.