Kolkata doctor case : ‘వ్యవస్థ మొత్తం విఫలమైంది- వైద్యులు నిర్భయంగా ఎలా పనిచేస్తారు?’
16 August 2024, 13:09 IST
Kolkata doctor case : కోల్‌కతా హాస్పిటల్లో జరిగిన విధ్వంసంపై కలకత్త హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వ్యాఖ్యానించింది. డాక్టర్లు నిర్భంగా ఎలా పనులు చేస్తారని ప్రశ్నించింది.
కోల్‌కతా హైకోర్టు
కోల్‌కతా మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్యను నిరసిస్తూ ఆగస్టు 14న అర్ధరాత్రి జరిగిన నిరసనల సందర్భంగా కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఆవరణలో జరిగిన విధ్వంసంపై కలకత్తా హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. వ్యవస్థ మొత్తం విఫలమైందని వ్యాఖ్యానించింది.
ఆసుపత్రిలో జరిగిన విధ్వంసంపై తమకు వచ్చిన ఈమెయిల్స్ కారణంగా కోర్టు ఈ కేసును లిస్ట్ చేసిందని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.
'ఇది ప్రభుత్వ యంత్రాంగం పూర్తి వైఫల్యం. సంఘటనా స్థలంలో పోలీసు బలగాలు ఉన్నాయి. సొంత మనుషులను కాపాడుకోలేకపోయారా? ఇది దయనీయ పరిస్థితి. ఈ వైద్యులు నిర్భయంగా ఎలా పనిచేస్తారు?' అని చీఫ్ జస్టిస్ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
“మీరు ఏ కారణం చేతనైనా సీఆర్పీసీ 144 సెక్షన్ జారీ చేస్తారు. ఇంత గందరగోళం జరుగుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉండాల్సింది,” అని ఆయన అన్నారు. 7వేల మంది కేవలం నడుచుకుంటూనే వచ్చి ఉండరని తెలిపారు.
ఆందోళనకారుల వేషధారణలో దాదాపు 40 మంది ఆసుపత్రి ఆవరణలోకి ప్రవేశించి ఆస్తులను ధ్వంసం చేశారని, పోలీసులపై రాళ్లు రువ్వారని, దీంతో జనాన్ని చెదరగొట్టేందుకు బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించాయని కోల్‌కతా పోలీసులు తెలిపారు.
కోల్‌కతా వైద్యురాలి హత్యపై నిరసనల సమయంలో ఆసుపత్రిపై దాడి జరిగింది. కర్రలు, ఇటుకలు, రాడ్లతో వచ్చిన దుండగులు ఎమర్జెన్సీ వార్డు, నర్సింగ్ స్టేషన్, మందుల దుకాణంతో పాటు ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్స్ డిపార్ట్మెంట్ (ఓపీడీ)లోని ఓ విభాగాన్ని ధ్వంసం చేశారు. చుట్టుపక్కల ఉన్న పలు సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. పోలీసు వాహనం బోల్తా పడటంతో పాటు పలు ద్విచక్రవాహనాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు.
ట్రైనీ డాక్టర్ మరణంపై దర్యాప్తును కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు కోల్‌కతా పోలీసుల నుంచి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐకి బదిలీ చేశారు.
మమతా బెనర్జీ నిరసన..
వైద్యురాలి హత్య నేపథ్యంలో ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదన్న ఆరోపణల వెల్లువెత్తుతున్న సమయంలో మమతా బెనర్జీ స్వయంగా నిరసనలకు దిగుతుండటం వార్తలకెక్కింది. నిందితులకు ఉరిశిక్ష విధించాలంటూ ఆమె శుక్రవారం సాయంత్రం నిరసన చేపట్టనున్నారు. ఆదివారంలోపు ప్రకటన చేయాలని సీబీఐకి డెడ్‌లైన్ ఇచ్చారు.
మరోవైపు కోల్‌కతా వైద్యురాలి అత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సంచలన ప్రకటన చేసింది. కోల్‌కతా వైద్యురాలి మృతికి నిరసనగా దేశవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఆగస్ట్ 17 నుంచి 24 గంటల పాటు వైద్య సేవలను నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.