IMA on Covid-19: ట్రావెల్ చేస్తున్నారా? ఐఎంఏ సూచనలు ఒకసారి చూడండి
23 December 2022, 11:51 IST
- IMA on Covid-19: ఇంటి నుంచి బయటకు వెళుతున్నా, దూర ప్రయాణాలు చేస్తున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సూచిస్తోంది.
ముంబైలో ప్రారంభమైన క్రిస్మస్ వేడుకలు.. బహిరంగ సమావేశాలకు దూరంగా ఉండాలంటున్న ఐఎంఏ
చైనాతో సహా కొన్ని దేశాల్లో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వివాహ వేడుకలు, రాజకీయ లేదా సామాజిక సమావేశాలు, బహిరంగ సభలు, అంతర్జాతీయ ప్రయాణాలు, వంటి వాటికి దూరంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రజలకు సూచించింది.
వాక్సిన్ వేయించుకోని వారు వాక్సిన్ తీసుకోవాలని, వాక్సిన్ ఇదివరకే రెండు డోసులు పూర్తయిన వారు ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించింది. బహిరంగ ప్రదేశాలలో మాస్కులు ధరించాలని, సామాజిక-దూర నిబంధనలను అనుసరించడం వంటి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అనుసరించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
యునైటెడ్ స్టేట్స్, జపాన్, దక్షిణ కొరియా, ఫ్రాన్స్, బ్రెజిల్ వంటి దేశాల నుండి ఇటీవల 24 గంటల వ్యవధిలో దాదాపు 5.37 లక్షల కొత్త ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయని ఐఎంఏ తెలిపింది.
‘ప్రభుత్వం, ప్రైవేట్ రంగంలో దృఢమైన మౌలిక సదుపాయాలు, అంకితమైన వైద్య సిబ్బంది, ప్రభుత్వం నుండి చురుకైన నాయకత్వ మద్దతు, తగినంత మందులు, టీకాల లభ్యతతో భారతదేశం గతంలో మాదిరిగానే సమస్యను ఎదుర్కోగలదు..’ అని పేర్కొంది.
అత్యవసర మందులు, ఆక్సిజన్ సరఫరా, అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విభాగాలకు అవసరమైన సూచనలను జారీ చేయడం ద్వారా అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు సంసిద్ధతను పెంచాలని వైద్యుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తన రాష్ట్ర, స్థానిక శాఖలకు కూడా ఒక సలహాను జారీ చేసింది. వారి ప్రాంతాలలో వ్యాప్తి చెందితే అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.
‘ప్రస్తుతానికి పరిస్థితి ఆందోళనకరంగా లేదు, అందువల్ల భయపడాల్సిన అవసరం లేదు. అయితే చికిత్స కంటే నివారణ ఉత్తమం’ అని ఐఎంఏ తెలిపింది.
సబ్బు లేదా శానిటైజర్‌తో క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలని, జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, లూజ్ మోషన్ వంటి లక్షణాల విషయంలో వైద్యులను సంప్రదించాలని కూడా సూచించింది.