Aditya L1 launch : 'ఆదిత్య ఎల్-1' లాంచ్ డేట్ ఫిక్స్.. ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక మిషన్!
29 August 2023, 6:20 IST
- Aditya L1 launch : ఆదిత్య ఎల్-1 లాంచ్‌పై కీలక అప్డేట్ ఇచ్చింది ఇస్రో. సెప్టెంబర్ 2న మిషన్‌ను లాంచ్ చేయనున్నట్టు స్పష్టం చేసింది.
'ఆదిత్య ఎల్-1' లాంచ్ డేట్ ఫిక్స్.. ఇస్రో మరో ప్రతిష్ఠాత్మక మిషన్!
Aditya L1 launch date and time ISRO: చంద్రయాన్-3 సక్సెస్ తర్వాత ప్రపంచం దృష్టి మన ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ)పై పడింది. ఇస్రో తదుపరి ప్రాజెక్ట్స్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీటి మధ్య.. ఓ కీలక అప్డేట్ ఇచ్చింది ఇస్రో. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు.. సంస్థ ప్రయోగించనున్న "ఆదిత్య- ఎల్1" లాంచ్ డేట్‌ను తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 2న.. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ఉదయం 11:50 గంటలకు.. ఆదిత్య ఎల్1 మిషన్ నింగిలోకి ఎగురుతుందని స్పష్టం చేసింది.
మిషన్ లక్ష్యం ఇదే..
ఈ ఆదిత్య- ఎల్1 మిషన్ కోసం పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ రాకెట్‌ను ఉపయోగించనుంది ఇస్రో. దీనిని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా చూడొచ్చు. ఈ ఆదిత్య- ఎల్1.. భూమి నుంచి సుమారు 1.5 మిలియన్ కి.మీలు ప్రయాణించి సూర్యుడికి వీలైనంత సమీపానికి చేరుకుంటుంది. అనంతరం.. అంతరిక్ష వాతావరణంపై సూర్యుడి ప్రభావంతో పాటు ఇతర అంశాలపై పరిశోధనలు నిర్వహిస్తుంది. రియల్-టైమ్ మానిటరింగ్ చేస్తుంది.
ఈ మిషన్ ప్రధాన లక్ష్యాలను ఇస్రో తాజాగా ప్రకటించింది. కొరొనల్ హీటింగ్, సౌర మంటలు, కొరొనల్ మాస్ ఇజెక్షన్స్, సౌర గాలులు, భూమికి సమీపంలోని అంతరిక్ష వాతావరణ వంటి వాటిపై పూర్తిస్థాయిలో పరిశోధనలు జరుపుతుంది ఆదిత్య ఎల్-1. ఈ మిషన్‌లో 7 సైంటిఫిక్ పేలోడ్స్‌ను ఉపయోగిస్తున్నారు. సోలార్ అల్ట్రావయోలెంట్ ఇమేజింగ్ టెలిస్కోప్ ఇందులో ఒకటి.
Aditya L1 launch date : సూర్యుడు- భూమి సిస్టెమ్లోని లాగ్రేంజ్ పాయింట్ 1 (ఎల్1) చుట్టూ ఉండే హాలో ఆర్బిట్‌లోకి ఈ ఆదిత్య- ఎల్1 వెళుతుంది. తద్వారా.. సూర్యుడికి సంబంధించి నిరంతర వ్యూ శాటిలైట్‌కు లభిస్తుంది. నాసాకు చెందిన సోలార్ అండ్ హీలియోస్పెరిక్ అబ్సర్వేటరీ శాటిలైట్ కూడా ఇదే ఆర్బిట్‌లో ఉంది. గత రెండే దశాబ్దాలుగా.. ఈ శాటిలైట్.. సూర్యుడిపై పరిశోధనలు జరుపుతోంది.
నాలుగు నెలల ప్రయాణం..
ఆదిత్య- ఎల్1.. నిర్దేశిత ఎల్1 లొకేషన్ పాయింట్‌కు చేరుకునేందుకు నాలుగు నెలల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి ఎస్ఓ (స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్)ను రాకెట్ స్పేస్‌క్రాఫ్ట్ దాటిన తర్వాత.. 'క్రూజ్' ఫేజ్‌లోకి వెళుతుంది. అక్కడి నుంచి.. హాలో ఆర్బిట్వైపు ప్రయాణాన్ని సాగిస్తుంది.
చంద్రయాన్-3 సక్సెస్..
Chandrayaan-3 latest news : జులై 14న నింగిలోకి ఎగిరిన చంద్రయాన్-3.. ఆగస్ట్ 23న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయ్యింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది. 23న ల్యాండర్ నుంచి బయటకి వచ్చిన రోవర్.. అప్పటి నుంచి 14 రోజుల పాటు వివిధ పరిశోధనలు చేపట్టనుంది.