హిజాబ్​ తర్వాత కర్ణాటకలో మరో వివాదం.. ఈసారి ‘బైబిల్​’-bengaluru official seeks report from school after bible controversy ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  హిజాబ్​ తర్వాత కర్ణాటకలో మరో వివాదం.. ఈసారి ‘బైబిల్​’

హిజాబ్​ తర్వాత కర్ణాటకలో మరో వివాదం.. ఈసారి ‘బైబిల్​’

HT Telugu Desk HT Telugu
Apr 25, 2022 03:01 PM IST

కర్ణాటక: బెంగళూరులోని ఓ స్కూల్​లో 'బైబిల్​' వివాదం రాజుకుంది. విద్యార్థులపై స్కూల్​ యాజమాన్యం.. బైబిల్​ను బలవంతంగా రుద్దుతోందని ఆరోపణలు వస్తున్నాయి. హిజాబ్​తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటకలో బైబిల్​ వివాదం కొత్త సమస్యలు తెచ్చిపెడుతుందేమో అని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

కర్ణాటకలో బైబిల్​ వివాదం
కర్ణాటకలో బైబిల్​ వివాదం (ANI)

Bible controversy Karnataka | హిజాబ్​ వ్యవహారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కర్ణాటకలో.. కొత్తగా మరో వివాదం రాజుకుంది. బెంగళూరులోని ఓ పాఠశాల యాజమాన్యం.. విద్యార్థులపై 'బైబిల్​'ను బలవంతంగా రుద్దుతోందని ఆరోపణలు వస్తున్నాయి.

క్లారెన్స్​ హై స్కూల్​.. రాష్ట్ర రాజధాని బెంగళూరులో ఉంది. విద్యార్థులపై పాఠశాల యాజమాన్యం బైబిల్​ను బలవంతంగా రుద్దుతోందని హిందూ జనజాగృతి సమితి ఆరోపించింది. విద్యార్థులందరు నిత్యం బైబిల్​ను బ్యాగులో పెట్టుకుని తీసుకొచ్చే విధంగా స్కూల్​ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసిందని పేర్కొంది. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. ఫలితంగా.. రాష్ట్ర విద్యాశాఖకు చెందిన ఓ అధికారి.. పాఠశాలకు వెళ్లి పరిస్థితులపై ఆరా తీశారు.

Karnataka bible issue | బైబిల్​ వివాదంపై స్కూల్​ ప్రిన్సిపల్​ జెర్రి జార్జ్​ మాథ్యూ స్పందించారు. 'పాఠశాల విధానాలతో కొందరు అసంతృప్తి చెందారని మాకు తెలిసింది. మేము శాంతి కోసం పాటుపడే మనుషులము. న్యాయపరంగానే పాఠశాలను నడుపుతున్నాము. ఈ విషయంపై మా న్యాయవాదులను సంప్రదించాము. వారి సూచనలను పాటించి.. సరైన నిర్ణయం తీసుకుంటాము. మేము న్యాయాన్ని ధిక్కరించము,' అని పేర్కొన్నారు.

హిజాబ్​ కలకలం..

Karnataka hijab row | గతేడాది డిసెంబర్​ నుంచి ఏదో ఒక మతపరమైన విషయంతో కర్ణాటక.. నిత్యం వార్తల్లో ఉంటోంది. తొలుత హిజాబ్​ వివాదంతో ఆ రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అయ్యింది. హిజాబ్​ వేసుకున్న విద్యార్థినులను పాఠశాలలకు అనుమతించకపోవడంతో వారందరు నిరసనకు దిగారు. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు సైతం వెళ్లింది. ఫలితంగా ఒక్క రాష్ట్రానికే పరిమితమైన హిజాబ్​ వివాదం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

కొన్ని రోజుల క్రితమే కర్ణాటకలో మరోమారు అలజడులు నెలకొన్నాయి. శ్రీరామ నవమి ఉత్సవాల్లో భాగంగా కొన్ని వర్గాలు ఘర్షణకు దిగాయి. పోలీసులు ఈ ఘటనలపై దర్యాప్తు చేపట్టారు.

కర్ణాటకలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. రోజుకో కొత్త సమస్య వస్తుండటంతో నేతలు, అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం