ఈ ఆలయంలో ‘తులసి’ పై నిషేధం- అసలు కారణం ఏంటంటే..
28 October 2024, 9:00 IST
- Kerala temple restricts use of Tulsi : కేరళలోని గురువాయుర్ శ్రీ కృష్ణ ఆలయం తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు వార్తలకెక్కింది. ఆలయంలో తులసిని నిషేధించారు. ఇందుకు ఒక బలమైన కారణం ఉందని చెబుతున్నారు.
తులసిపై కేరళలోని ఆలయం ఎందుకు నిషేధం విధించింది?
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే వాటిల్లో తులసి ఆకులు ఒకటి. మరీ ముఖ్యంగా ఆలయాల్లో దేవుళ్లకు తులసితో పూజలు చేయడం సాధారణ విషయం. ఇంతటి విశిష్టమైన తులసిని కేరళలోని ఓ ఆలయం నిషేధించింది! ఆలయంలోకి తులసిని తీసుకురావొద్దని, దేవుళ్లకు సమర్పించవద్దని తేల్చిచెప్పింది. అయితే.. కేరళలోని గురువాయుర్ శ్రీ కృష్ణ ఆలయం ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇందుకు ఒక కారణం ఉంది.
శ్రీ కృష్ణ ఆలయంలో తులసిపై నిషేధం..
కేరళలోని థ్రిస్సూర్లో ఉంది ఈ గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయం. కృష్ణుడికి తులసి అంటే చాలా ఇష్టమని, దానితో పూజలు చేస్తే అనుగ్రహిస్తారని హిందువుల నమ్మకం. కానీ ఇటీవలి కాలంలో ఆలయానికి వస్తున్న తులసి ఆకులు, మాలల్లో పురుగుల మందు అధికంగా ఉంటోంది. ఫలితంగా తులసిని ముట్టుకుంటున్న వారిలో చాలా మందికి దురద, దద్దర్లు వంటి సమస్యలు వస్తున్నాయి. దీనిపై కొన్ని రోజులుగా ఫిర్యాదులు వెల్లివెత్తాయి. ఫలితంగా.. ఆలయంలో తులసిపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదే విషయాన్ని భక్తులకు కూడా తెలియజేశారు. దేవుడికి తులసితో పూజ చేయడం మానుకోవాలని సూచించారు.
"దుకాణాల్లోని తులసి తీసుకొచ్చి భక్తులు దేవుడికి సమర్పిస్తారు. కానీ వాటిల్లో కమర్షియల్ వినియోగం కోసం అధిక మొత్తంలో పురుగుల మందును జల్లుతున్నారు. ఫలితంగా ఎక్కువ రోజులు తులసి ఉండేలా చూసుకుంటున్నారు. దీని వల్ల ఎలర్జీ, దురద వంటి సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఆలయంలో తులసిపై నిషేధం విధిస్తున్నాము," అని గురువాయుర్ శ్రీ కృష్ణ ఆలయం సిబ్బంది వెల్లడించారు.
అయితే, బయట తులసిని నిషేధించినప్పటికీ, ఆలయంలోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు సిబ్బంది ప్రణాళికలు రచిస్తోంది. పురుగల మందు, రసాయనాలు లేని తాజా, ఎలర్జీ-ఫ్రీ తులసిని భక్తుల కోసం అందుబాటులో ఉంచాలని చూస్తోంది.
తులసి నిషేధంపై వివాదం..!
అయితే, ఇలా ఆలయంలో పవిత్రమైన తులసిని నిషేధించడంపై దుమారం రేగింది. మరీ ముఖ్యంగా ప్రో-హిందూ సంస్థల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. కేరళలోని సీపీఐ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు.
కానీ దీనికి రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబధం లేదని గురువాయుర్ దేవస్థానం ఛైర్మన్ వీకే విజయన్ తెలిపరు.
కేరళ ఆలయాల్లో హిందువులు పవిత్రంగా భావించే వస్తువులను నిషేధించడం ఇది మొదటిసారి కాదు. 24ఏళ్ల మహిళ అరళి ఆకులు తిని ప్రాణాలు కోల్పోవడంతో ఇటీవలే చాలా ఆలయాన్ని దాని వాడకాన్ని నిలిపివేశాయి.
శబరిమల అయప్పస్వామి ఆలయంలోని అరవణ ప్రసాదంలో వినియోగించే యాలకుల్లో పురుగుల మందు ఉందన్న నుమానంతో రూ. 6.55లక్షలు విలువ చేసే కంటైనర్స్ని నిషేధించారు.