తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Air Kerala : ఆకాశంలో ఎగిరేందుకు ఎయిర్ కేరళ రెడీ.. తక్కువ ధరకే విమాన టికెట్లు!

Air Kerala : ఆకాశంలో ఎగిరేందుకు ఎయిర్ కేరళ రెడీ.. తక్కువ ధరకే విమాన టికెట్లు!

Anand Sai HT Telugu

11 July 2024, 10:22 IST

google News
    • Air Kerala Flight Charges : దేశంలో మరో కొత్త సివిల్ ఎయిర్‌లైన్ సర్వీసు ప్రారంభం కానుంది. చాలా తక్కువ ధరకు ప్రజలు విమానంలో ప్రయాణించేందుకు ఎయిర్ కేర‌ళ పేరుతో ఈ విమాన సేవ‌ను ప్రవేశపెడుతున్నారు.
ఎయిర్ కేరళ విమాన సర్వీసులు
ఎయిర్ కేరళ విమాన సర్వీసులు

ఎయిర్ కేరళ విమాన సర్వీసులు

మరో కొత్త ఎయిర్ లైన్స్ ప్రారంభం అవనుంది. విమాన టికెట్ల ధరను సామాన్యులకు అందుబాటు ధరలో తీసుకురావాలని ఈ విమాన సేవలు మెుదలుకానున్నాయి. దుబాయ్‌కి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు అఫీ అహ్మద్, అయూబ్ కల్లాడ స్థాపించిన ఎయిర్ కేరళ పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా లెటర్ ఆఫ్ ఇంటెంట్ (NOC) మంజూరు అయింది. జెట్‌ఫ్లై ఏవియేషన్ పేరుతో రిజిస్టర్ అయిన ఈ ఎయిర్‌లైన్స్‌కు వచ్చే మూడేళ్లపాటు విమానాలు నడిపేందుకు అనుమతి లభించింది.

ఈ కొత్త విమాన సర్వీసు ప్రారంభమైతే కేరళ నుంచి ప్రారంభమయ్యే తొలి విమానయాన సంస్థగా ఎయిర్ కేరళ అవతరిస్తుంది. ఈ విమానయాన సంస్థ 2025 నాటికి తమ సర్వీసులను ప్రారంభించాలని ఆలోచిస్తుంది. ఎయిర్ ఆపరేషనల్ సర్టిఫికేట్‌కు సంబంధించి విమానాల కొనుగోలుతో సహా అన్ని విమాన ప్రమాణాలకు అనుగుణంగా ఎయిర్ కేరళ కట్టుబడి ఉందని అయూబ్ కల్లాడ చెప్పారు. డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్ని భద్రతా ప్రమాణాలను పూర్తి చేయడం విమానాల నిర్వహణకు చాలా ముఖ్యమైన మైలురాయి అని ఆయన అన్నారు.

అయితే విమాన సర్వీసును ప్రారంభించేందుకు ఇప్పటి వరకు చేసిన సన్నాహాలు సంతృప్తికరంగా ఉన్నాయని అఫీ అహ్మద్ తెలిపారు. ఈ దశకు చేరుకోవడానికి అనేక సవాళ్లు కూడా ఉన్నాయన్నారు. ఇది మా ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితం అని.. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నుండి అనుమతి పొందడానికి చాలా ప్రయత్నం చేశామని చెప్పారు. ఈ విషయంలో చాలా మంది మమ్మల్ని ప్రశ్నించగా, ఈ ప్రయత్నం నిజం చేయడం సాధ్యం కాదని అన్నారని తెలిపారు. ఈ విషయంలో NOC లభ్యత చాలా ముఖ్యమైన మైలురాయిగా అఫీ అహ్మద్ చెప్పుకొచ్చారు.

ఎయిర్ కేరళ ఎయిర్‌లైన్స్ ప్రారంభంలో మూడు ATR 72-600 విమానాలను ప్రవేశపెట్టనుంది. పూర్తిగా కొనుగోలు, లీజింగ్ అవకాశాలపై దృష్టి కేంద్రీకరించనుంది. ఎయిర్ కేరళ ప్రారంభంలో టైర్ 2, టైర్ 3 నగరాల్లో పనిచేస్తుంది. విమానాల సంఖ్య 20కి పెరిగిన తర్వాత అంతర్జాతీయ రూట్లలో సర్వీసును ప్రారంభిస్తామని అహ్మద్ తెలిపారు.

దేశంలోని చిన్న నగరాల్లో తక్కువ ధరకు విమాన సేవలను అందించడమే ఎయిర్ కేరళ కోరిక, లక్ష్యమని అఫీ అహ్మద్ అన్నారు. గతేడాది ఎయిర్‌కెరళ.కామ్ డొమైన్‌ను మిలియన్ దిర్హామ్‌లకు కొనుగోలు చేశారు.

టాపిక్

తదుపరి వ్యాసం