Terror attacks : పోలీస్ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్ బస్సులపై ఉగ్ర దాడులు.. 72మంది మృతి!
Pakistan Terror attacks : పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో వేర్పాటువాద మిలిటెంట్లు అల్లకల్లోలం సృష్టించారు. పోలీసులు, పారామిలటరీ స్టేషన్లు, రైల్వే లైన్లు, బస్సులపై జరిపిన దాడులు చేశారు. ఈ ఘటనల్లో ఇప్పటివరకు 72 మందికి పైగా మరణించారు.
ఉగ్ర దాడులతో పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ అల్లాడిపోయింది. వేర్పాటువాద మిలిటెంట్లు పేట్రేగిపోవడంతో ఆ ప్రాంతం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. పోలీసులు, ఫెడరల్ పారామిలటరీ స్టేషన్లు, రైల్వే లైన్లు, ప్యాసింజర్ బస్సులపై ఉగ్రవాదులు దాడి చేసి. ఈ దాడుల్లో 72మంది మరణించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) సాయుధ మిలిటెంట్ గ్రూప్ ఈ దాడులకు బాధ్యత వహించింది.
పక్కా ప్రణాళికతో పాకిస్థాన్‌లో అరాచకం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ ఆది, సోమవారాల్లో జరిగిన దాడుల గురించి ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రధాన రహదారిపై బస్సులు, ట్రక్కులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడుల్లో 14 మంది సైనికులు, పోలీసులు, 21 మంది మిలిటెంట్లు మృతి చెందినట్లు పాక్ సైన్యం తెలిపింది.
హైవేపై జరిగిన దాడుల్లో 23 మంది చనిపోయారని, సాయుధులు ప్రయాణికుల ఐడీలను తనిఖీ చేసి మరీ పలువురిని కాల్చి చంపి, వాహనాలను తగలబెట్టారని స్థానిక అధికారులు తెలిపారు.
బలూచిస్థాన్ రాజధానిని పాకిస్థాన్‌లోని మిగిలిన ప్రాంతాలతో కలిపే రైలు వంతెనపై పేలుళ్లు సంభవించడంతో రైలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇరాన్‌కు వెళ్లే రైలు లింక్‌పై కూడా ఉగ్రవాదులు దాడి చేశారని రైల్వే అధికారి మహ్మద్ కాశీఫ్ తెలిపారు.
రైల్వే బ్రిడ్జిపై దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో ఆరు మృతదేహాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఆదివారం రాత్రి బలూచిస్థాన్‌లో హైవేను దిగ్బంధించిన సాయుధులు ప్రయాణికులను వాహనాల నుంచి దింపి, వారి గుర్తింపు కార్డులను పరిశీలించిన తర్వాత కాల్చిచంపారని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ అయూబ్ అచక్ జాయ్ తెలిపారు.
మూసాఖైల్ ప్రాంతంలోని హైవేపై ట్రక్కులతో సహా 35 వాహనాలకు నిప్పుపెట్టారు.
సాయుధులు ప్రయాణీకులను చంపడమే కాకుండా బొగ్గును రవాణా చేసే ట్రక్కుల డ్రైవర్లను కూడా హతమార్చారని ఆ ప్రాంత డిప్యూటీ కమిషనర్ హమీద్ జహీర్ తెలిపారు.
పాకిస్థాన్‌లోని తూర్పు ప్రావిన్స్ పంజాబ్‌కు చెందిన కార్మికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు తెగబడుతున్నారు.
గతంలో, వీరు చైనాకు సంబంధించిన గ్వాదర్ డీప్ వాటర్ పోర్టును, పశ్చిమాన ఉన్న గోల్డ్-కాపర్ మైన్స్పై కూడా దాడి చేశారు.
ఉగ్రవాదుల దాడితో విలవిల..
పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్ అయిన బలూచిస్థాన్‌లోని పోలీసులు, భద్రతా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన దాడిలో 10 మంది మృతి చెందారు. కలాత్ సెంట్రల్ జిల్లాలో ఫెడరల్ పారామిలిటరీ అయిన బలూచిస్థాన్ లెవీస్ స్టేషన్‌పై సాయుధ మిలిటెంట్లు దాడిలో మరణించిన వారిలో ఆరుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు పౌరులు, ఒక గిరిజన పెద్ద ఉన్నారని పోలీసు అధికారి దోస్తాన్ ఖాన్ దస్తి తెలిపారు.
రెండు దక్షిణ తీరప్రాంత పట్టణాల్లోని పోలీస్ స్టేషన్లపై కూడా దాడులు జరిగాయని, అయితే ఈ ఘటనల్లో మృతుల సంఖ్య ఇంకా నిర్ధారణ కాలేదని అధికారులు తెలిపారు.
భద్రతా దళాలు ప్రతీకారం తీర్చుకుంటాయని, బాధ్యులను శిక్షిస్తామని ప్రధాని షెహబాజ్ షరీఫ్ హామీ ఇచ్చారు.
బీఎల్ఏ ప్రకటన..
వీటితో పాటు మరిన్ని దాడులకు పాల్పడినట్లు బీఎల్ఏ పాత్రికేయులకు ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. అయితే వీటిని అధికారులు ధృవీకరించలేదు.
వ్యూహాత్మక ఓడరేవు, గోల్డ్- కాపర్ గని వంటి చైనా నేతృత్వంలోని ప్రధాన ప్రాజెక్టులకు నిలయమైన వనరులు అధికంగా ఉన్న నైరుతి ప్రావిన్స్ని విడదీయడానికి దశాబ్దాలుగా చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ దాడులు జరిగాయి.
అధిక స్థాయిలో పేదరికంతో బాధపడుతున్న ప్రావిన్స్‌లో గ్యాస్, ఖనిజ వనరులను అన్యాయంగా దోపిడీ చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రభుత్వంతో పోరాడుతున్న అనేక తిరుగుబాటు సమూహాల్లో బీఎల్ఏ అతిపెద్దది. చైనాను బహిష్కరించి బలూచిస్థాన్‌కు స్వాతంత్ర్యం ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోంది.
దక్షిణ ఓడరేవు జిల్లా గ్వాదర్‌కు చెందిన ఒక మహిళతో సహా నలుగురు ఆత్మాహుతి బాంబర్లు ప్రధాన పారామిలిటరీ స్థావరంపై దాడిలో పాల్గొన్నారని, అయితే పాకిస్థాన్ అధికారులు ఆ దాడిని ఇంకా ధృవీకరించలేదని ఈ బృందం తెలిపింది.
2006లో పాక్ భద్రతా దళాల చేతిలో హతమైన బలూచ్ జాతీయవాద నేత అక్బర్ బుగ్తీ మృతికి సోమవారంతో 18ఏళ్లు నిండాయి.
సంబంధిత కథనం