Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం-heart disease diabetes drugs to cost less as govt cuts essential medicine price ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Diabetes Medicine Price Cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu

డయాబెటిస్, గుండె జబ్బులు, కాలేయ సమస్యలు, ఒంటి నొప్పులు, యాంటాసిడ్లు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్స్‌ చికిత్సలో వాడే మందుల ధరలను ప్రభుత్వం తగ్గించింది.

డయాబెటిస్ ఔషధాలపై ధరల తగ్గింపు

గుండె జబ్బులు, మధుమేహం, ఇతర అనారోగ్య పరిస్థితులకు సంబంధించిన ఆరు ఫార్ములేషన్ల ధరలను, సాధారణంగా వాడే 41 మందుల ధరలను ప్రభుత్వం తగ్గించింది. మధుమేహం, ఒంటి నొప్పులు, గుండె సంబంధ పరిస్థితులు, కాలేయ సమస్యలు, యాంటాసిడ్లు, ఇన్ఫెక్షన్లు, అలెర్జీలు, మల్టీవిటమిన్లు, యాంటీబయాటిక్స్ కోసం ఉద్దేశించిన మందుల ధరలను తగ్గించినట్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పిపిఎ) నోటిఫికేషన్ తెలిపింది. 

మందులు, ఫార్ములేషన్ల ధరలను మార్చడం ఎన్పీపీఏ వంటి నియంత్రణ సంస్థ సాధారణ విధి. ప్రజలకు అవసరమైన మందులపై గరిష్ట పరిమితి ఉండేలా చూస్తామని, ధర చౌకగా ఉండేలా చూస్తామని ఎన్పీపీఏ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

కాలేయంలో గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గించడం ద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగించే డాపాగ్లిఫ్లోజిన్ మెట్ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ వంటి మందుల ధరలను ఒక మాత్రకు గతంలో ఉన్న రూ. 30 ధర నుంచి ఇప్పుడు రూ. 16గా నిర్ణయించారు. 

అదేవిధంగా పోవిడోన్-అయోడిన్, ఆర్నిడాజోల్ లేపనం 1 గ్రాముకు రూ. 4గా నిర్ణయించారు. ఇబుప్రోఫెన్, పారాసిటమాల్ మాత్రలను రూ.1.59గా, రక్తపోటును తగ్గించేందుకు వాడే హైడ్రోక్లోరోథియాజైడ్ మాత్రలను రూ. 10.45గా నిర్ణయించారు. అంటువ్యాధుల కోసం వాడే సెఫ్టాజిడైమ్ మరియు అవిబాక్టమ్ (సోడియం ఉప్పుగా) పౌడర్ ఒక సీసాకు రూ .1569.94 గా నిర్ణయించారు.

యాంటాసిడ్ యాంటిగ్యాస్ జెల్ కూడా ఇప్పుడు చౌకగా లభించనుంది. ఎందుకంటే దాని రిటైల్ ధర రూ. 10 నుండి 1 మిల్లీలీటర్‌‌కు రూ. 0.56 గా నిర్ణయించారు. అటర్వాస్టాటిన్, క్లోపిడోగ్రెల్, ఆస్పిరిన్ క్యాప్సూల్ ధరలు ఒక క్యాప్సూల్‌కు రూ.13.84గా నిర్ణయించారు.

ఉబ్బసం లక్షణాలను నియంత్రించడానికి మరియు ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడే బుడెసోనైడ్ మరియు ఫార్మోటెరోల్ వంటి కలయికలను మరింత చౌకగా మార్చారు. ఒక మోతాదు ధరను రూ. 6.62 కు తగ్గించారు. 

దేశంలో 10 కోట్లకు పైగా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్టు అంచనా. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసులు ఉన్న దేశాలలో ఒకటి. ఈ ధర తగ్గింపు వల్ల మందులు, ఇన్సులిన్‌పై ఆధారపడిన చాలా మందికి ప్రయోజనం లభిస్తుంది.

ఔషధాల ధరలను నిర్ణయించే నియంత్రణ సంస్థ ఎన్‌పీపీఏ 143వ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.