తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ipo | ‘ఐపీఓ’లు అలాట్​ అవ్వట్లేదా.. ఇలా చేయండి!

IPO | ‘ఐపీఓ’లు అలాట్​ అవ్వట్లేదా.. ఇలా చేయండి!

HT Telugu Desk HT Telugu

03 May 2022, 9:57 IST

google News
    • ఐపీఓలకు మంచి డిమాండ్​ ఉంటే ఓవర్​సబ్​స్క్రైబ్​ అవుతాయి. ఆ సందర్భాల్లో చాలా మందికి.. ఎన్ని అప్లికేషన్లు వేసినా ఐపీఓ అలాట్​ అవ్వదు. అయితే.. ఐపీఓ అలాట్​మెంట్​ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు కొన్ని టిప్స్​ ఉన్నాయి. అవేంటంటే..
ఐపీఓ అలాట్​మెంట్​ టిప్స్​
ఐపీఓ అలాట్​మెంట్​ టిప్స్​ (HT)

ఐపీఓ అలాట్​మెంట్​ టిప్స్​

IPO allotment tips | రేపే మార్కెట్​లో ఎల్​ఐసీ ఐపీఓ ఓపెన్​కానుంది. ఇక ఇన్వెస్టర్లు.. ఐపీఓ కోసం డబ్బులను సిద్ధం చేసుకుంటున్నారు. ఐపీఓకు హైప్​ కూడా చాలా ఎక్కువగానే ఉంది. ఫలితంగా స్టాక్​ మార్కెట్​ బిగినర్లు కూడా ఐపీఓలో పెట్టుబడులు పెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. అయితే.. ఒక్కోసారి ఐపీఓలకు భారీ డిమాండ్​ ఉంటుంది. అందువల్ల ఐపీఓకు అప్లై చేసినా, షేర్లు అలాట్​ అవ్వకపోవచ్చు. ఇటీవలి కాలంలో మార్కెట్​లోకి వచ్చిన అనేక సంస్థలకు భారీ డిమాండ్​ దక్కడంతో.. బిడ్లు వేసిన చాలా మందికి షేర్లు అలాట్​ అవ్వలేదు. బంపర్​ లిస్టింగ్​తో ఆ సంస్థలు స్టాక్​ మార్కెట్​లోకి అడుగుపెట్టడం, ఆ వార్తలు చూసి వారందరు నిరుత్సాహపడటం.. మామూలు విషయమైపోయింది. అయితే.. కొన్ని టిప్స్​ పాటిస్తే.. ఐపీఓ అలాట్​మెంట్​ అవకాశాలు మెరుగుపడతాయి. అవేంటంటే..

ఆ ఆలోచనను పక్కనపెట్టండి..

రిటైల్​ కోటాలో ఎన్ని అప్లికేషన్లు వచ్చినా.. వాటన్నింటిని సెబీ ఒకే విధంగా పరిగణిస్తుంది. అంటే.. మీరు రూ. లక్ష పెట్టి అప్లై చేసి, ఐపీఓ అలాట్​ అయిపోతుందిలే! అని అనుకోవడానికి లేదు. ఒవర్​సబ్​స్క్రైబ్​ అయితే.. షేర్లు అలాట్​ కాకపోవచ్చు. అందువల్ల భారీగా అప్లికేషన్లు వేస్తే ఐపీఓ దక్కుతుందని అన్న ఆలోచనను పక్కనపెట్టండి.

ఒక్కోసారి.. 10 అప్లికేషన్లు వేసినా అలాట్​ అవ్వదు. ఒక్కోసారి.. ఒక్క అప్లికేషన్​కే ఐపీఓ అలాట్​మెంట్​ అయిపోతుంది.

వేరువేరు డిమాట్​ అకౌంట్లు ఉండాల్సిందే..

రిటైలర్లు రూ. 2లక్షల వరకు ఐపీఓ కోసం బిడ్లు వేయచ్చు. వాస్తవానికి వీటన్నింటినీ ఒకటే డిమాట్​ అకౌంట్​ నుంచి బిడ్లు వేసుకోవచ్చు. కానీ అలా చేయకపోవడం శ్రేయస్కరం. వేరువేరు డిమాట్​ అకౌంట్ల నుంచి బిడ్లు వేస్తే.. ఐపీఓ అలాట్​ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐపీఓ అలాట్​మెంట్​ అప్పుడు.. పాన్​ కార్డులను సెబీ పరిశీలిస్తుంది. అందువల్ల ఒకటే పాన్​కార్డుపై ఎన్ని బిడ్లు వేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకే.. మీ కుటుంబసభ్యులు, స్నేహితుల చేత డిమాట్​ అకౌంట్లు ఓపెన్​ చేయించి, వాటిని వాడుకుంటే మంచిది. ఆయా డిమాట్​ అకౌంట్లకు వేరువేరు పాన్​కార్డులు ఉంటాయి కదా.

కట్​-ఆఫ్​ ప్రైజ్​ ఉత్తమం..

