తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  తప్పొప్పులు అమ్మాయిలకే చెప్తారా? అబ్బాయిలకు చెప్పరా? : లింగ సమానత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

తప్పొప్పులు అమ్మాయిలకే చెప్తారా? అబ్బాయిలకు చెప్పరా? : లింగ సమానత్వంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Anand Sai HT Telugu

28 August 2024, 6:47 IST

google News
    • Bombay High Court : మహారాష్ట్ర థానే జిల్లాలోని బద్లాపూర్ లైంగిక వేధింపుల కేసుపై బాంబే హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. లింగ సమానత్వంపై గురించి ధర్మాసనం మాట్లాడింది.
బాంబే హైకోర్టు(ఫైల్ ఫోటో)
బాంబే హైకోర్టు(ఫైల్ ఫోటో)

బాంబే హైకోర్టు(ఫైల్ ఫోటో)

బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల కేసును బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని, వారి ఆలోచనా విధానంలో మార్పు రావాలని వ్యాఖ్యానించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.

బద్లాపూర్ ఈస్ట్‌లోని ఓ ప్రీ-ప్రైమరీ స్కూల్‌లో ఇద్దరు 4 ఏళ్ల బాలికలపై వాచ్ మెన్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఈ కేసును బాంబే హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్భంగా పలు వ్యాఖ్యలు చేసింది కోర్టు.

ప్రీ ప్రైమరీ స్థాయి నుండే పిల్లలకు లింగ సమానత్వం, లింగ సున్నితత్వం గురించి బోధించేలా విద్యా శాఖ చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. 'పురుష ఆధిపత్యం ఇప్పటికీ ఉంది. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పాలి. అప్పటి వరకు నిర్భయ లాంటి ఈ చట్టాలన్నీ పనిచేయవు.' అని ధర్మాసనం పేర్కొంది.

అబ్బాయిలకు చెప్పండి

మనం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటామని కోర్టు చెప్పింది. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు బోధించకూడదు? అని ప్రశ్నించింది. చిన్నప్పుడే అబ్బాయిల ఆలోచనా ధోరణిలో మార్పు రావాలని కోర్టు అభిప్రాయపడింది. మహిళలను గౌరవించడం నేర్పించండని న్యాయమూర్తులు పేర్కొంటూ సరైన అవగాహన అవసరమని చెప్పారు.

రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ పోలీసు అధికారి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, మహిళా ఐపీఎస్ అధికారి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసి సమస్యను అధ్యయనం చేయాలని కోర్టు ఆదేశించింది. అనుసరించాల్సిన నియమాలు, మార్గదర్శకాలను సిఫార్సు చేయాలని కోర్టు సూచించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా పాఠశాలలు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.

పోలీసుల తీరుపై అసంతృప్తి

ఈ అంశంపై విచారణ సందర్భంగా బద్లాపూర్ పోలీసుల విచారణలో తొలుత వ్యవహరించిన తీరుపై న్యాయమూర్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించి ఉండాల్సిందని అన్నారు. 'ఒక అమ్మాయిని, ఆమె కుటుంబాన్ని స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు రావాలని కోరారు. బద్లాపూర్ పోలీసులు వారి ఇంట్లో వాంగ్మూలం నమోదు చేసే ప్రయత్నం కూడా చేయలేదు. బద్లాపూర్ పోలీసుల దర్యాప్తులో తీవ్ర లోపం జరిగింది.' అని న్యాయమూర్తులు అన్నారు.

ముగ్గురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినట్లు అడ్వకేట్ జనరల్ (ఏజీ) బీరేంద్ర సరాఫ్ తెలిపారు. నిందితుడికి మూడు పెళ్లిళ్లు అయ్యాయని, అతని భార్యల వాంగ్మూలాలు నమోదు చేశామని అడ్వకేట్ జనరల్ తెలిపారు. పాఠశాల ఆవరణలోని సీసీటీవీ ఫుటేజీలపై కోర్టు ప్రశ్నించగా, హార్డ్ డిస్క్‌ను స్వాధీనం చేసుకున్నామని, దానిని పరిశీలిస్తున్నామని చెప్పారు. మెుదట మగ వైద్యుడు బాలికలను పరీక్షించడంపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

అసలు ఏం జరిగిందంటే?

కిండర్ గార్డెన్‌లో చదువుతున్న నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలపై నిందితుడు పాఠశాలలోని టాయిలెట్‌లో బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అటెండర్ తమను అనుచితంగా తాకాడని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రిన్సిపాల్‌, క్లాస్‌ టీచర్‌, మహిళా అటెండర్‌ను బాధ్యులను చేస్తూ సస్పెండ్‌ చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. పూర్తి కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టాపిక్

తదుపరి వ్యాసం