Tiruvannamalai Landslide : తిరువణ్ణామలైలో ఇంటిపై పడిన కొండచరియలు.. ఏడుగురి ఆచూకీ కోసం సహాయక చర్యలు
02 December 2024, 10:23 IST
- Tiruvannamalai Landslide : తమిళనాడులో ఫెంగల్ తుపాను ప్రభావం చూపిస్తూనే ఉంది. ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మరోవైపు కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. తిరువణ్ణామలైలో ఓ ఇంటిపై కొండచరియలు పడ్డాయి.
తిరువణ్ణామలైలో ఇంటిపై పడిన కొండచరియలు
తమిళనాడులో వర్షాలు దంచికొడుతున్నాయి. నిరంతర భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలో ఒక ఇంటిని సమాధి చేశాయి. పిల్లలతో సహా 7 మంది ఆచూకీ ఇంకా తెలియడం లేదు. ఆదివారం సాయంత్రం తిరువణ్ణామలై కొండపై నుంచి వీఓసీ నగర్‌లోని ఇళ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద బండరాయి పడటంతో వీఓసీ నగర్‌కు చెందిన రాజ్‌కుమార్ ఇల్లు నాశనం అయింది. ఇంటి మీద మెుత్తం కొండచరియలు పడ్డాయి.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడి నివాసితులు పరుగులు తీయాల్సి వచ్చింది. 'మేం పెద్ద శబ్దం విన్నాం, కొండపై నుండి రాతి పడటం చూశాం. వెంటనే భయంతో పరిగెత్తాం, కాని రాజ్‌కుమార్ ఇల్లు పూర్తిగా మట్టిలో కప్పబడింది.' అని అని పొరుగువారు చెప్పారు.
మరోవైపు కొండచరియల కింద ఉన్నవారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ కమాండెంట్ శ్రీధర్ నేతృత్వంలోని 30 మంది సభ్యుల జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) కొండచరియల కింద చిక్కుకున్న వ్యక్తులను గుర్తించే పనిలో ఉంది. బతికి ఉన్నారా లేదంటే ప్రమాదంలో మరణించారా తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు కోసం హైడ్రాలిక్ ఎయిర్ లిఫ్టింగ్ బ్యాగ్‌తో సహా రెస్క్యూ పరికరాలు తీసుకువచ్చారు.
జేసీబీలతోపాటు భారీ వాహనాలు వెళ్లలేని విధంగా ఇరుకైన రోడ్డు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. నిరంతర వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ను మరింత క్లిష్టతరం అవుతోంది.
కొండచరియల కింద చిక్కుకున్న వ్యక్తుల ఆచూకీ కోసం శ్రమిస్తున్నామని అయితే ఇరుకైన రోడ్డు, విద్యుత్ సరఫరా లేకపోవడం కష్టతరం చేస్తుందని డిప్యూటీ కమాండెంట్ శ్రీధర్ తెలిపారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ బ్రిగేడ్ ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. రాజ్‌కుమార్ కుటుంబంలోని సభ్యులు ఎలా ఉన్నారోనని స్థానికులు కంటతడి పెడుతున్నారు.
ముందుజాగ్రత్త చర్యగా వీఓసీ నగర్ వాసులను ఖాళీ చేయించారు. వారికోసం జిల్లా యంత్రాంగం తాత్కాలిక శిబిరాలను ఏర్పాటు చేసింది.
టాపిక్