Union Govt on OBC Reservation : ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించలేం : కేంద్రం
Union Govt on OBC Reservation : ఓబీసీ రిజర్వేషన్లపై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రిజర్వేషన్లను 50 శాతానికి పెంచే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లేదని పేర్కొంది. రూర్బన్ మిషన్ కింద ఏపీలోని 3 ప్రాంతాలను ఎంపిక చేసినట్లు వెల్లడించింది.
Union Govt on OBC Reservation : వెనుకబడిన వర్గాలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తోన్న ఓబీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం స్పష్టత ఇచ్చింది. విద్యా, ఉపాధి రంగాలలో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వం వద్ద లేదని సామాజిక న్యాయ శాఖ సహాయ మంత్రి సుశ్రీ ప్రతిమా భౌమక్ బుధవారం రాజ్యసభలో స్పష్టం చేశారు. ఓబీసీలకు జనాభా ప్రాతిపదికపై విద్యా, ఉపాధి రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. న్యాయమైన డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుందా ? ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటి అంటూ వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం వెల్లడించారు.
ఇందిరా సహాని కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు లోబడి ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు మంత్రి సుశీ ప్రతిమా చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలతో కలిపి మొత్తం 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జనాభా ప్రాతిపదికపై ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలంటూ దేశ వ్యాప్తంగా వివిధ వ్యక్తులు, సంస్థల నుంచి ప్రభుత్వానికి వినతులు అందుతున్నాయని వివరించారు.
ఏపీలో మూడు రూర్బన్ మిషన్ క్లస్టర్ల అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్‌లోని అరకు లోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లను శ్యామ ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ మిషన్ కింద ఎంపిక చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ మిషన్ కింద 21 విభాగాల్లో చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు. గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం, అగ్రి సర్వీసెస్ ప్రాసెసింగ్, విద్య, స్వయం సహాయక బృందాల ఏర్పాటుతో ఉపాధి కల్పన, ఆరోగ్యం, వివిధ గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేయడం, గ్రామాలకు పైపులతో సురక్షిత తాగు నీటి సదుపాయం కల్పించడం వంటి కార్యక్రమాలు రూర్బన్ మిషన్ కింద చేపడతారు. గ్రామీణ గృహ నిర్మాణం, ప్రజా రవాణా సౌకర్యాల కల్పన, సామాజిక మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రోత్సాహం, గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించి, వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారు.