Best Airlines of 2023 । ప్రపంచంలో టాప్ 20 ఎయిర్‌లైన్స్ ఇవే.. ఇండియా నుంచి అదొక్కటే!
Best airlines of 2023: ప్రయాణికులకు విలాసవంతమైన సౌకర్యాలు, మంచి ఆతిథ్యం, మంచి ఆఫర్లు ఇవ్వడంలో కొన్ని విమానయాన సంస్థలు ముందు వరుసలో నిలుస్తాయి. అలాంటి విమానయాన సంస్థల్లో 2023 టాప్ 20 ఎయిర్‌లైన్స్ ఏమున్నాయో ఇక్కడ తెలుసుకోండి.
Best Airlines of 2023: విమానయానం చేయడం చాలా మందికి ఒక కల అయితే, విమానయానం చేసే చాలా మందికి కూడా సకల సౌకర్యాలతో విహరించాలనే కల ఉంటుంది. ఎందుకంటే విమానాలలోనూ వివిధ రకాలు ఉంటాయి, వాటిలోనూ ఎగువ తరగతి, దిగువ తరగతి అంటూ బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్ ఉంటాయి. ఎకానమీ క్లాస్‌లో ప్రయాణం సాధారణంగా ఉంటే, బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించే వారికి మర్యాదలు వేరేగా ఉంటాయి. అందులోనూ కొన్ని విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు మరింత విలాసవంతమైన సౌకర్యాలను అందిస్తాయి, గొప్ప ఆఫర్లు ప్రకటిస్తాయి, మంచి ఆతిథ్యం ఇస్తాయి. తమ ప్రయాణంలో ఆహ్లాదకరమైన అనుభవాన్ని పంచుతూ వారి మన్ననలు అందుకుంటాయి. ప్రయాణిస్తే ఇలాంటి విమానాల్లోనే ప్రయాణించాలి, అలాంటి విమానయానం చేయాలి అనిపిస్తాయి. ఈ జాబితాలో కొన్ని విమానయాన సంస్థలు ముందు వరుసలో నిలుస్తాయి. అలాంటి విమానయాన సంస్థల్లో టాప్ 20 ఎయిర్‌లైన్స్ ఏమున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లైయర్స్ వార్షిక పోల్ ప్రకారం, 2023 ఏడాదికి గానూ సింగపూర్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అత్యుత్తమ విమానయాన సంస్థగా నిలిచింది. తరువాతి స్థానంలో ఖతార్ ఎయిర్‌వేస్ ఉంది. అయితే, ఖతార్ ఎయిర్‌వేస్ ఉత్తమ బిజినెస్ క్లాస్ ఎయిర్‌లైన్, ఉత్తమ సీట్లు, లాంజ్‌తో సహా ఉత్తమ బిజినెస్ క్లాస్ ఆఫర్‌లలో ఆధిపత్యం కొనసాగిస్తుంది.
స్కైట్రాక్స్ వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డ్స్ 2023లో జపాన్‌కు చెందిన ఆల్ నిప్పన్ ఎయిర్‌వేస్, ఎమిరేట్స్, జపాన్ ఎయిర్‌లైన్స్ మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి, మిడిల్ ఈస్టర్న్ క్యారియర్ రెండవ స్థానానికి పడిపోయింది. టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఆరవ స్థానంలో, ఎయిర్ ఫ్రాన్స్ ఏడవ స్థానంలో ఉన్నాయి. బెస్ట్ క్యాబిన్ క్రూ అవార్డు గరుడ ఇండోనేషియాకు దక్కగా, క్లీనెస్ట్ ఎయిర్‌లైన్ అవార్డు ఏఎన్‌ఏకు దక్కింది.
బడ్జెట్ రంగంలో, ఎయిర్ ఏసియా ప్రపంచంలోనే అత్యుత్తమ తక్కువ-ధర విమానయాన సంస్థగా పేరుపొందింది. మరోవైపు స్కూట్ ఎయిర్‌లైన్స్ తక్కువ-ధరతో సుదూర ప్రాంతాలకు చేరవేసే విమానసంస్థగా నిలిచింది. ఈ ఏడాది అత్యధిక రేటింగ్స్ పొందిన ఉత్తర అమెరికా ఎయిర్‌లైన్ డెల్టా, గత సంవత్సరం కంటే నాలుగు స్థానాలు ఎగబాకి టాప్ 20లో నిలిచింది. యూరోపియన్ విమానసంస్థలు ఈ ఏడాది కొంచెం మెరుగైన రేటింగ్స్ పొందుతున్నాయి.
వరల్డ్ ఎయిర్‌లైన్ అవార్డుల కోసం 100కు పైగా దేశాల నుండి వివిధ విమానయాన సంస్థలు పోటీపడ్డాయి. ఆన్‌లైన్ కస్టమర్ సర్వే ద్వారా రేటింగ్స్, ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఇది సెప్టెంబరు 2022 నుండి మే 2023 వరకు కొనసాగింది. ఆ ప్రకారంగా ప్రపంచవ్యాపంగా టాప్ 20 విమానయాన సంస్థలు ఏమున్నాయో నిర్ణయించారు.
2023కి సంబంధించి టాప్ 20 ఎయిర్‌లైన్స్ ఇవే:
- సింగపూర్ ఎయిర్‌లైన్స్
- ఖతార్ ఎయిర్వేస్
- ఆల్ నిప్పాన్ ఎయిర్‌వేస్ (ANA)
- ఎమిరేట్స్
- జపాన్ ఎయిర్లైన్స్
- టర్కిష్ ఎయిర్లైన్స్
- ఎయిర్ ఫ్రాన్స్
- కాథే పసిఫిక్ ఎయిర్‌వేస్
- ఎవా ఎయిర్
- కొరియన్ ఎయిర్
- హైనాన్ ఎయిర్‌లైన్స్
- స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్
- ఎతిహాద్ ఎయిర్‌వేస్
- ఐబెరియా
- ఫిజీ ఎయిర్‌వేస్
- విస్తారా
- క్వాంటాస్ ఎయిర్‌వేస్
- బ్రిటిష్ ఎయిర్‌వేస్
- ఎయిర్ న్యూజిలాండ్
- డెల్టా ఎయిర్ లైన్స్
టాప్ 20లో విస్తారా ఒక్కటే భారతదేశానికి చెందిన ఎయిర్‌లైన్స్, ఇది టాటా గ్రూప్‌కు చెందిన ఎయిర్‌లైన్స్, విస్తారా 16వ స్థానంలో నిలిచింది. ఇక, మనదేశంలో ప్రముఖంగా వినిపించే ఇండిగో విమాన సంస్థ 43వ స్థానంలో నిలిచింది.
సంబంధిత కథనం