Video : ఈత కొట్టేందుకు జలపాతంలో దూకిన వ్యక్తి.. చూస్తుండగానే నీటి ప్రవాహంలో..
01 July 2024, 20:08 IST
- Pune Crime News : విహారం కోసం వెళ్లిన సమయంలో చేసే చిన్న చిన్న తప్పులు ప్రాణాల మీదకు తెస్తున్నాయి. లోనావాలాలో ఒకే కుటుంబం జలపాతంలో గల్లంతైన ఘటన మరవకముందే పూణేలో మరో విషాదం చోటు చేసుకుంది
జలపాతంలో కొట్టుకుపోయిన వ్యక్తి
మహారాష్ట్రలో విహారయాత్ర కోసం వెళ్లిన కొందరి కుటుంబాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే లోనావాలాలో ఓ కుటుంబ గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనను చాలా మందిని కంటతడిపెట్టించింది. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. పూణేలోని కొంతమంది కలిసి పిక్నిక్‌కు వెళ్లగా అందులో ఓ వ్యక్తి ఈత కొట్టేందుకు జలపాతంలోకి దూకాడు. తర్వాత విగతజీవిగా మారాడు.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి పిక్నిక్ వచ్చిన ఆ వ్యక్తి కాసేపు ఎంజాయ్ చేశాడు. ఈదగలడనే నమ్మకంతో జలపాతంలోకి దూకాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతను జలపాతం ప్రవాహానికి కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
మహారాష్ట్రలోని లోనావాలాలో జలపాతంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు గల్లంతైన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకుంది. పూణేలోని తమ్హిని ఘాట్‌లో నీటి ప్రవాహంలో వ్యక్తి కొట్టుకుపోయాడు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సహా 20 మందితో ట్రెక్‌కి వచ్చారు. జలపాతంలో అప్పటికే నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. అయితే అదేమీ పట్టించుకోకుండా.. ఈదగలననే నమ్మకంతో జలపాతంలోకి ఓ వ్యక్తి దూకాడు. అయితే, అతను జలపాతం ప్రవాహానికి కొట్టుకుపోయాడు.
ఆ వ్యక్తి 10 ఏళ్ల కూతురు తన తండ్రి చేసిన సాహసకృత్యాన్ని రికార్డ్ చేస్తూ ఉంది. కానీ ఊహించని ఘటన జరిగింది. వీడియోలో ఆ వ్యక్తి నీటి ప్రవాహంలో దూకడం చూడవచ్చు. బయటకు వచ్చేందుకు తిరిగి ఈత కొట్టడానికి ప్రయత్నించాడు. కానీ చాలా రోజులుగా నీరు వస్తున్న కారణంగా రాళ్లకు పట్టు దొరకలేదు. ఏదో ఒక రాయిని పట్టుకునేందుకు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది. అతను చివరకు జలపాతం అంచున ఉన్న ఒక రాయిని పట్టుకునే సమయంలో నీరు అతడిని కిందకు నెట్టేసింది.
ఆదివారం లోనావాలాలోని జలపాతంలో ఒక కుటుంబం కొట్టుకుపోయిన వీడియో కూడా బయటకు వచ్చింది. పిల్లలతో సహా ఆ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు ఉధృతంగా ప్రవహించే జలపాతం మధ్యలో చిక్కుకుపోయారు. ఒకరినొకరు పట్టుకుని, బలమైన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వారిలో ఇద్దరు మాత్రమే ఈదగలిగారు. మిగిలినవారి మృతదేహాల కోసం అధికారులు గాలిస్తున్నారు.