Canada working hours: విదేశీ విద్యార్థులకు కెనడా షాక్; ఇక వారానికి 24 గంటలే వర్క్ పర్మిట్
30 April 2024, 20:14 IST
Canada working hours: తమ దేశంలో చదువుకునే విదేశీ విద్యార్థులకు కెనడా ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇకపై కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థులు ప్రతి వారం 24 గంటలు మాత్రమే పని చేయడానికి వీలు ఉంటుంది. 20 గంటలకు పైగా పనిచేయడానికి అనుమతించే తాత్కాలిక విధానం గడువు ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
Canada working hours: కెనడాలోని విద్యా సంస్థల్లో సెప్టెంబర్ నుంచి ఫాల్ సెమిస్టర్ ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం ఫాల్ సెమిస్టర్ నుంచి కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థులు పని చేసే గంటల పరిమితిని వారానికి 24 గంటలకు నిర్ధారిస్తూ కెనడా నిర్ణయం తీసుకోనుంది. అంతర్జాతీయ విద్యార్థులు ప్రతి వారం 20 గంటలకు పైగా పనిచేయడానికి అనుమతించే తాత్కాలిక విధానం మంగళవారంతో ముగియనుండటంతో కెనడా (canada) ఇమ్మిగ్రేషన్, శరణార్థులు, పౌరసత్వ మంత్రి మార్క్ మిల్లర్ సోమవారం ఒట్టావాలో ఈ ప్రకటన చేశారు.
చదువుపై శ్రద్ధ పెట్టడం కోసం..
‘‘కెనడా (canada) కు వచ్చే విద్యార్థులు ఇక్కడే చదువుకోవడానికి ఉండాలి. అందువల్ల, విద్యార్థులు వారానికి 24 గంటలు మాత్రమే పనిచేయడానికి అనుమతించడం వల్ల వారు ప్రధానంగా వారి చదువుపై దృష్టి పెడతారు. అవసరమైనంత మేరకే పని చేసే అవకాశం ఉంటుంది’’ అని ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ కెనడా (IRCC) ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో ప్రవేశపెట్టిన విధానంలో విదేశీ విద్యార్థులు ప్రతి వారం 40 గంటలు పనిచేయడానికి అనుమతి ఉంది. అంటే విదేశీ విద్యార్థులు వారానికి పని చేసే సమయం దాదాపు 16 గంటలు తగ్గుతుంది.
సెలవుల్లో అన్ లిమిటెడ్
అయితే, అలాంటి విద్యార్థులు వేసవి సెలవుల వంటి నిర్ణీత సెలవు రోజుల్లో అపరిమిత గంటలు పని చేయవచ్చు. ప్రభుత్వ విద్యా సంస్థ లైసెన్స్ తో నడుస్తున్న ప్రైవేటు కాలేజీలో చేరిన విదేశీ విద్యార్థులకు, వారి గ్రాడ్యుయేషన్ పూర్తయిన తరువాత, పోస్ట్ గ్రాడ్యుయేట్ వర్క్ పర్మిట్ పొందడానికి అర్హులు కాదని ఐఆర్ సీ సీ (IRCC) స్పష్టం చేసింది. ఈ నిబంధన ఈ సంవత్సరం మే 15వ తేదీ తరువాత జాయిన్ అయిన విదేశీ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది.
స్టడీస్ కూడా ముఖ్యమే..
అకడమిక్ ఫలితాల్లో రాజీ పడకుండా విద్యార్థులకు పని చేసే అవకాశాన్ని కల్పించడం మధ్య "తగిన సమతుల్యతను" సాధించడానికి ఈ విధానం ప్రయత్నిస్తుందని ఐఆర్సీసీ పేర్కొంది. కెనడా (canada) కు వచ్చే విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేసింది. 2023 లో మొత్తం 6,84,385 స్టడీ పర్మిట్ల () ను కెనడా జారీ చేసింది. వాటిలో 278,860 వర్క్ పర్మిట్లను భారతీయ విద్యార్థులే సాధించారు.