రూ. 100 'పేటీఎం' చేసి.. పోలీసులకు దొరికిపోయిన దొంగలు!
03 September 2022, 8:34 IST
Police catch robbers with the help of Paytm transaction : పేటీఎంతో లావాదేవీలే కాదు.. దొంగలను కూడా పట్టుకోవచ్చు! రూ. 6కోట్లు విలువ చేసి పారిపోయిన ఓ దొంగల ముఠాను పోలీసులు.. 'రూ. 100 పేటీఎం ట్రాన్సాక్షన్' సాయంతో పట్టుకున్న ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..
రూ. 100 'పేటీఎం' చేసి.. పోలీసులకు దొరికిపోయిన దొంగలు!
Police catch robbers with the help of Paytm transaction : దొంగలు తెలివిగా క్రైమ్‌లు చేయడం మొదలుపెట్టారు. పోలీసులు.. అంతకన్నా తెలివిగా వారిని పట్టుకుంటున్నారు! రూ. 100 ‘పేటీఎం ట్రాన్సాక్షన్’తో దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న ఘటన తాజాగా ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది. వారి నుంచి రూ. 6కోట్లు విలువ చేసే ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..
కళ్లల్లో కారం కొట్టి..
దాదాపు 10 రోజుల క్రితం.. బుధవారం తెల్లవారుజామున 4:15 గంటలకు జరిగింది ఈ ఘటన. డెలివరీ బాయ్‌గా పనిచేసే సోమ్‌వీర్.. తన సహచరుడు జగ్దీప్ సైనితో కలిసి పార్సిల్ తీసుకోవడానికి పహర్‌గంజ్‌లోని ఆఫీసుకు వెళ్లాడు. అక్కడి నుంచి పార్సిల్ తీసుకుని డీజీబీ రోడ్డువైపు వెళ్లారు. వారిద్దరు మిలీనియం హోటల్‌కు చేరుకునే సరికి.. ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డగించారు. అందులో ఒకరు పోలీసు యూనిఫాం వేసుకుని ఉన్నాడు.
పార్సిల్ చెక్ చేయాలని పోలీసు యూనిఫాం వేసుకున్న వ్యక్తి.. సోమ్‌వీర్‌కు చెప్పాడు. ఇంతలో.. మరో ఇద్దరు అక్కడికి చేరుకున్నారు. మొత్తం మీద నలుగురు.. సోమ్‌వీర్, అతని సహచరుడి కళ్లల్లో కారం చల్లి, పార్సిల్ బ్యాగు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొద్ది సేపటికే బ్యాగు తీసుకుని అక్కడి నుంచి జారుకున్నారు.
Paharganj Robbery : ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సోమ్‌వీర్. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 700కుపైగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. దొంగలను గుర్తించారు. స్థానిక నిఘా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఆ నలుగురు కార్యకలాపాలను ట్రాక్ చేయడం మొదలుపెట్టారు.
ఇంతలో.. నిందితుల్లో ఓ వ్యక్తి.. ఓ క్యాబ్ డ్రైవర్‌కు రూ. 100 పేటీఎం చేశాడు. టీ కొనుగోళ్ల కోసం డబ్బుల బదులు పేటీఎం ట్రాన్సాక్షన్ చేశాడు. ఆ ట్రాన్సాక్షన్‌ను అనాలసిస్ చేసిన పోలీసులు.. నిందితుడు నజఫ్గఢ్వాసి అని తేలింది.
నిందితుడు రాజస్థాన్‌కు వెళ్లినట్టు పోలీసులు తెలుసుకున్నారు. జైపూర్‌కు ప్రత్యేక బృందాన్ని పంపించారు. చివరికి.. ముగ్గురు నిందితులు నగేశ్ కుమార్(28), శివం(23), మనీశ్ కుమార్(22)లను అరెస్ట్ చేశారు. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Delhi robbery case : నిందితుల నుంచి 6,270 గ్రాముల బంగారం, మూడు కోజీల వెండి, 106 రా డైమండ్లతో పాటు మొత్తం రూ. 6కోట్లు విలువ చేసే విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో భాగంగా.. ఈ దొంగతనానికి నగేశ్ సూత్రధారి అని, తన స్నేహితులతో కలిసి క్రైమ్‌కు పాల్పడేందుకు అతనే ప్లాన్ చేసినట్టు పోలీసులు తెలుసుకున్నారు.