Delhi-Bengaluru flight: 174 మంది ప్రయాణికులతో విమానం బెంగళూరు వెళ్తుండగా.. బాంబు బెదిరింపు కాల్
16 October 2024, 15:01 IST
విమాన ప్రయాణికులను, విమానయాన సంస్థలను బాంబు బెదిరింపులు వణికిస్తున్నాయి. గత రెండు రోజుల్లో దాదాపు 8 దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. బుధవారం ఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరిన ‘ఆకాశ ఎయిర్’ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో, ఆ విమానాన్ని ఢిల్లీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపు
బుధవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఆకాశ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు సమాచారం వచ్చింది. విమానంలో బాంబు ఉందన్న సమాచారంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని తిరిగి ఢిల్లీకి తీసుకువచ్చి, అత్యవసర ల్యాండింగ్ చేశారు.
174 మంది ప్రయాణికులు
2024 అక్టోబర్ 16న ఢిల్లీ నుంచి బెంగళూరుకు ముగ్గురు చిన్నారులు, ఏడుగురు సిబ్బంది సహా 174 మంది ప్రయాణికులతో ఆకాశ ఎయిర్ లైన్స్ క్యూపీ 1335 విమానం బయల్దేరింది. టేకాఫ్ తీసుకుని బెంగళూరు వైపు వెళ్తున్న సమయంలో.. పైలట్ కు భద్రతా హెచ్చరికలు అందాయి. ఆకాశ ఎయిర్ విమానం క్యూపీ 1335కు ఆకాశ ఎయిర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందాలు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని, తగిన జాగ్రత్తలతో విమానాన్ని ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించాలని పైలట్ కు సూచించారు. విమానంలో బాంబు ఉందన్న సమాచారం వచ్చిందని, వెంటనే విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ కోసం ఢిల్లీ విమానాశ్రయానికిక తీసుకురావాలని పైలట్ కు సూచించారు. దాంతో, విమానం మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీలో సేఫ్ గా ల్యాండ్ అయింది. ఈ సందర్భంగా, ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
యూఎస్ వెళ్తున్న విమానాలకు..
అమెరికాకు వెళ్లే ఏడు విమానాలకు, ఢిల్లీ నుంచి ముంబై వెళ్తున్న మరో విమానానికి మంగళవారం సోషల్ మీడియా (social media) హ్యాండిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి. దాంతో ఆయా విమానాలను సమీప, సురక్షిత విమానాశ్రయాల్లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ముంబై నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన మరుసటి రోజే మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ ద్వారా బెదిరింపులు రావడం వందలాది మంది ప్రయాణికులు, విమాన సిబ్బందిని ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పటివరకు వచ్చిన అన్ని బాంబు బెదిరింపులను ఫేక్ గా ప్రకటించారు.