Bharat Ratna 2024: సిసలైన రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ కు భారత రత్న
09 February 2024, 15:12 IST
Bharat Ratna to Chaudhary Charan Singh: మాజీ ప్రధాని, ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్ కు భారత ప్రభుత్వం శుక్రవారం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ప్రకటించింది. చరణ్ సింగ్ జూలై 28, 1979 నుండి జనవరి 14, 1980 వరకు భారత ప్రధానమంత్రిగా పనిచేశారు.
మాజీ ప్రధాని, రైతు నాయకుడు చౌదరి చరణ్ సింగ్
మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు భారత అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న' ప్రదానం చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. చరణ్ సింగ్ తో పాటు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ లకు కూడా ఈ అత్యున్నత గౌరవం (Bharat Ratna) దక్కనుంది.
రైతు నాయకుడు
ఉత్తరప్రదేశ్ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర హోం మంత్రిగా, ఉప ప్రధానిగా చరణ్ సింగ్ పని చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై, రైతులపై ఆయనకు అపార ప్రేమాభిమానాలు. దేశానికి వెన్నెముక రైతులేనని ఆయన ప్రగాఢంగా నమ్మేవారు. ప్రధానిగా పని చేసిన స్వల్ప కాలంలో కూడా ఆయన రైతులకు అనుకూలమైన చట్టాలను రూపొందించేందుకు కృషి చేశారు. రైతుల పట్ల ఆయనకున్న అంకితభావం, ప్రజాస్వామ్యం పట్ల ఆయనకున్న నిబద్ధత మనందరికీ స్ఫూర్తిదాయకమని ప్రధాని మోదీ కొనియాడారు.
స్వాతంత్య్ర పోరాటంలో..
1903, డిసెంబర్23న చౌధరి చరణ్ సింగ్ ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ఒక మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఆగ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థి అయిన సింగ్ న్యాయశాస్త్రంలో శిక్షణ పొంది ఘజియాబాద్ లో ప్రాక్టీస్ ప్రారంభించారు. 1929లో మీరట్ కు మకాం మార్చారు. యువకుడిగా జాతీయ కాంగ్రెస్ లో చేరి బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడారు. గాంధీ మహాత్ముడి స్ఫూర్తితో స్వాతంత్య్ర సంగ్రామంలో పాలు పంచుకున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత యూపీలో క్రియాశీల రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. 1975 నాటి ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడారు.
చౌదరి చరణ్ సింగ్ రాజకీయ ప్రస్థానం
సింగ్ తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు. 1937లో చాప్రౌలి నుంచి తొలిసారి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన ఆయన ఆ తర్వాత 1946, 1952, 1962, 1967లో తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉత్తర ప్రదేశ్ లో 1946లో గోవింద్ వల్లభ్ పంత్ ప్రభుత్వంలో చౌదరి చరణ్ సింగ్ పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు. 1951లో న్యాయ, సమాచార శాఖ మంత్రిగా నియమితులయ్యే ముందు ఆయన పలు శాఖల్లో పనిచేశారు. 1967లో కాంగ్రెస్ ను వీడి సంయుక్త విధాయక్ దళ్ సంకీర్ణ నేతగా ఎన్నికై తొలిసారి ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 1970లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.
1979లో ప్రధానిగా స్వల్పకాలం.
1979లో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని జనతా పార్టీ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆ ప్రభుత్వంలో హోం మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఉప ప్రధానిగా ఉన్నారు. జనతా ప్రభుత్వం నుంచి జనసంఘ్ వైదొలిగిన తర్వాత.. కాంగ్రెస్ మద్దతుతో 1979 జూలై 28న ప్రధానిగా చౌధరి చరణ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. కానీ లోక్ సభలో తన మెజారిటీని నిరూపించుకోకముందే ఇందిరాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్ తన ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రధాని పదవికి చరణ్ సింగ్ రాజీనామా చేశారు. 1980 జనవరి 14 వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగారు.