OBC certificates : ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లు రద్దు- హైకోర్టు సంచలన తీర్పు!
22 May 2024, 18:00 IST
- OBC certificates cancelled : 2010 తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తున్నట్టు కీలక తీర్పును వెలువరించింది కలకత్తా హైకోర్టు. తీర్పులో పలు కీలక విషయాలను ప్రస్తావించింది.
ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లు రద్దు- హైకోర్టు సంచలన తీర్పు!
West Bengal OBC certificate case : కలకత్తా హైకోర్టు.. మరో సంచలన తీర్పును వెలువరించింది. 2010 తర్వాత నుంచి ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ.. 2011లో అధికారంలోకి వచ్చారు. అంటే.. మమతా బెనర్జీ ప్రభుత్వం ఇచ్చిన అన్ని ఓబీసీ సర్టిఫికేట్లు రద్దైపోయినట్టే!
ఓబీసీ సర్టిఫికేట్లను కలకత్తా హైకోర్టు రద్దు చేసిన విషయంపై మమతా బెనర్జీ స్పందించారు.
"ఇది బీజేపీ కుట్ర. నేను ఈ ఆదేశాలను అంగీకరించను. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓబీసీ రిజర్వేషన్ కోటా కొనసాగుతుంది. ఇంటింటికీ వెళ్లి సర్వే చేసి, ఈ బిల్లును రూపొందించాము. ఆ తర్వాత అసెంబ్లీలో పాసైంది," అని మమతా బెనర్జీ అన్నారు.
"కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుని బీజేపీ కుట్రకు పాల్పడుతోంది. బీజేపీ.. ఇంత దారుణానికి ఎలా పాల్పడుతుంది?" అని బంగాల్ సీఎం మండిపడ్డారు.
OBC certificate Bengal : ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ.. ఇప్పటికే సర్వీసులో ఉన్నా- లేదా రిజర్వేషన్ వల్ల లబ్ధిపొందిన పొందిన లేదా రాష్ట్ర సెలక్షన్ ప్రాసెస్‌లో ఎంపికైన వారిపై ఈ ఆదేశాలు ఎలాంటి ప్రభావం చూపించవని కలకత్తా హైకోర్టు చెప్పింది.
రాష్ట్రంలో అనేక మందిపై ఈ ప్రభావం ఉంటుందని తెలుస్తోంది.
పశ్చిమ్ బెంగాల్ వెనకబడిన వర్గాల చట్టం 2012 చుట్టూ ఈ వివాదం నెలకొంది. ఇందులోని నియమాలకు వ్యతిరేకంగా గతంలో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ చేపట్టిన అనంతరం.. చట్టంలోకి ఓబీసీలంటూ చేర్చిన పలు వర్గాల వారికి రిజర్వేషన్లను తొలగిస్తున్నట్టు జస్టిస్ తపబ్రత చక్రవర్తి, జస్టిస్ రాజశేఖర్ మంతతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 2010కి ముందు ఓబీసీలో ఉన్న 66 వర్గాలు మాత్రం అలాగే కొనసాగుతాయని స్పష్టం చేసింది.
2010 మార్చ్ 5- 2012 మే 11 వరకు 42 వర్గాలను ఓబీసీ కేటగిరీలో చేర్చుతూ ప్రభుత్వం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను కలకత్తా హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేటగిరీల్లో అక్రమాలు జరిగాయన్న అభిప్రాయాలు ఇందుకు కారణం.
Calcutta High court OBC certificate ruling : రాష్ట్ర ఓబీసీ కేటగిరీలో మరిన్ని వర్గాలను జోడించేందుకైనా లేక ఇతర వర్గాలను తొలగించేందుకైనా.. నేషనల్ కమిషన్ ఫర్ బాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993ని పరిగణలోకి తీసుకుని చట్టసభలో రిపోర్టును ప్రవేశపెట్టాలని రాష్ట్ర వెనకబడిన వర్గాల సంక్షేశాఖకు ఆదేశాలిచ్చింది కలకత్తా హైకోర్టు.