తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అదానీ చేతికి 'డ్రోన్స్​'- ఆ సంస్థలో 50శాతం వాటా కొనుగోలు

అదానీ చేతికి 'డ్రోన్స్​'- ఆ సంస్థలో 50శాతం వాటా కొనుగోలు

HT Telugu Desk HT Telugu

28 May 2022, 10:05 IST

google News
  • బెంగళూరు ఆధారిత జనరల్​ ఏరోనాటిక్స్​ సంస్థలోని 50శాతం వాటాను కొనుగోలు చేసింది అదానీ గ్రూప్​. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.

అదానీ గ్రూప్​
అదానీ గ్రూప్​ (REUTERS)

అదానీ గ్రూప్​

దేశంలోని అన్ని రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించుకుంటున్న అదానీ గ్రూప్​.. ఇప్పుడు 'డ్రోన్​' వ్యవస్థపై మరింత దృష్టిసారించింది! బెంగళూరుకు చెందిన జనరల్​ ఏరోనాటిక్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ కంపెనీలోని 50శాతం వాటాను కొనుగోలు చేసినట్టు అదానీ ఎటర్​ప్రైజెస్​ ప్రకటన విడుదల చేసింది.

జనరల్​ ఏరోనాటిక్స్​లో 50శాతం వాట కొనుగోలుకు సంబంధించిన ఒప్పందంపై.. అదానీ గ్రూప్​కు చెందిన అదానీ డిఫెన్స్​ సిస్టమ్స్​ అండ్​ టెక్నాలజీ లిమిటెడ్​ కంపెనీ శుక్రవారం సంతకం చేసింది. ఫలితంగా ఇరు సంస్థల మధ్య వాటా కోసం ఒప్పందం కుదిరింది. ఈ మేరకు స్టాక్​ మార్కెట్​ రెగ్యులేటర్​కు అదానీ గ్రూప్​ ఓ ప్రకటన పంపించింది.

వ్యవసాయం కేంద్రబిందువుగా వీటి కార్యకలాపాలు సాగనున్నాయి. పంట రక్షణ కోసం వాణిజ్యపరమైన డ్రోన్లను తయారు చేస్తుంది జనరల్​ ఏరోనాటిక్స్​ సంస్థ. 2016లో ఈ సంస్థను స్థాపించారు. కృత్రిమ మేథ, విశ్లేషణల ఆధారంగా పంటలపై పర్యవేక్షణ జరిపి.. సమస్యను పరిష్కరిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు.. ఆ విషయంలో అదానీ గ్రూప్​ సాయం చేయనుంది. దేశీయ వ్యవసాయ రంగంలోని సమస్యలను తొలగించే విధంగా కృషి చేయనున్నాయి.

అన్ని రంగాల్లో..

ఫుడ్ బిజినెస్‌లో అగ్రస్థానం సాధించే దిశగా మెక్‌కార్మిక్ స్విట్జర్లాండ్ జీఎంబీహెచ్ నుంచి ప్రఖ్యాత 'కోహినూర్' బ్రాండ్‌తో సహా పలు బ్రాండ్‌లను కొనుగోలు చేస్తున్నట్లు అదానీ విల్మార్ లిమిటెడ్ (ఎడబ్ల్యూఎల్) కొన్ని వారాల క్రితమే ప్రకటించింది. అయితే సంబంధిత డీల్ పరిమాణం వెల్లడించలేదు.

ఈ కొనుగోలు ద్వారా భారతదేశంలో కోహినూర్ బ్రాండ్ గొడుగు కింద 'రెడీ టు కుక్', 'రెడీ టు ఈట్' కర్రీస్, మీల్స్ పోర్ట్‌ఫోలియోతో పాటు 'కోహినూర్' బ్రాండ్ బాస్మతి రైస్‌పై అదానీ విల్మార్‌కు ప్రత్యేక హక్కులు లభిస్తాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

కోహినూర్ బ్రాండ్ దక్కించుకోవడం వల్ల బ్రాండ్ విలువ పెంచుకోవడంతో పాటు ఉత్పత్తులను పెంచుకునే సామర్థ్యం ఏర్పడుతుంది. ఈ కొనుగోలుతో అదానీ విల్మార్ ఫుడ్ బిజినెస్‌లొ మరో మెట్టు పైకెక్కినట్టుగా భావిస్తున్నారు. బియ్యం, ఇతర విలువ ఆధారిత ఆహార వ్యాపారాలలో అదానీ విల్మార్ తన పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేస్తుంది.

కోహినూర్ బ్రాండ్ పోర్ట్‌ఫోలియోలో ప్రీమియం బాస్మతి బియ్యం 'కోహినూర్’, సరసమైన బియ్యం 'చార్మినార్', హొరెకా (హోటల్, రెస్టారెంట్ మరియు కేఫ్) విభాగానికి అవసరమైన 'ట్రోఫీ' బ్రాండ్లు ఉన్నాయి.

మార్చితో ముగిసిన త్రైమాసికంలో అదానీ విల్మార్ ఏకీకృత నికర లాభంలో 26 శాతం క్షీణతతో రూ. 234.29 కోట్లుగా నమోదైంది. అధిక పన్ను ఖర్చుల కారణంగా నికరలాభం తగ్గింది. అదానీ విల్మార్.. అదానీ గ్రూప్, అలాగే సింగపూర్‌కు చెందిన విల్మార్ మధ్య 50:50 జాయింట్ వెంచర్.

టాపిక్

తదుపరి వ్యాసం