తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Encounter: ఛత్తీస్ గఢ్ లో మావోలు, భద్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్; ఇద్దరు నక్సల్స్ మృతి

Encounter: ఛత్తీస్ గఢ్ లో మావోలు, భద్రతా బలగాల మధ్య ఎన్ కౌంటర్; ఇద్దరు నక్సల్స్ మృతి

HT Telugu Desk HT Telugu

23 March 2024, 19:23 IST

  • Encounter: చత్తీస్ గఢ్ లో శనివారం మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య చోటు చేసుకున్న ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. భద్రతా దళాలు ఈ ప్రాంతంలో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ కోసం వెళ్తుండగా మావోయిస్టుల దాడి జరిగిందని ఐజీపీ తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chhattisgarh Encounter: ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ ప్రాంతంలోని బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో (encounter) ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. చనిపోయిన మావోయిస్టుల వివరాలను తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

శనివారం ఉదయం ఎన్ కౌంటర్

బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ఉదయం 8.30 గంటల సమయంలో భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు (encounter) జరిగాయని బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ పి ఒక ప్రకటనలో తెలిపారు. భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో యాంటీ నక్సల్ ఆపరేషన్ కోసం వెళ్తుండగా మావోయిస్టులు దాడి చేశారని ఐజీపీ తెలిపారు. బీజాపూర్ దంతెవాడ, సుక్మా ట్రై జంక్షన్ లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దాంతో, శుక్రవారం రాష్ట్ర డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), బస్తర్ ఫైటర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, దాని ఎలైట్ యూనిట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రెసల్యూట్ యాక్షన్), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. ఉదయం 8.30 గంటల సమయంలో పిడియా గ్రామం వైపు బలగాలు వెళ్తుండగా మావోయిస్టులు వారిపై కాల్పులు జరిపారు. దాంతో అక్కడ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

సుక్మా జిల్లాలో ఐఈడీ పేలుడు

మరోవైపు సుక్మా జిల్లాలో జరిగిన ఐఈడీ పేలుడులో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఇదే ఆపరేషన్ లో భాగంగా శుక్రవారం రాత్రి దంతెవాడ-సుక్మా సరిహద్దులో అమర్చిన ప్రెషర్ ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (IED) పేలడంతో బస్తర్ ఫైటర్స్ కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. సుక్మా జిల్లాలోని జాగర్గుండా పోలీస్ స్టేషన్ పరిధిలోని దొడితుమ్నార్ గ్రామ సమీపంలోని అడవిలో అంతర్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. గాయపడిన జవాన్లను బస్తర్ ఫైటర్స్ కానిస్టేబుళ్లు వికాస్ కుమార్ కర్మ, రాకేష్ కుమార్ మార్కమ్ గా గుర్తించారు. ఇద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి తదుపరి చికిత్స కోసం రాయ్ పూర్ కు తరలించినట్లు సుందర్ రాజ్ తెలిపారు.

తదుపరి వ్యాసం