Omicron Bf.7 cases in India : దేశంలో మరోమారు కఠినమైన కొవిడ్ ఆంక్షలు? కేంద్రం మాట ఇది..
24 December 2022, 11:25 IST
Covid scare in India : దేశంలో కొవిడ్ భయాలు మళ్లీ పెరిగాయి. ఈ క్రమంలో దేశంలో మరోమారు కఠినమైన కొవిడ్ ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఈ విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా స్పందించింది.
ఢిల్లీలోని ఓ మార్కెట్లో పరిస్థితి ఇలా..
Covid scare in India : చైనాలో కొవిడ్ విజృంభణతో ప్రపంచ దేశాలు మళ్లీ భయం గుప్పిట్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా ఇండియాలో పరిస్థితులు మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం అప్రమత్తమైన తీరుతో.. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కఠినమైన కొవిడ్ ఆంక్షలను మళ్లీ ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని ప్రజలు భయపడుతున్నారు. తాజాగా.. ఇదే విషయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కఠినమైన కొవిడ్ ఆంక్షలను విధించే ఆలోచనలో తాము లేమని పేర్కొంది.
'భయం అవసరం లేదు..'
దేశంలో కొవిడ్ పరిస్థితులపై శుక్రవారం ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ. ఈ భేటీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన ఆరోగ్య మంత్రులు పాల్గొన్నారు. దేశంలో పరిస్థితులు ఇప్పటికైతే స్థిరంగానే ఉన్నట్టు, ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
India Covid news latest : సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మాండవీయ.. "కఠినమైన ఆంక్షలు విధించే విధంగా ఇండియాలో పరిస్థితులు లేవు. మనం బాగానే ఉన్నాము. ఇంత జరిగిన తర్వాత ప్రజల్లో కూడా అవగాహన పెరిగింది. వారు కూడా సొంతంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అనవసరంగా హడావుడి సృష్టించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు," అని అన్నారు.
మరోవైపు.. ఇయర్ ఎండ్ వేడుకలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కొవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని మార్గదర్శకాలను విడుదల చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ.
'అప్రమత్తంగా ఉండాలి..'
ఇండియాలో కొవిడ్ పరిస్థితులు నిలకడగానే ఉన్నాయి. 22 డిసెంబర్ నాటికి పాజిటివిటీ రేటు 0.14శాతంగా ఉంది. 8 రాష్ట్రాలు, నాలుగు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎలాంటి యాక్టివ్ కేసులు లేవు.
Omicron Bf.7 cases in India : ఏది ఏమైనా.. యుద్ధానికి మాత్రం కేంద్రం సన్నద్ధమవుతున్నట్టు కనిపిస్తోంది. గతంలోని పరిస్థితులు మళ్లీ ఏర్పడితే.. అందుకు తగ్గట్టుగా సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా అనేక ఆసుపత్రుల్లో కొవిడ్ డ్రిల్స్ నిర్వహిస్తోంది. టీకాలపై అవగాహన పెంచుతోంది. కాలర్ ట్యూన్స్‌లో మళ్లీ కొవిడ్ సూచనలను మొదలుపెట్టింది. నిత్యం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలిచ్చింది. కొవిడ్ టెస్ట్‌లను పెంచాలని రాష్ట్రాలకు సూచించింది.
ముక్కులో వేసే వాక్సిన్ రెడీ..
Intranasal Covid vaccine : భారత్ బయోటెక్ రూపొందించిన ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోస్‌గా టీకా కార్యక్రమంలో చేర్చడానికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఈ సూది రహిత వ్యాక్సిన్ ప్రైవేట్ కేంద్రాల్లో అందుబాటులో ఉంటుంది. శుక్రవారం సాయంత్రం కో-విన్ ప్లాట్‌ఫామ్‌లో దీనిని ప్రవేశపెట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.