తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Army News: ఆర్మీ విన్యాసాల్లో విషాదం; నదిలో కొట్టుకుపోయి ఐదుగురు సైనికుల దుర్మరణం

Army news: ఆర్మీ విన్యాసాల్లో విషాదం; నదిలో కొట్టుకుపోయి ఐదుగురు సైనికుల దుర్మరణం

HT Telugu Desk HT Telugu

29 June 2024, 14:14 IST

google News
  • Army news: లద్దాఖ్ లో శుక్రవారం రాత్రి భారతీయ సైనికదళం చేపట్టిన ఆర్మీ ఎక్సర్ సైజ్ లో విషాధం చోటు చేసుకుంది. దౌలత్ బేగ్ ఓల్డీలోని వాస్తవాధీన రేఖ వద్ద షియోక్ నదిని దాటుతుండగా అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో ఒక టీ-72 ట్యాంకు నదీప్రవాహంలో కొట్టుకుపోయింది. అందులో ఐదుగురు జవాన్లు ఉన్నారు.

లద్దాఖ్ లో ఐదుగురు జవాన్ల మృతి
లద్దాఖ్ లో ఐదుగురు జవాన్ల మృతి

లద్దాఖ్ లో ఐదుగురు జవాన్ల మృతి

Army news: తూర్పు లద్దాఖ్ లోని సాసర్ బ్రాంగ్సా సమీపంలో షియోక్ నదీప్రవాహంలో ఆర్మీ ట్యాంక్ కొట్టుకుపోయిన ప్రమాదంలో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం రాత్రి వారు టీ 72 యుద్ధ ట్యాంక్ పై నదిని దాటుతుండగా, అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో, ఆ ప్రవాహంలో ట్యాంకు కొట్టుకుపోయింది. ఆ ట్యాంక్ లో ఉన్న జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) సహా ఐదుగురు భారత ఆర్మీ (ARMY) జవాన్లు నీటిలో మునిగిపోయి చనిపోయారు. యుద్ధ ట్యాంక్ లతో నదిని దాటే విషయంలో శిక్షణ పొందుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం.

సైనిక శిక్షణ కార్యక్రమం నుంచి వైదొలగుతుండగా..

దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో జరిగిన సైనిక శిక్షణ కార్యక్రమం నుంచి వైదొలగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని రక్షణ శాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. సహాయక బృందాలు సంఘటనా స్థలానికి వెంటనే చేరుకున్నప్పటికీ నదీ ప్రవాహం, నీటి మట్టం తీవ్రంగా ఉండటంతో వారిని కాపాడలేకపోయారని వెల్లడించింది. తూర్పు లద్దాఖ్ లో విధులు నిర్వహిస్తూ ఐదుగురు వీర జవాన్లను కోల్పోవడంపై భారత సైన్యం విచారం వ్యక్తం చేసిందని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

రక్షణ మంత్రి స్పందన

లద్దాఖ్ లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. మన వీర సైనికుల సేవలను ఎప్పటికీ మరువలేమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో దేశం వారికి అండగా నిలుస్తుందని ఆయన తన ఎక్స్ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రమాద వార్త తనను తీవ్రంగా కలచివేసిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ‘‘లద్దాఖ్ లో షియోక్ నదిలో జరిగిన ప్రమాదంలో జేసీవో సహా ఐదుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. ఈ బాధాకరమైన విషాదానికి బలైపోయిన సైనికుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఈ విషాద సమయంలో, మన వీర సైనికుల ఆదర్శవంతమైన సేవలకు సెల్యూట్ చేయడంలో దేశం ఏకతాటిపై నిలుస్తుంది" అని ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు.

తదుపరి వ్యాసం