Hajj: మక్కాలో 51.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు; ఎండలకు మాడిపోతున్న హజ్ యాత్రికులు; 550 మంది మృతి
19 June 2024, 11:52 IST
Hajj pilgrimage: పవిత్ర హజ్ యాత్రలో ఉన్న ముస్లిం భక్తులు సౌదీ అరేబియాలో భారీగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల బారిన పడి మాడిపోతున్నారు. అక్కడి గరిష్ట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్ కు చేరుకుంటున్నాయని సమాచారం. తట్టుకోలేని ఎండల కారణంగా ఇప్పటివరకు సుమారు 550 మంది హజ్ యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు.
550 మంది హజ్ యాత్రికుల మృతి
Hajj pilgrims హజ్ యాత్రలో కనీసం 550 మంది యాత్రికులు మరణించారని అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. ఈ సంవత్సరం నమోదవుతున్న అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతల కారణంగా చాలామంది హజ్ యాత్రికులు చనిపోతున్నారని వివరించారు.
ఈజిప్ట్ వారే ఎక్కువ
మండే ఎండల కారణంగా చనిపోతున్న వారిలో కనీసం 323 మంది ఈజిప్షియన్లు ఉన్నారని అరబ్ దౌత్యవేత్తలు తెలిపారు. మక్కాలోని అల్-ముయిసెమ్ సమీపంలోని ఆసుపత్రి మార్చురీ నుంచి అందిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు చెబుతున్నామన్నారు. ‘వారంతా (ఈజిప్షియన్లు) ఎండ వేడి కారణంగానే మరణించారని వైద్యులు తెలిపారు’ అని వారు స్పష్టం చేశారు. ఈ ఎండల కారణంగా కనీసం 60 మంది జోర్డానియన్లు కూడా మరణించారని దౌత్యవేత్తలు తెలిపారు. మొత్తంగా, ఈ సంవత్సరం హజ్ (Hajj pilgrims) యాత్రలో పాల్గొన్నవారిలో 577 మరణించారని వెల్లడించారు. మక్కాలోని అల్ ముమైసెమ్ లోని మార్చురీలో మొత్తం 550 మంది ఉన్నారని దౌత్యవేత్తలు తెలిపారు.
మక్కాలో 51.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు
జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలని ఇస్లాం ను పాటించే ప్రతీ వ్యక్తి కోరుకుంటాడు. ఇస్లాం ఐదు మూలస్తంభాలలో హజ్ ఒకటి. గత నెలలో సౌదీ అరేబియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు ప్రతి దశాబ్దానికి కనీసం 0.4 డిగ్రీల సెల్సియస్ (0.72 డిగ్రీల ఫారెన్ హీట్) పెరుగుతున్నాయి. మక్కాలోని గ్రాండ్ మసీదు వద్ద సోమవారం ఉష్ణోగ్రతలు 51.8 డిగ్రీల సెల్సియస్ (125 ఫారెన్ హీట్)కు చేరుకున్నాయని సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈజిప్ట్ స్పందన
హజ్ యాత్రలో గల్లంతైన ఈజిప్షియన్ల కోసం సౌదీ అధికారులతో కలిసి గాలిస్తున్నామని ఈజిప్ట్ తెలిపింది. కాగా, మక్కాలో వడదెబ్బతో బాధపడుతున్న 2,000 మందికి పైగా యాత్రికులకు చికిత్స అందిస్తున్నట్లు సౌదీ అధికారులు నివేదించారు. కానీ ఆదివారం నుండి ఆ సంఖ్యను అప్డేట్ చేయలేదు. మరణాలపై సమాచారం ఇవ్వలేదు. గత ఏడాది కనీసం 240 మంది హజ్ యాత్రికులు మరణించినట్లు వివిధ దేశాలు నివేదించాయి, వీరిలో ఎక్కువ మంది ఇండోనేషియన్లు ఉన్నారు. మక్కా వెలుపల ఉన్న మినాలో హజ్ యాత్రికులు తమ తలలపై బాటిల్స్ తో నీళ్లు పోసుకోవడం కనిపించింది. అక్కడి వాలంటీర్లు యాత్రికులకు చల్లటి నీరు, చాక్లెట్ ఐస్ క్రీం వంటి వాటని అందజేశారు. యాత్రికులు గొడుగులు వాడాలని, పుష్కలంగా నీరు తాగాలని, పగటిపూట ఎండకు గురికాకుండా ఉండాలని సౌదీ అధికారులు సూచించారు.