తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Modi Isro Visit : ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ సెల్యూట్​..!

PM Modi ISRO visit : ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ సెల్యూట్​..!

Sharath Chitturi HT Telugu

26 August 2023, 8:52 IST

google News
    • PM Modi ISRO visit : ప్రధాని మోదీ.. బెంగళూరుకు వెళ్లి ఇస్రో శాస్త్రవేత్తలను కలిశారు. వారిని అభినందించారు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేేశారు.
ఇశ్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ సెల్యూట్​..!
ఇశ్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ సెల్యూట్​..! (PTI)

ఇశ్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ సెల్యూట్​..!

PM Modi ISRO visit : చంద్రుడి దక్షిణ ధ్రువంలో చంద్రయాన్​-3 ల్యాండ్​ అయిన ప్రాంతాన్ని ఇకపై శివశక్తిగా పిలువనున్నట్టు భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. జాబిల్లిపై ఇండియా అడుగుపెట్టిన ఆగస్ట్​ 23వ తేదీని.. 'నేషనల్​ స్పేస్​ డే'గా నిర్వహించనున్నట్టు వెల్లడించారు.

బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్​ అండ్​ కమాండ్​ నెట్​వర్క్​ మిషన్​ కంట్రోల్​ కాంప్లెక్స్​కు శనివారం ఉదయం వెళ్లారు ప్రధాని మోదీ. చంద్రయాన్​-3 మిషన్​ సక్సెస్​లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలను కలిసి, వారి కృషిని అభినందించారు. ఈ క్రమంలోనే పలు విషయాలపై ప్రసంగించారు.

"ఆగస్ట్​ 23న జరిగిన దృశ్యాలు, ఆ క్షణాలు.. నా కళ్ల ముందు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఇది భారత దేశం గర్వించదగిన విషయం. మిషన్​ సక్సెస్​లో కీలక పాత్ర పోషించిన మిమ్మల్ని కలవాలని, మీకు సెల్యూట్​ చేయాలని అనిపించింది. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా వస్తాయి. చంద్రయాన్​-3 ల్యాండ్​ అయిన ప్రాంతాన్ని 'శివశక్తి'గా పిలుద్దాము. చంద్రుడి ఉపరితలంపై పడిన చంద్రయాన్​-2 ప్రాంతాన్ని 'తిరంగ' అని పిలుద్దాము. ఇండియా చేసిన కృషికి ఇది చిహ్నంగా మారుతుంది. విఫలమనేది అంతం కాదని.. ఇది గుర్తుచేస్తుంది," అని ప్రధాని మోదీ అన్నారు.

అంతకుముందు.. ఒక్క రోజు గ్రీస్​ పర్యటనను ముగించుకుని శనివారం ఉదయం బెంగళూరులోని హెచ్​ఏఎల్​ విమానాశ్రయంలో దిగారు మోదీ. ఆయనకు బీజేపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారందరిని ఉద్దేశించి మాట్లాడారు మోదీ. ఇస్రోను అభినందించారు. ఈ క్రమంలోనే జై విజ్ఞాన్​, జై అనుసంధాన్​ అన్న నినాదాన్ని ఇచ్చారు.

"చంద్రయాన్​-3 ల్యాండింగ్​ సమయంలో నేను ఇండియాలో లేను. సంతోషంతో నన్ను నేను నియంత్రించుకోలేకపోయాను. దేశానికి వచ్చిన తర్వాత, తొలుత బెంగళూరుకు వచ్చి, శాస్త్రవేత్తలను కలవాలని నిర్ణయించుకున్నాను," అని ప్రధాని మోదీ అన్నారు.

చంద్రయాన్​-3 ప్రస్తావన..

జులై 14న నింగిలోకి ఎగిరిన చంద్రయాన్​-3 మిషన్​ సక్సెస్​ఫుల్​గా ముందుకుసాగింది. దశలవారీగా చంద్రుడికి చేరువైంది. చివరికి.. ఈ నెల 23 సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడిపై ల్యాండ్​ అయ్యింది. మొత్తం మిషన్​లో ఇదే అత్యంత కీలక ఘట్టం. ఇక విక్రమ్​ ల్యాండ్​ చంద్రుడి ఉపరితలంపై దిగిన కొన్ని గంటల తర్వాత.. ప్రగ్యాన్​ రోవర్​ బయటకు వచ్చింది. ఫలితంగా చంద్రుడిపై అడుగుపెట్టిన నాలుగో దేశంగా చరిత్ర సృష్టించింది ఇండియా. ప్రగ్యాన్​ రోవర్​కు సంబంధించిన దృశ్యాలను సైతం విడుదల చేసింది ఇస్రో. ల్యాండింగ్​ సమయం నుంచి 14 రోజుల పాటు జాబిల్లిపై పరిశోధనలు చేయనుంది ప్రగ్యాన్​ రోవర్​.

విక్రమ్​​ ల్యాండింగ్​ సమయంలో ప్రధాని మోదీ ఇండియాలో లేరు. బ్రిక్స్​ సమావేశం కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లారు. కాగా.. ల్యాండింగ్​ ప్రక్రియను అక్కడి నుంచి లైవ్​లో చూశారు. ల్యాండింగ్​ సక్సెస్​ అయిన తర్వాత.. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. నవ భారత దేశ సత్తాకు ఇది నిదర్శనం అని కొనియాడారు. ఇక తాజాగా.. శనివారం ఉదయం బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను కలిశారు.

తదుపరి వ్యాసం