Davos | అదానీ గ్రూప్ తో ఒప్పందం.. ఏపీలో రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు
పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ దావోస్ టూర్ జరిగింది. సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగు వేసింది.
ఏపీ ప్రభుత్వం కాలుష్యం లేని ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా రెండు మెగా గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం అదానీ గ్రూప్ తో ఎంఓయూ కుదుర్చుకుంది. రెండు ప్రాజెక్టులను అదానీ గ్రీన్ ఎనర్జీ నెలకొల్పుతుంది. ఒకటి 3,700 మెగావాట్ల పంప్డ్ హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టు, మరొకటి 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు. రెండు ప్రాజెక్టుల కోసం సుమారు.. రూ.60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు. రాష్ట్రంలో 10 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి.
డబ్ల్యూఈఎఫ్ సదస్సులో సీఎం జగన్ నిన్న అదానీతో భేటీ అయ్యారు. రెండోరోజు సైతం సమావేశమై ఈ ప్రాజెక్టులపై విస్తృతంగా మాట్లాడారు. గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి, సీఎం వైఎస్ జగన్, అదానీ గ్రూపు సంస్థల అధిపతి గౌతం అదానీ సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్‌చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, అదానీ గ్రీన్ ఎనర్జీ తరఫున ఆశిష్ రాజ్‌వంశీ ఎంఓయూపై సంతకాలు చేశారు.
హై ఎండ్ టెక్నాలజీ హబ్‌గా విశాఖ కోసం.. దావోస్ వేదికగా విఖ్యాత కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సీఎం కోరారు. నైపుణ్యాభివృద్ధి, అత్యాధునిక సాంకేతిక రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హై ఎండ్ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్ మహీంద్ర అంగీకారం తెలిపింది. ఏపీలో రూ.250 కోట్లతో బయో ఇథనాల్ ప్లాంట్ కోసం అసాగో పెట్టుబడులు పెడుతోంది.
ఏపీలో షిప్పింగ్, లాజిస్టిక్ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నామని మిట్సుయి ఒ.ఎస్.కె.లైన్స్ లిమిటెడ్ ప్రకటించింది. విశాఖపట్నంలో టెక్ మహీంద్ర కార్యకలాపాల విస్తరణపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికోసం ఒక స్కిల్ యూనివర్శిటీతోపాటు, 30 స్కిల్‌కాలేజీలు, వీటికి అదనంగా మరో 175 స్కిల్ హబ్స్ ఏర్పాటుచేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఐటీ సంబంధిత సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించి వీటితో అనుసంధానం కావాలని కోరారు.
హీరో గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజల్ తో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి, వ్యాపార విస్తరణపై చర్చలు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేస్తున్న అథెర్ ఎనర్జీలో ఇప్పటికే 36శాతం వాటాను కొనుగోలుచేసింది. హీరో గ్రూప్. బ్యాటరీ టెక్నాలజీలో తైవాన్‌కు చెందిన గగొరో కంపెనీతో హీరో గ్రూప్‌కు భాగసామ్యం ఉంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. విశాఖ– చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్‌లో భాగంగా పరిశ్రమలకు నీటివనరులను అందించే పనుల్లో భాగంగా తిరుపతి సమీపంలో ఉన్న హీరో కంపెనీకి అవసరమైన నీటిని కండలేరు నుంచి ఇవ్వాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
సంబంధిత కథనం
టాపిక్