`హిజాబ్‌`కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో..-udupi pu students who had challenged hijab ban return home without writing exam ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  `హిజాబ్‌`కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో..

`హిజాబ్‌`కు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో..

HT Telugu Desk HT Telugu
Apr 22, 2022 04:49 PM IST

క‌ర్నాట‌క‌లో `హిజాబ్‌` నిరస‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. హిజాబ్‌ను ధ‌రించి ప‌రీక్షరాసేందుకు క‌ళాశాల అధికారులు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో శుక్ర‌వ‌రం ఇద్ద‌రు బాలిక‌లు ప‌రీక్ష రాయ‌కుండానే వెన‌క్కు వెళ్లిపోయారు.

హిజాబ్ బ్యాన్‌పై నిర‌స‌న‌లు
హిజాబ్ బ్యాన్‌పై నిర‌స‌న‌లు (HT_PRINT)

క‌ర్నాట‌క‌లో ప్రి - యూనివ‌ర్సిటీ(ఇంట‌ర్మీడియెట్‌) ప‌రీక్ష‌లు ప్రారంభ‌మయ్యాయి. ఉడిపి ప‌ట్ట‌ణంలోని విద్యోదయ పీయూ కాలేజ్‌ ప‌రీక్ష కేంద్రానికి వ‌చ్చిన ఇద్ద‌రు యువ‌తులు ఆలియా అస్సాదీ, రేష్మి.. త‌మ మ‌త సంప్ర‌దాయ‌మైన‌ బుర్ఖాను ధ‌రించే ప‌రీక్ష రాస్తామ‌ని క‌ళాశాల అధికారుల‌ను కోరారు. అందుకు అధికారులు అనుమ‌తించ‌క‌పోవ‌డంతో ప‌రీక్ష రాయ‌కుండానే వెనుదిరిగారు. ఈ ఇద్ద‌రు యువ‌తులు విద్యాసంస్థ‌ల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌కు నిర‌స‌న‌గా గ‌తంలో కోర్టును ఆశ్ర‌యించారు. రాష్ట్ర‌వ్యాప్తంగా 6.84 ల‌క్ష‌ల మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వుతున్నారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు

విద్యాల‌యాల్లో హిజాబ్‌ను ధ‌రించ‌డాన్ని నిషేధిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ హిజాబ్ బ్యాన్‌పై క‌ర్నాట‌క‌లో పెద్ద ఎత్తున నిర‌స‌న‌లు చెల‌రేగాయి. ఈ ఉత్త‌ర్వుల‌ను కొట్టివేయాల‌ని కోరుతూ ఆలియా అస్సాదీ, రేష్మి అనే ఈ ఇద్ద‌రు యువ‌తులు కోర్టును ఆశ్ర‌యించారు. హిజాబ్ ధ‌రించి క్లాస్‌ల‌కు అటెండ్ కావ‌డానికి త‌మ‌ను అనుమ‌తించాల‌ని వారు కోర్టును కోరారు. అయితే, క‌ర్నాట‌క హైకోర్టు మార్చ్ 15న ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. హిజాబ్ ధ‌రించ‌డం ఇస్లాం సంప్ర‌దాయాల్లో అంత ముఖ్య‌మైన సంప్ర‌దాయ‌మేం కాద‌ని వ్యాఖ్యానించింది. అలాగే, విద్యా సంస్థ‌ల్లో యూనీఫామ్ డ్రెస్ కోడ్‌ను అనుస‌రించ‌డం త‌ప్ప‌ని స‌రి అని పేర్కొంది. హిజాబ్ బ్యాన్‌కు నిర‌స‌న‌గా గ‌త నెల‌లో కూడా ఫస్ట్ ప్రి యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌ల‌ను దాదాపు 40 మంది ముస్లిం విద్యార్థినులు బ‌హిష్క‌రించారు. `హిజాబ్ మాకు ముఖ్య‌మే.. కానీ అదే స‌మ‌యంలో ప‌రీక్ష‌లు రాయ‌డం కూడా ముఖ్య‌మే క‌దా!` అని ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌వ‌తున్న ప‌లువురు ముస్లిం విద్యార్థినులు వ్యాఖ్యానించారు. ప‌రీక్ష హాల్లోకి వెళ్లేముందు ప్ర‌త్యేక గ‌దిలోకి వెళ్లి హిజాబ్‌ను తొల‌గిస్తామ‌ని, ప‌రీక్ష అనంత‌రం మ‌ళ్లీ ధ‌రిస్తామ‌ని వివ‌రించారు. 17 ఏళ్ల ఆలియా అస్సాదీ గ‌త వారం మ‌రోసారి హిజాబ్ బ్యాన్‌ను తొల‌గించాల‌ని మ‌రోసారి ముఖ్య‌మంత్రిని కోరుతూ ట్వీట్ చేశారు. వేలాది మంది విద్యార్థినుల భ‌విష్య‌త్తును నాశనం చేయొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హిజాబ్‌ను నిషేధిస్తూ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా జ‌రిగిన ఉద్య‌మంలో అస్సాదీ కీల‌కంగా ఉన్నారు.

IPL_Entry_Point