Car Accident : అమెరికాలో కారు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాద్ వాసులు మృతి
04 September 2024, 12:33 IST
- Texas Road Accident : అమెరికాలోని టెక్సాస్‌లో ఐదు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో నలుగురు భారతీయులు మరణించారు. ఈ ప్రమాదంలో ఎస్‌యూవీలో మంటలు చెలరేగాయి. దీంతో ప్రమాదం ఎక్కువైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో చూద్దాం..
టెక్సాస్‌లో కారు ప్రమాదం
టెక్సాస్‌లోని అన్నాలో యుఎస్ రూట్ 75లో ఐదు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు, తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి మరణించారు. ఐదు వాహనాల మధ్య శుక్రవారం మధ్యాహ్నం 3:30 గంటలకు క్రాష్ జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితులు కార్‌పూలింగ్ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యి, శుక్రవారం అర్కాన్సాస్‌లోని బెంటన్‌విల్లేకు వెళుతుండగా విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వారు ప్రయాణిస్తున్న ఎస్‌యూవీలో మంటలు చెలరేగాయి. శరీరాలు కాలిపోయాయి. వారి గుర్తింపును నిర్ధారించడానికి అధికారులు DNA పరీక్షపై ఆధారపడుతున్నారు.
బాధితులను ఆర్యన్ రఘునాథ్ ఓరంపాటి, ఫరూక్ షేక్, లోకేష్ పాలచర్ల, దర్శిని వాసుదేవన్‌లుగా గుర్తించారు. బాధితులంతా ఒకే కారులో ప్రయాణిస్తున్నారు. ఆర్కాన్సాస్‌లోని బెంటన్‌విల్లేకు ప్రయాణం చేయడానికి నలుగురు కార్‌పూలింగ్ యాప్ ద్వారా కనెక్ట్ అయ్యారు. యాప్ ద్వారానే అధికారులు బాధితులను గుర్తించారు.
కోయంబత్తూరులోని అమృత విశ్వ విద్యాపీఠంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఆర్యన్ డల్లాస్‌లోని తన బంధువు వద్దకు వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన లోకేష్ తన భార్యను చూసేందుకు బెంటన్‌విల్లేకు వెళ్తున్నాడు. ఆర్లింగ్టన్‌లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్ అయిన దర్శిని తన మేనమామను చూడటానికి వెళుతోంది.
ట్రక్కు వేగంగా రావడం వల్ల ప్రమాదం జరిగింది, ఫలితంగా కార్లు ఢీకొనడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బాధితులు మంటల్లో చిక్కుకున్నారు. మంటల తీవ్రత కారణంగా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. బాధితులను గుర్తించడం అధికారులకు సవాలుగా మారింది.
డీఎన్‌ఏ వేలిముద్రలు, దంతాలు, ఎముకల అవశేషాలను ఉపయోగించి డీఎన్ఏ పరీక్ష ద్వారా బాధితుల గుర్తింపును నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంతోషంగా బతుకుతారని పంపిస్తే ఇలా జరిగిందని బోరున విలపిస్తున్నారు. ప్రమాదానికి ముందు వరకు దర్శిని వాసుదేవన్ తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడారు.
భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సహాయం కోసం విజ్ఞప్తి చేసినట్టుగా దర్శని తల్లిదండ్రులు చెప్పారు. 'మేం తల్లిదండ్రులు నిజంగా ఆందోళన చెందుతున్నాం. మా కుమార్తె పరిస్థితి గురించి తెలిసినప్పటి నుంచి దు:ఖంలో ఉన్నాం.' అనిఅని ఆమె తండ్రి పేర్కొన్నారు.
టాపిక్