Chintan Shivir | అదిగో ‘నవ సంకల్పం’.. భారీ మార్పులకు పునాది!
15 May 2022, 16:09 IST
Chintan Shivir చింతన్ శిబిర్‌లో మూడో రోజు.. కీలక సంస్కరణలు ఆమోద ముద్రవేసింది కాంగ్రెస్. అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టనున్నట్టు రాహుల్ గాంధీ వెల్లడించారు.
చింతన్ శిబిర్‌లో సోనియా- రాహుల్ గాంధీ
Chintan Shivir Udaipur | రాజస్థాన్ వేదికగా జరుగుతున్న చింతన్ శిబిర్‌లో చివరి రోజైన ఆదివారం నాడు.. 'నవ సంకల్ప్' తీర్మానాన్ని కాంగ్రెస్ ఆమెదించింది. పార్టీ బలోపేతం, ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భారీ సంస్కరణలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకుంది.
గాంధీల కోసం సవరణ..!
చింతన్ శిబిర్‌లో భాగంగా.. 'ఒక కుటుంబం- ఒక టికెట్' ఫార్ములాకు కాంగ్రెస్ ఆమెద ముద్ర వేసింది. కాగా ఇందులో ఒక సవరణను ఇచ్చింది. ఒక కుటుంబం నుంచి మరో వ్యక్తి పోటీకి దిగాలి అని అనుకుంటే.. పార్టీలో ఆ మనిషి కచ్చితంగా ఐదేళ్లు పనిచేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన చూసుకుంటే.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు.. ఎన్నికల్లో పోటీ కోసం ఇప్పటికే అర్హత పొందేశారు. అదే సమయంలో ఎన్నికల్లో పోటీకి ఎలాంటి వయస్సు పరిమితి పెట్టలేదు.
Congress Chintan Shivir | సమాజంలోని బడుగు బలహీన వర్గాలను ఆకర్షించే విధంగా చర్యలు చేపట్టేందుకు కాంగ్రెస్ ముదుకొచ్చింది. కాంగ్రెస్‌లోని అన్ని స్థాయిల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు 50శాతం ప్రాతినిధ్యం వహించే విధంగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. చింతన్ శిబిర్‌లో భాగంగా జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ నిర్ణయం తీసుకుంది.
మరోవైపు.. కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ స్థానంలో పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేయాలన్న పార్టీ 'రెబల్స్' ప్రతిపాదనను హైకమాండ్ తోసిపుచ్చింది. కాగా.. ప్రతి రాష్ట్రంతో పాటు కేంద్రంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమించాలని నిర్ణయించింది.
ఈవీఎంలకు స్వస్తి..!
ఇటీవలి కాలంలో ఈవీఎంల పనితీరుపై తీవ్రస్థయిలో విమర్శలు చేసింది. తాజాగా.. అధికారంలోకి వస్తే.. ఈవీఎంలను తొలగించి, బ్యాలెట్ పేపర్ల పద్ధతిని తీసుకు వచ్చేందుకు చేసిన తీర్మానానికి ప్రాథమికంగా ఆమోద ముద్రవేసింది.
కాగా.. 2004, 2008 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు.. ఈవీఎంలే ఉండటం గమనార్హం. ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఈవీఎంలనే వినియోగించారు. పైగా.. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయవచ్చన్న కాంగ్రెస్ ఆరోపణలకు ఆధారాలు లేవు.
దేశవ్యాప్తంగా 'యాత్ర'..!
Rahul Gandhi | చింతిన్ శిబిర్‌లో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ ప్రసంగించారు. సామాన్యుడితో బంధం తెగిపోవడం వల్లే పార్టీ గెలవడం లేదని అభిప్రాయపడ్డారు.
"సామాన్యుడితో మన బంధం తెగిపోయిందని అంగీకరించాలి. ఆ బంధాన్ని పునరుద్ధరించుకోవాలి. షార్ట్కట్స్తో ఆ పని జరగదు. కఠిన శ్రమ అవసరం. ప్రజల్లో కలిసిపోయేందుకు.. వారితో బంధాన్ని దృఢపరుచుకునేందుకు.. అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా యాత్ర చేపడతాము," అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ సంస్కరణలు సరిపోతాయా?
Congress Chintan Shivir 2022 | ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ దారుణ ప్రదర్శన చేసింది. చాలా రాష్ట్రాల్లో కనీసం తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది. ఈ క్రమంలోనే పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొచ్చేందుకు హైకమాండ్ సిద్ధపడింది. ఈ క్రమంలోనే ఉదయ్‌పూర్‌లో మూడురోజుల పాటు చింతన్ శిబిర్‌ను నిర్వహించింది. పార్టీ బలోపేతం, సిద్ధాంతాలతో పాటు, సమాజం, ప్రజల సమస్యలు, బీజేపీ పాలనపై కాంగ్రెస్ నేతలు సమాలోచనలు చేశారు.
దారుణంగా డీలాపడిన పార్టీని బలపరిచేందుకు.. ఈ సంస్కరణలు సరిపోతాయా? లేదా? అన్నది వేచిచూడాలి.