తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bitcoin Price: బిట్‌కాయిన్ జోష్.. ఆల్ట్ కాయిన్స్ దూకుడు

Bitcoin price: బిట్‌కాయిన్ జోష్.. ఆల్ట్ కాయిన్స్ దూకుడు

19 July 2022, 9:32 IST

    • Bitcoin price:: క్రిప్టోకరెన్సీ మార్కెట్లు కోలుకుంటున్నట్టు కనిపిస్తోంది. బిట్‌కాయిన్, ఆల్ట్‌కాయిన్స్ తిరిగి పుంజుకుంటున్నాయి.
బిట్‌కాయిన్, ఇథేరియం, డోజికాయిన్, రిపుల్, లైట్‌కాయిన్ తదితర క్రిప్టోకరెన్సీలు
బిట్‌కాయిన్, ఇథేరియం, డోజికాయిన్, రిపుల్, లైట్‌కాయిన్ తదితర క్రిప్టోకరెన్సీలు (REUTERS)

బిట్‌కాయిన్, ఇథేరియం, డోజికాయిన్, రిపుల్, లైట్‌కాయిన్ తదితర క్రిప్టోకరెన్సీలు

క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌లో మంగళవారం జోష్ కనిపించింది. బిట్ కాయిన్ ఒక నెల గరిష్టానికి చేరింది. ఈ నేపథ్యంలో ఆల్ట్‌కాయిన్స్‌గా పిలుచుకునే చిన్న చిన్న క్రిప్టో కరెన్సీలు కూడా దూకుడుగా కనిపించాయి.

ప్రపంచంలో అత్యంత విలువైన క్రిప్టోకరెన్సీగా పేరున్న బిట్‌కాయిన్ 6.8 శాతం పెరిగి 23,000 డాలర్ల దిశగా పయనిస్తోంది. ఇథీరియం ఒక దశలో 11 శాతం బలపడింది. సొలానా డబుల్ డిజిట్ వృద్ధి సాధించింది.

బిట్‌కాయిన్ 19 వేల డాలర్ల నుంచి 22 వేల డాలర్లకు పుంజుకోవడానికి అనేక అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దేశాలు తమ ద్రవ్యవిధానాలు కఠినతరం చేయడం, క్రిప్టో రుణదాతలు బిచాణా ఎత్తేయడం వంటి పరిస్థితుల వల్ల బిట్‌కాయిన్ సహా అనేక క్రిప్టో కరెన్సీలు నేల చూపులు చూశాయి.

అయితే బిట్‌కాయిన్ స్థిరంగా పురోగమిస్తే వెనువెంటనే క్రిప్టో అసెట్స్ మళ్లీ భారీగా పెరిగే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు మరీ భారీగా ఏం పెరగవన్న అంచనాల నేపథ్యంలో బిట్‌కాయిన్, ఇథీరియం మళ్లీ పెరిగేందుకు అవకాశం ఉన్నట్టు క్రిప్టో నిపుణులు భావిస్తున్నారు.

‘మనం ఇప్పుడే బిట్‌కాయిన్ కదలికలో మార్పులు చూశాం. ఈ ఏడాది చివరివరకు ఈ మార్పు కొనసాగుతుందని భావిస్తున్నాం..’ అని క్రిప్టో వాలెట్ సొల్యూషన్ ప్రొవైడర్ కేక్ డెఫి కో-ఫౌండర్ జూలియన్ హాస్ప్ విశ్లేషించారు.

ఇథేరియం బ్లాక్ చైన్ నెట్‌వర్క్ ఎనర్జీ వినియోగాన్ని తగ్గించే సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లో పురోగతి కనిపించడంతో గత వారం ఈథర్‌లో జోష్ కనిపించింది.

సాధారణంగా క్రిప్టోకరెన్సీ ర్యాలీల్లో బిట్‌కాయిన్‌ను ఆల్ట్‌కాయిన్స్ అధిగమిస్తాయి. అలాగే క్రిప్టోకరెన్సీ మార్కెట్లు పతనమవుతున్న సమయంలో బిట్‌కాయిన్ల కంటే వేగంగా పతనమవుతాయి. ఇవి స్పెక్యులేటర్స్‌కు ఫేవరైట్‌గా ఉంటాయి. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. స్టాక్‌మార్కెట్లో కూడా స్మాల్ క్యాప్స్ వేగంగా పడిపోతాయి. వేగంగా పుంజుకుంటాయి.

‘బిట్‌కాయిన్ తిరిగి 22 వేల డాలర్ల స్థాయికి పుంజుకుంది. షార్ట్-సెల్లర్స్ వైదొలగడమే ఇందుకు కారణం..’ అని ఊండా కార్ప్ సీనియర్ మార్కెట్ అనలిస్ట్ ఎడ్వర్డ్ మోయా చెప్పారు. ద్రవ్య విధానంలో తీవ్ర కాఠిన్యం ఉండకపోవచ్చన్న అంచనాల మధ్య ఇప్పుడు క్రిప్టోలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయని ఆయన అన్నారు.

బిట్‌కాయిన్ తిరిగి పుంజుకోవడంతో ఈ ఏడాది పెరిగిన నష్టాలు తగ్గినట్టయ్యాయి. 69 వేల డాలర్ల నుంచి ఒక దశలో 17 వేల డాలర్లకు బిట్‌కాయిన్ పడిపోయింది. ప్రస్తుతం టోక్యో మార్కెట్లో బిట్‌కాయిన్ 22,220 వద్ద ట్రేడవుతోంది. మొత్తంగా క్రిప్టోకరెన్సీ మార్కెట్ విలువ 1 ట్రిలియన్ స్థాయికి కోలుకుంది.

తదుపరి వ్యాసం