తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  North Korea : రెండేళ్ల బాలుడికి జీవిత ఖైదు విధించిన ఉత్తర కొరియా..!

North Korea : రెండేళ్ల బాలుడికి జీవిత ఖైదు విధించిన ఉత్తర కొరియా..!

Sharath Chitturi HT Telugu

27 May 2023, 13:11 IST

google News
    • North Korea news : ఉత్తర కొరియా.. రెండేళ్ల చిన్నారిని అరెస్ట్​ చేసి, జీవిత ఖైదు శిక్ష విధించినట్టు తెలుస్తోంది. ఈ మేరకు అమెరికా ప్రభుత్వానికి చెందిన ఓ నివేదిక వెల్లడించింది.
రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు విధించిన ఉత్తర కొరియా..!
రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు విధించిన ఉత్తర కొరియా..! (REUTERS)

రెండేళ్ల చిన్నారికి జీవిత ఖైదు విధించిన ఉత్తర కొరియా..!

North Korea news : ఉత్తర కొరియాలో ఉండే కఠినమైన ఆంక్షల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. కిమ్​ జోంగ్​ ఉన్​ రాజ్యంలో నెలకొన్న పరిస్థితుల గురించి ప్రపంచ దేశాలు వింటూనే ఉన్నాయి. మతపరమైన అంశాల్లో ఈ ఆంక్షలు ఇంకాస్త కఠినంగానే ఉంటాయి! ఈ నేపథ్యంలో తాజాగా ఓ వార్త బయటకొచ్చింది. ఓ రెండేళ్ల బాలుడిని ఉత్తర కొరియా అధికారులు జైలులో పెట్టి జీవిత ఖైదు శిక్ష విధించినట్టు తెలుస్తోంది. చిన్నారి తల్లిదండ్రుల వద్ద బైబిల్​ ఉండటమే ఇందుకు కారణం..!

అసలేం జరిగిందంటే..

ఉత్తర కొరియాలో మతస్వేచ్ఛ చాలా తక్కువ. ముఖ్యంగా క్రీస్టియన్స్​పై ఆంక్షలు ఎక్కువగా ఉంటాయి. వారి ఇళ్లల్లో బైబిల్​ ఉన్నా జైలుకెళ్లాల్సిందే. వీరిలో చాలా మందికి ఉరిశిక్ష పడిన సందర్భాలు కూడా ఉన్నాయని అమెరికా హోంశాఖకు చెందిన ఓ నివేదిక పేర్కొంది. వారికి ఉరిశిక్ష పడితే.. సంబంధిత కుటుంబసభ్యులు జీవిత ఖైదును ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.

అమెరికా స్టేట్​ డిపార్ట్​మెంట్​ రూపొందించిన ఇంటర్నేషనల్​ రిలీజియస్​ ఫ్రీడం రిపోర్ట్​ ఆఫ్​ 2022 ప్రకారం.. ఉత్తర కొరియాలో 70వేలకుపైగా మంది క్రైస్తవులు జైలులో ఉన్నారు. ఇతర మతస్థులను కలుపుకుంటే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. జైలులో ఉన్న వారిలో ఓ రెండేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. అతని తల్లిదండ్రుల వద్ద బైబిల్​ లభించడంతో 2009లో వారిని అరెస్ట్​ చేశారు. తల్లిదండ్రులతో పాటు బాలుడిని కూడా పొలిటికల్​ ప్రిజన్​ క్యాంప్​లో బందీగా ఉంచారు. అనంతరం వారికి జీవిత ఖైదును విధించారు! ఈ తరహా క్యాంప్​లలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉంటాయని పలువురు చెబుతుంటారు. మానసికంగా, భౌతికంగా చిత్రహింసలకు గురిచేస్తాని అంటుంటారు.

మహిళలపై దాడులు..!

North Korea religious freedom : అయితే.. ఉత్తర కొరియాలో ఈ తరహా పరిస్థితులను అరికట్టేందుకు కృషి చేస్తున్న పలు ఎన్​జీఓల్లో కొరియా ఫ్యూచర్​ ఒకటి. 2021లో ఈ సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. మతస్వేచ్ఛ నేపథ్యంలో మహిళలను ఉత్తర కొరియా చిత్రహింసలకు గురిచేస్తోందని ఆరోపించింది. 151 మంది క్రైస్తవ మహిళలను ఇంటర్వ్యూ చేసినట్టు.. వారిపై లైంగిక దాడి జరిగినట్టు, వారందరు చిత్రహింసులకు గురైనట్టు వివరించింది.

ఉత్తర కొరియాలో క్రీస్టియన్​ మిషినరీలకు వ్యతిరేకంగా పెద్ద ప్రచారాలే జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ దేశం నుంచి బయటకు వచ్చేసిన వారు అక్కడి పరిస్థితులను వివరించారు. అక్కడి పుస్తకాల్లో క్రీస్టియన్​ మిషినరీలకు వ్యతిరేకంగా పాఠాలు ఉంటాయని పేర్కొన్నారు. క్రైస్తవులను.. మనిషి రక్తాన్ని పీల్చుకుని తాగే వారిగా ఉత్తర కొరియా చిత్రీకరించిందని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం