Russia Ukraine war : రష్యా- ఉక్రెయిన్ శాంతికి మోదీ ప్రయత్నాలు- మాస్కోకు అజిత్ దోవల్!
08 September 2024, 11:15 IST
- Russia Ukraine war PM Modi : రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చల కోసం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ మాస్కోకు వెళుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ గత రెండు నెలల్లో రష్యా, ఉక్రెయిన్‌లో పర్యటించిన విషయం తెలిసిందే.
గత నెల ఉక్రెయిన్ పర్యటలో జెలెన్స్కీతో మోదీ..
రష్యా- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికి, ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ మాస్కోకు వెళ్లనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ రెండు నెలల వ్యవధిలో అటు రష్యా, ఇటు ఉక్రెయిన్‌లో పర్యటించి, ఆయా దేశాధినేతలను కలిసిన అనంతరం ఈ వార్త వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.
రష్యా- ఉక్రెయిన్ శాంతికి ప్రయత్నాలు..
ప్రధాని మోదీ జులైలో రష్యా వెళ్లారు. ఆగస్టు నెలలో ఉక్రెయిన్‌కి వెళ్లి, ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీని కలిశారు. అనంతరం ఆగస్ట్ 27న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి ఫోన్ కాల్ చేశారు. ఈ కాల్లో భాగంగా తన ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్‌కి మోదీ వివరించినట్టు సమాచారం. ఇరు దేశాల మధ్య శాంతికి మధ్యవర్తిత్వం వహించేందుకు భారత్ సిద్ధంగా ఉందని పుతిన్‌కి మోదీ చెప్పారట.
"తన ఉక్రెయిన్ పర్యటన గురించి పుతిన్‌తో మోదీ మాట్లాడారు. చర్చలు, దౌత్య చర్యల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని నొక్కి చెప్పారు. తద్వారా శాంతిని స్థాపించాలని పిలుపునిచ్చారు," అని పీఎంఓ ఓ ప్రకటన విడుదల చేసింది.
సోర్స్ ప్రకారం.. శాంతి చర్చల కోసం అజిత్ దోవల్‌ని మాస్కో పంపాలను ఈ ఫోన్ కాల్‌లోనే ఇరు దేశాల నేతలు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే అజిత్ దోవల్ మాస్కోకు వెళ్లనున్నారు.
ఇదీ చూడండి:- BJP J-K poll manifesto: మహిళలకు రూ.18,000, 5 లక్షల ఉద్యోగాలు సహా 25 హామీలు; జమ్ముకశ్మీర్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో
అయితే అజిత్ దోవల్ పర్యటనకు సంబంధించి ప్రస్తుతం వివరాలు అందుబాటులో లేవు. త్వరలోనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి స్థాపనపై ప్రధాని మోదీ ఇప్పటికే అనేకమార్లు వ్యాఖ్యానించారు. శాంతి కోసం పిలుపునిచ్చారు. ఆగస్ట్‌లో ఉక్రెయిన్ పర్యటనలో సైతం ఈ విషయాన్ని పునరుద్ఘటించారు. "భారత్ ఎప్పుడు తటస్థంగా లేదు. భారత్ ఎప్పుడూ శాంతి పక్షానే ఉంటుంది," అని మోదీ అన్నారు.
అటు ఉక్రెయిన్‌తో విభేదాల మధ్య పుతిన్ సైతం భారత్‌ని కీలకంగా చూస్తున్నారు. ఉక్రెయిన్ విషయంపై తాము చర్చలు జరుపుతున్న 3 దేశాల్లో భారత్ కూడా ఉందని రష్యా చెప్పడం ఇందుకు కారణం.
రష్యాతో యుద్ధానికి చెక్ పెట్టడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదు అని ఉక్రెయిన్, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ భావిస్తున్నారు. జెలెన్స్కీ మాత్రమే కాదు ప్రపంచంలోని అనేక దేశాలు ఈ విషయంపై ఏకీభవిస్తున్నాయి. మధ్యవర్తిత్వం వహించి శాంతిని నెలకొల్పడంలో ఇండియా కీలకంగా ఉంటుందని భావిస్తున్నాయి.
2022 ఫిబ్రవరిలో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తోంది. సప్లై-చెయిన్ వ్యవస్థ ఇంకా కోలుకోలేదు. వీటన్నింటి మధ్య ఇప్పుడు అజిత్ దోవల్ మాస్కోకు వెళుతున్నారన్న వార్తకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన చేపట్టే చర్చల్లో సానుకుల ఫలితాలు వెలువడాలని అందరు ఆశిస్తున్నారు.