బాలికలపై పాఠశాల టాయిలెట్‌లో లైంగిక వేధింపులు.. రైల్వే స్టేషన్‌కు వచ్చి వందలాది మంది నిరసన
Thane Protest : థానే జిల్లాలోని బద్లాపూర్‌లోని స్కూల్‌లో ఇద్దరు బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారు. పాఠశాలలో పనిచేసే అటెండర్ వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. దీంతో పాఠశాలలోని పిల్లల తల్లితండ్రులు బద్లాపూర్ ర్వైల్వే స్టేషన్‌లో నిరసన తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని ఒక పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల బాలికలపై జరిగిన లైంగిక వేధింపుల ఘటనకు వ్యతిరేకంగా ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వందలాది మంది తల్లిదండ్రులు బద్లాపూర్ రైల్వే స్టేషన్ వద్ద పట్టాలపైకి వచ్చి నిరసన తెలిపారు. దీంతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఉదయం నుంచి స్థానిక రైల్వేస్టేషన్‌లో బైఠాయించి ఆందోళన చేపట్టారు. నిరసన కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి అప్ అండ్ డౌన్ రూట్లలో రైళ్ల రాకపోకలపై ప్రభావం పడింది. పాఠశాల యాజమాన్యం బాలికలపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి ప్రిన్సిపాల్, ఇద్దరు సిబ్బందిని సస్పెండ్ చేసింది.
కిండర్ గార్డెన్‌లో చదువుతున్న నాలుగు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల కేసులో పాఠశాల అటెండర్‌ను ఆగస్టు 17న థానే పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆగ్రహించిన తల్లిదండ్రులు ఈ ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.
బద్లాపూర్‌లో జరిగిన సంఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే చెప్పారు. 'ఈ విషయంలో ఇప్పటికే సిట్ ఏర్పాటు చేశాం. సంఘటన జరిగిన పాఠశాలపై కూడా చర్య తీసుకోబోతున్నాం. దోషులు ఎవరైనా విడిచిపెట్టబోం.' అని ఏకనాథ్ షిండే అన్నారు.
ఇద్దరు బాలికలపై లైంగిక వేధింపుల కేసులో త్వరితగతిన విచారణ జరిపి సత్వర న్యాయం చేయాలని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేశారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన పాఠశాల బీజేపీ నేతలతో ముడిపడి ఉందని ఆరోపించారు. కేసును త్వరితగతిన ఛేదించాలని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరారు.
అసలు ఏం జరిగిందంటే?
నిందితుడు పాఠశాలలోని టాయిలెట్‌లో బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అటెండర్ తమను అనుచితంగా తాకాడని బాలికలు తమ తల్లిదండ్రులకు చెప్పడంతో ఫిర్యాదు చేశారు. అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రిన్సిపాల్, క్లాస్ టీచర్, మహిళా అటెండర్‌ను బాధ్యులను చేస్తూ సస్పెండ్ చేసినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. దీనిపై పాఠశాల యాజమాన్యం క్షమాపణలు కూడా చెప్పింది.
హౌస్ కీపింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు తెలిపింది. ఈ ఘటన నేపథ్యంలో పాఠశాల ఆవరణలో నిఘా పెంచనున్నట్లు పాఠశాల అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారనే ఆరోపణతో బద్లాపూర్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జిని కూడా బదిలీ చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు అంతా కలిసి సంస్థ వెలుపల గుమిగూడి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంత సేపటి తర్వాత బ్యానర్లు, ప్లకార్డులు పట్టుకుని పెద్ద సంఖ్యలో మహిళలతో సహా ఆందోళనకారులు బద్లాపూర్ రైల్వే స్టేషన్ వచ్చారు. ట్రాక్‌లపైకి రావడంతో రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. పోలీసులు, ఇతర అధికారులు పరిస్థితిని అదుపు చేయడం కష్టతరంగా మారింది.