China Covid surge: చైనాలో రోజుకు 10 లక్షల కేసులు; 5 వేల మరణాలు
China Covid surge: పొరుగు దేశం చైనాలో కరోనా మృత్యు తాండవం చేస్తోంది. అక్కడ రోజుకు 10 లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఐదు వేల మరణాలు సంభవిస్తున్నాయి.
China Covid surge: చేతులెత్తేసిన వైద్య వ్యవస్థ
ప్రతీ రోజు దాదాపు 10 లక్షల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చైనా వైద్య వ్యవస్థ కూడా ఆ భారాన్ని మోయలేక చేతులెత్తేసింది. ప్రభుత్వం కూడా మాస్ టెస్టింగ్ కార్యక్రమాన్ని నిలిపేసింది. దాంతో, కచ్చితమైన గణాంకాలు తెలియడం లేదు. ఆసుపత్రులు కరోనా(corona) పేషెంట్లతో కిటకిటలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా రోజుకు 5 వేల మంది కరోనాతో మరణిస్తున్నారు. మృతదేహాలను ఆసుపత్రి కారిడార్లలో వరుసగా పేర్చిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
China Covid surge: మందులు దొరకడం లేదు
మరో వైపు ఔషధాల కొరత వేధిస్తోంది. మెడికల్ షాపుల్లో కరోనా(corona) చికిత్సకు అవసరమైన ఔషధాలేవీ లభించడం లేదు. చివరకు వైటమిన్ టాబ్లెట్లకు కూడా కొరత నెలకొంది. ఈ పరిస్థితుల్లో చైనా ప్రజలు ఇమ్యూనిటీ కోసం నిమ్మకాయలు, ఇతర సిట్రస్ పండ్లపై, సంప్రదాయ వైద్య విధానాలపై ఆధారపడుతున్నారు.
China Covid surge: ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..
లండన్ కు చెందిన ఎయిర్ఫినిటీ లిమిటెడ్(Airfinity Ltd) అనే అనలిటికల్ సంస్థ అధ్యయనం ప్రకారం.. చైనాలో ఇప్పుడు రోజుకు 10 లక్షల వరకు corona కేసులు నమోదవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారం నాటికి ఈ సంఖ్య 37 లక్షలకు చేరుతుంది. మార్చి నెలలో రోజువారీ కేసుల సంఖ్య 42 లక్షలకు చేరి, ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పడుతుంది. జీరో కోవిడ్ పాలసీని పక్కన బెట్టి, కోవిడ్ ఆంక్షలను సడలించిన తరువాత చైనా ప్రభుత్వం కరోనా(corona) కట్టడికి చర్యలు తీసుకోవడం దాదాపు నిలిపేసింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో మాస్ టెస్టింగ్ ను ఆపేసింది. దాంతో, ప్రజలు వ్యక్తిగతంగా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ లపై ఆధారపడ్తున్నారు. దాంతో, ఎవరికి కరోనా సోకిందనే విషయంలో స్పష్టమైన వివరాలు లభించడం లేదు. కరోనా(corona) సోకిన వారు కచ్చితంగా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలన్న నిబంధనను కూడా ఎత్తివేసింది. అలాగే, కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను కూడా చాలా తక్కువగా చూపుతోంది. గత 24 గంటల్లో సుమారు 3 వేల కొత్త కేసులు, జీరో మరణాలు నమోదయ్యాయని గురువారం చైనా తెలిపింది. అలాగే, కరోనా(corona) మరణాల సంఖ్యను తగ్గించడానికి వీలుగా కరోనా మరణానికి నిర్వచనాన్ని కూడా మార్చింది.