కాంగ్రెస్ చీఫ్‌గా ప్రియాంక గాంధీ వాద్రా..!
కాంగ్రెస్ పార్టీ `చింతన్ శిబిర్`లో ఒక నాయకుడు పాత డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చాడు. ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిని చేయాలని కోరాడు. ప్రియాంకను ఒకే రాష్ట్రానికి పరిమితం చేయవద్దని అభ్యర్థించాడు. పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముందే ఆయన ఈ విన్నపం చేయడం విశేషం.
రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ మేథో మథన సదస్సు `చింతన్ శిబిర్`లో ఒక నాయకుడు ఒక పాత డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చాడు. ప్రియాంక గాంధీని పార్టీ అధ్యక్షురాలిని చేయాలని కోరాడు. ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులున్నారని, ప్రియాంకను ఒకే రాష్ట్రానకి పరిమితం చేయవద్దని అభ్యర్థించాడు. పార్టీ చీఫ్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ముందే ఆయన ఈ విన్నపం చేయడం విశేషం.
యూపీకే పరిమితం చేయొద్దు
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న `చింతన్ శిబిర్`లో ఒక అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఈ సదస్సు శనివారానికి రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యూపీకి చెందిన పార్టీ నేత ఆచార్య ప్రమోద్ కృష్ణన్ పార్టీ నేతలకు ఒక విన్నపం చేశారు. దేశవ్యాప్తంగా అభిమానులున్న ప్రియాంక గాంధీ వాద్రాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిని చేయాలని కోరారు. ప్రియాంకను ఒక్క రాష్ట్రానికే పరిమితం చేయడం సరి కాదన్నారు. ప్రస్తుతం ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అలాగే, ఉత్తర ప్రదేశ్ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు.
రెండేళ్లు ట్రై చేశాం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని మళ్లీ చేపట్టాలని రాహుల్ గాంధీని గత రెండేళ్లుగా కోరుతున్నామని, అయితే, రాహుల్ అందుకు ఒప్పుకోవడం లేదని ప్రమోద్ కృష్ణన్ తెలిపారు. రాహుల్ గాంధీకి ఆసక్తి లేని పక్షంలో, ప్రియాంక గాంధీని పార్టీ జాతీయ అధ్యక్షురాలిని చేయాలని ఆయన కోరారు. పార్టీకి మళ్లీ పునరుత్తేజం తీసుకురాగల సామర్ధ్యం ప్రియాంక గాంధీకి ఉందన్నారు. ప్రస్తుతం పార్టీలో ఆమెనే అత్యంత పాపులర్ నాయకురాలని స్పష్టం చేశారు. ప్రమోద్ కృష్ణన్ ఈ వ్యాఖ్యలను పార్టీ నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీల సమక్షంలోనే చేయడం విశేషం. అయితే, ఈ వ్యాఖ్యలకు వారి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇంతలో, పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రమోద్ కృష్ణన్ ను అడ్డుకున్నారు.
చాలా మంది నేతల ఆకాంక్ష
పార్టీ పగ్గాలను ప్రియాంక చేపట్టాలని ఆచార్య ప్రమోద్ కృష్ణన్ ఒక్కరే కాదు.. పార్టీలో చాలా మంది నాయకులు కోరుతున్నారని పార్టీ వర్గాల సమాచారం. ఎంపీ దీపేందర్ హూడా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీని ఉత్తర ప్రదేశ్ రాజకీయాలకే పరిమితం చేయవద్దని ఆయన సూచించారు. జాతీయ రాజకీయాల్లో ఆమె క్రియాశీల పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.