Cryptocurrency: టెస్లా ప్రకటనతో పతనమైన బిట్‌కాయిన్..
21 July 2022, 11:26 IST
TESLA-BITCOIN: క్రిప్టోకరెన్సీ నుంచి 75 శాతం మేర అమ్మేసినట్టు టెస్లా వెల్లడించడంతో బిట్‌కాయిన్ కొంత పతనమై తిరిగి పుంజుకుంటోంది.
బిట్‌కాయిన్
న్యూయార్క్: ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా తన వర్చువల్ కరెన్సీ హోల్డింగ్స్ నుంచి 75 శాతం అమ్మేసినట్టు దాని అధినేత ఇలోన్ మస్క్ బిట్‌కాయిన్ ప్రతికూలంగా ట్రేడై.. క్రమంగా పుంజుకుంటోంది.
టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇలాన్ మస్క్ తన కంపెనీ ఓవరాల్ లిక్విడిటీపై ఉన్న ఆందోళన కారణంగా వర్చువల్ కరెన్సీ విక్రయించినట్టు తెలిపారు.
క్రిప్టో కరెన్సీలో నెంబర్ 1 గా ఉన్న బిట్‌కాయిన్ ఈ వార్తల నేపథ్యంలో 1.04 శాతం నష్టపోయింది. తిరిగి పుంజుకుని 22,982 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
క్రిప్టోకరెన్సీ బాగా ప్రాచుర్యం పొందినప్పుడు, భారీ వృద్ధి ఉంటుందన్న అంచనాలు పీక్‌లో ఉన్నప్పుడు టెస్లా కంపెనీ ఒక ఏడాదికాలంపాటు మొత్తంగా 1.5 బిలియన్ డాలర్ల మేర క్రిప్టోకరెన్సీ కొనుగోలు చేసింది. అయితే రెండో త్రైమాసికంలో టెస్లా 936 మిలియన్ డాలర్ల విలువైన బిట్‌కాయిన్ కరెన్సీని అమ్మేసింది.
క్రిప్టోకరెన్సీలకు మద్దతుగా ఇలాన్ మస్క్ చాలాసార్లు మాట్లాడారు. క్రిప్టో భవిష్యత్తు, తాను కొనుగోలు చేసిన డిజిటల్ అసెట్స్ గురించి చేసే ప్రస్తావలు డోజీకాయిన్, బిట్‌కాయిన్‌ల విలువను పెంచుతూ వచ్చాయి.
టెస్లా ఆదాయ ఫలితాల వెల్లడి సందర్భంగా ఇలాన్ మస్క్ మాట్లాడుతూ కోవిడ్-19 వల్ల ఉన్న లాక్‌డౌన్ అనిశ్చిత పరిస్థితుల కారణంగా, కంపెనీ ప్రొడక్షన్ విషయంలో అది సృష్టించిన సవాళ్ల కారణంగా క్రిప్టోకరెన్సీ అమ్మినట్టు ఆయన తెలిపారు.
‘మేం నగదు నిల్వలను పెంచుకోవడం మాకు ముఖ్యమైన అవసరంగా ఉంది..’ అని మస్క్ చెప్పారు. ‘భవిష్యత్తులో మేం బిట్‌కాయిన్ డోజీకాయిన్ హోల్డింగ్స్‌ను పెంచుకుంటాం. అందువల్ల ఇది (అమ్మకాలు) బిట్‌కాయిన్ భవిష్యత్తుపై మా అభిప్రాయం కాదు. కంపెనీ ఓవరాల్ లిక్విడిటీపై ఉన్న ఆందోళన కారణంగానే అమ్మేశాం..’ అని వ్యాఖ్యానించారు. అలాగే తాము డోజీకాయిన్ కరెన్సీని అమ్మలేదని ఇలాన్ మస్క్ స్పష్టం చేశారు.
టెస్లా దాదాపు 2 నెలల పాటు పేమెంట్‌గా బిట్‌కాయిన్‌ను స్వీకరించి మే 2021లో నిలిపివేసింది. బిట్‌కాయిన్ కరెన్సీ మైన్ చేసేందుకు అవసరమైన పునరుత్పాధక ఇంధనాన్ని మదించడం పూర్తయ్యాక తిరిగి బిట్‌కాయిన్‌ను పేమెంట్‌గా స్వీకరిస్తామని ఆయన ప్రకటించారు.
ఈ వారం బిట్‌కాయిన్ క్రమంగా పుంజుకుంటోంది. దశాబ్దాల గరిష్ట స్థాయి ద్రవ్యోల్భణాన్ని యూఎస్ ఫెడరల్ రిజర్వ్ అదుపులో పెట్టగలదని మదుపరులు ఆశాభావంతో ఉండడంతో స్టాక్ మార్కెట్ల కోవలోనే బిట్‌కాయిన్ కూడా తిరిగి పుంజుకుంటోంది. గత ఏడాది 69 వేల డాలర్లకు చేరుకున్న బిట్‌కాయిన్ ఈ ఏడాది ఆర్థిక మాంద్యపు భయాల నేపథ్యంలో 18 వేల డాలర్లకు పడిపోయింది.