How to get IPO allotment | ఐపీఓకు వచ్చే సంస్థలకు ప్రైజ్​ బ్యాండ్​(లోయర్​ బ్యాండ్​- అప్పర్​ బ్యాండ్​) అని ఉంటుంది. అప్పర్​ బ్యాండ్​నే కట్​-ఆఫ్​ ప్రైజ్​ అని కూడా అంటారు. ఉదాహరణకు ఎల్​ఐసీ ఐపీఓ ప్రైజ్​ బ్యాండ్​ రూ. 902- రూ. 949. వాస్తవానికి ఈ రేంజ్​ మధ్యలో ఎక్కడైనా కోట్​ చేసి బిడ్లు వేసుకోవచ్చు. కానీ కట్​-ఆఫ్​ ప్రైజ్​ వద్ద బిడ్లు వేస్తే.. ఐపీఓ అలాట్​ అయ్యే అవకాశాలు పెరుగుతాయి.

చివరి నిమిషం వరకు వేచిచూడకండి..

చాలా మంది ఇన్వెస్టర్లు.. ఐపీఓకు ఉన్న డిమాండ్​ని చూసి బిడ్లు వేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇది మంచి స్ట్రాటజీ అనే చెప్పుకోవాలి. కానీ చివరి నిమిషం వరకు వేచిచూసి.. ఒక్కసారి హడావుడి పడాల్సి ఉంటుంది. ఫలితంగా అప్లికేషన్లలో తప్పులు దొర్లుతూ ఉంటాయి. అదే జరిగితే ఐపీఓ అలాట్​ అవ్వకపోవచ్చు. పైగా.. ఒక్కోసారి సాంకేతిక లోపాల కారణంగా అసలు బిడ్లే దాఖలు చేయలేకపోవచ్చు.

స్టాక్​ మార్కెట్​ బిగినర్లకు ఐపీఓ అలాట్​మెంట్​పై అనేక సందేహాలు ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో.. చివరి రోజు వరకు వేచిచూడటం మంచిది కాదు. పైగా.. బ్యాంక్​లు సాయంత్రం 4గంటల తర్వాత పేమెంట్​ను స్వీకరించవు. టైమ్​ లిమిట్​ కూడా ఉందని తెలుసుకోవాలి.

ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఐపీఓ ఓపెన్​ అయిన మొదటి రోజే.. అప్లే చేసేస్తే.. కచ్చితంగా అలాట్​మెంట్​ జరుగుతుంది అని అనుకోవడానికేమీ లేదు. క్లోజింగ్​కి ముందు ఎప్పుడు బిడ్లు దాఖలు చేసినా ఒకే విధంగా ఉంటుంది.

పేరెంట్​ కంపెనీ షేర్లు ఉంటే..

IPO allotment tips and tricks | కొన్ని కొన్ని సంస్థలకు వేరువేరు వ్యాపారాలు ఉంటాయి. ఒకే పేరెంట్​ కంపెనీ పేరుతో వాటిని మార్కెట్​లోకి తీసుకొస్తూ ఉంటాయి. అయితే.. ఆయా సంస్థలను ఐపీఓకు తీసుకొచ్చేడప్పుడు.. పేరెంట్​ కంపెనీలు.. 'షేర్​హోల్డర్​ క్యాటగిరీ'ని ఇస్తాయి. అందువల్ల పేరెంట్​ కంపెనీకి చెందిన ఒక్క షేరు అయినా మన డిమాట్​లో ఉంటే.. ఆ క్యాటగిరీకి అర్హత సాధిస్తాము. ఫలితంగా.. అందులో కూడా అప్లే చేసుకుంటే.. ఐపీఓ అలాట్​మెంట్​ అవకాశాలు మెరుగుపడతాయి.

వివరాలు సరిగ్గా చూసుకోండి..

ఐపీఓ బిడ్లును ఫైనలైజ్​ చేసేముందు ఓసారి అప్లికేషన్​లో మీరు ఇచ్చిన డిటైల్స్​ను మళ్లీ సరిగ్గా చెక్​ చేసుకోవాలి. పేరు, డీమాట్​ వివరాలు, అప్లై చేస్తుకున్న క్యాటగిరీ వంటి వివరాలను మరోసారి చూసుకోవాలి. తప్పులు జరిగితే కష్టమే.

(గమనిక: ఐపీఓ అండర్​సబ్​స్క్రైబ్​ అయితే.. షేర్ల అలాట్​మెంట్​ సులభంగా జరుగుతుంది! కానీ ఐపీఓకు మంచి డిమాండ్​ ఉండి ఓవర్​సబ్​స్క్రైబ్​ అయితే.. లాటరీ విధానం ద్వారా అలాట్​మెంట్​ చేస్తారు. ఎన్ని టిప్స్​ పాటించినా ఐపీఓ 'కచ్చితంగా' అలాట్​ అవుతుందని చెప్పలేము. కానీ టిప్స్​ పాటిస్తే.. అలాట్​మెంట్​ అవకాశాలు మెరుగుపడతాయన్నది గుర్తుపెట్టుకోవాలి.)

టాపిక్

తదుపరి వ్యాసం