Arvind Kejriwal CBI : లిక్కర్ స్కామ్‌తో కేజ్రీవాల్‌కున్న లింక్ ఏంటి? సీఎంను సీబీఐ ఎందుకు పిలిచింది?
15 April 2023, 7:52 IST
- Arvind Kejriwal CBI : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు విచారణకు రావాలని సీఎం కేజ్రీవాల్‌కు పిలుపునిచ్చింది సీబీఐ. ఈ స్కామ్‌తో కేజ్రీవాల్‌కు ఉన్న లింక్ ఏంటి?
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal Delhi liquor scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా.. ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ) పిలుపునివ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా.. ఇదే కేసులో ఇప్పటికే ఆరెస్టైన్ నేపథ్యంలో.. 16న ఏం జరగుతుందని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఓవైపు కేజ్రీవాల్‌పై కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ నేతలు ఆరోపిస్తుంటే.. మరోవైపు ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా తమ వద్ద ఆధారాలున్నట్టు సీబీఐ చెబుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సీఎంకు లింక్ ఏంటి? సీబీఐ ఆయన్ని ఎందుకు పిలిచింది?
అరవింద్ కేజ్రీవాల్ పాత్ర ఉందా..?
ఈడీ ఇటీవలే దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ప్రకారం.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రధాన నిందితుడు, వ్యాపారవేత్త సమీర్ మహంద్రుతో ఫేస్‌టైమ్‌లో మాట్లాడారు అరవింద్ కేజ్రీవాల్. ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్‌పై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
Arvind Kejriwal CBI : కాగా.. గతేడాది నవంబర్ 12-15న సమీర్ మహంద్రును ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఆ సమయంలో కొన్ని కీలక విషయాలు వెల్లడించాడు సమీర్. విజయ్ నాయర్.. అరవింద్ కేజ్రీవాల్‌తో తనకు మీటింగ్ ఫిక్స్ చేసినట్టు పేర్కొన్నాడు. కానీ అది జరగలేదని వెల్లడించాడు. అనంతరం ఫేస్‌టైమ్‌లో ఇద్దరం వీడియో కాల్స్‌లో మాట్లాడుకున్నట్టు వెల్లడించాడు.
"ఈ వీడియో కాల్లో విజయ్ నాయర్‌ను నమ్మమని అరవింద్ కేజ్రీవాల్ సమీర్‌కు చెప్పారు. విజయ్‌తో మంతనాలు జరపాలని సమీర్‌కు సూచించారు," అని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మరో నిందితుడుగా ఉన్నారు విజయ్ నాయర్. వీరిద్దరు కలిసీ లిక్కర్ పాలసీ స్కామ్‌కు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.
Delhi liquor scam latest news : కేజ్రీవాల్ చెప్పినప్పటి నుంచి విజయ్ నాయర్‌కు సమీర్ దగ్గరైనట్టు, వీరిద్దరు కలిసి పనులు పూర్తిచేసినట్టు ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే అనేకమంది రాజకీయ నేతలు, లిక్కర్ వ్యాపారులను కలిసినట్టు ఆరోపిస్తోంది.
Delhi liquor scam case explained : "ఈ క్రమంలో విజయ్ నాయర్‌పై సమీర్ మహేంద్రుకు నమ్మకం పెరిగింది. ఫ్రెంచ్ లిక్కర్ కంపెనీ పెర్నాండ్ రిచర్డ్ తన హోల్‌సేల్ కోసం.. సమీర్‌ను ఎంచుకునే స్థాయిలో విజయ్‌కు కనెక్షన్లు ఉన్నట్టు సమీర్‌కు అర్థమైంది. దీని బట్టి విజయ్‌కు ఆప్ పెద్దల నుంచి ఎంత మద్దతు ఉందో తెలుస్తోంది. పార్టీ పెద్ద, ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న కేజ్రీవాల్‌కు కూడా ఇందులో హస్తం ఉంది," అని ఈడీ ఆరోపించింది. లిక్కర్ ట్రేడ్‌లో భాగంగా ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని ఢిల్లీలో కేజ్రీవాల్ కలిసినట్టు ఈడీ పేర్కొంది.