హిజాబ్ అంశంపై సత్వర విచారణకు సుప్రీం నిరాకరణ-supreme court on hijaab petetion ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  హిజాబ్ అంశంపై సత్వర విచారణకు సుప్రీం నిరాకరణ

హిజాబ్ అంశంపై సత్వర విచారణకు సుప్రీం నిరాకరణ

HT Telugu Desk HT Telugu
Mar 24, 2022 01:08 PM IST

న్యూఢిల్లీ: 'హిజాబ్' విషయంలో కర్ణాటక హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు నిర్ణీత తేదీని నిర్ణయించేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.

సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు (HT_PRINT)

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్. వి.రమణ నేతృత్వంలోని ప్రధాన ధర్మాసనం ఈ పిటిషన్ శ్రీఘ్ర విచారణకు వీలుగా నిర్ణీత తేదీలో లిస్ట్ చేయాలంటూ సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించింది.

మార్చి 28 నుండి కర్ణాటకలో జరగనున్న పరీక్షలను ప్రస్తావిస్తూ, హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ కొంతమంది బాలికలు దాఖలు చేసిన పిటిషన్ విచారించడానికి వీలుగా జాబితాలో చేర్చాలని కామత్ అభ్యర్థించారు.

స్పెషల్ మెన్షనింగ్స్ సమయంలో పరీక్ష తేదీని ప్రస్తావిస్తూ, కామత్ చేసిన అభ్యర్థనపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ, ’దీనికి పరీక్షతో సంబంధం లేదు. ఇది సున్నితమైన అంశం’ అని అన్నారు.

సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే కూడా మార్చి 16న స్పెషల్ మెన్షనింగ్స్ సందర్భంగా అత్యవసర విచారణ కోరారు.

పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై నిషేధాన్ని కొనసాగించాలని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన కొన్ని గంటల తర్వాత, దానిని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. అనంతరం పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

పిటిషనర్లలో ఒకరైన నిబా నాజ్ హైకోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ న్యాయవాది అనాస్ తన్వీర్ ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కర్ణాటక విద్యా చట్టం, 1983, దాని కింద రూపొందించిన నిబంధనలను ఉటంకిస్తూ, విద్యార్థులకు ఏ విధంగానూ నిర్బంధ యూనిఫాం అందించడం లేదని పిటిషనర్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి భాగం కాదని, యూనిఫాం ఫిక్సింగ్ రాజ్యాంగబద్ధమైనదని, విద్యార్థులు దీనిపై అభ్యంతరం చెప్పలేరని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

కర్ణాటక విద్యా చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం 2022 ఫిబ్రవరి 5న జారీ చేసిన ఉత్తర్వుల చెల్లుబాటును ఆ పిటిషన్‌ ప్రశ్నించింది. ‘మతపరమైన మైనారిటీలను, ముఖ్యంగా ఇస్లామిక్ విశ్వాసానికి చెందిన హిజాబ్ ధరించిన ముస్లింలను ఎగతాళి చేయడం, దాడి చేయాలనే ఉద్దేశ్యంతో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి..’ అని ఆ పిటిషన్ పేర్కొంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం హిజాబ్ ధరించే హక్కుకు మనస్సాక్షి హక్కు కింద రక్షణ ఉందని పిటిషన్ పేర్కొంది.

పిటిషనర్లు వివిధ వాదనల ద్వారా హైకోర్టు నిర్ణయాన్ని చట్టవిరుద్ధమని సవాలు చేశారు.

IPL_Entry_Point