Multiple Sclerosis । మల్టిపుల్ స్ల్కెరోసిస్.. ఈ వ్యాధి వచ్చింటే జీవితం నాశనమే, చికిత్స ఇదీ!
30 May 2023, 9:58 IST
- World Multiple Sclerosis Day 2023: మల్టిపుల్ స్ల్కెరోసిస్ (MS) అనేది కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీసే దీర్ఘకాలికమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. లక్షణాలు, చికిత్స తెలుసుకోండి.
World Multiple Sclerosis Day
Multiple Sclerosis: మల్టిపుల్ స్ల్కెరోసిస్ (MS) అనేది దీర్ఘకాలికమైన ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తిలో కేంద్ర నాడీ వ్యవస్థ (మెదడు, వెన్నుపాము) తీవ్రంగా ప్రభావితమవుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థను దెబ్బతీసే అత్యంత సాధారణ వ్యాధులలో మల్టిపుల్ స్ల్కెరోసిస్ కూడా ఒకటి. నేడు, ప్రపంచవ్యాప్తంగా 2.8 మిలియన్ల మందికి ఈ వ్యాధి బారినపడినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
ఈ మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధి అనేది ఎంత తీవ్రమైనదంటే ఇది రోగి నడక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది, శరీరంలోని ఏ భాగాన్ని కదిలించలేని స్థితి కల్పిస్తుంది, సొంతంగా ఏ పని చేసుకోలేకపోతారు, కొన్ని సందర్భాల్లో ఇది కంటిచూపును కూడా దెబ్బతీయవచ్చు. శరీరానికి, మెదడుకు మధ్య కమ్యూనికేషన్ విచ్ఛిన్నమవుతుంది. తద్వారా రోగి ఏం చేస్తున్నాడనేది తనకే తెలియని పరిస్థితి ఉంటుంది. వ్యాధి తీవ్రత వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉన్నప్పటికీ, చాలా రకాలు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
ప్రతీ ఏడాది మే 30న ప్రపంచ మల్టిపుల్ స్ల్కెరోసిస్ దినోత్సవం (World Multiple Sclerosis Day) గా పాటిస్తారు. ఈ తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారిని ఆదుకోవడానికి, వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ఈరోజుకు ఉన్న ముఖ్య ఉద్దేశ్యం.
గురుగ్రామ్ లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్ లో న్యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ కపిల్ అగర్వాల్ HT డిజిటల్‌తో మాట్లాడారు. మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధి లక్షణాలు, వ్యాధి రావడానికి గల కారణాలు, చికిత్సా విధానం గురించి తెలియజేశారు.
మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధి లక్షణాలు
- శరీరం ఒక వైపున నొప్పి
- వివిధ శరీర భాగాలు, అవయవాలలో తిమ్మిరి లేదా బలహీనత
- నడిచేటప్పుడు ఇబ్బంది
- అలసట
- అస్పష్టమైన దృష్టి, రెండు దృశ్యాలు కనిపించడం లేదా దృష్టి కోల్పోవడం
- ఒంట్లో జలదరింపు
- కండరాల పట్టేయడం, కండరాలలో సంకోచాలు
- శరీర భాగాలలో నొప్పి
- డిప్రెషన్
- మతిమరుపు సమస్యలు
- వెర్టిగో
- లైంగిక, ప్రేగు, మూత్రాశయం వ్యవస్థలు పనిచేయకపోవడం
- అస్పష్టమైన మాటలు
- అభిజ్ఞా సమస్యలు
- మూర్ఛలు
మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధికి కారణాలు
మల్టిపుల్ స్ల్కెరోసిస్ ఒక న్యూరోలాజికల్ డిజార్డర్, దీనికి మూల కారణం ఏంటనేది స్పష్టంగా తెలియదు. ఈ వ్యాధి ఏ వయసు వారికైనా రావచ్చు. ప్రధానంగా 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువగా మహిళలకే ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పురుషులతో పోలిస్తే మహిళలకు మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధి వచ్చే ప్రమాదం రెండు- మూడు రేట్లు ఎక్కువ. వంశపారంపర్యంగా కూడా ఈ వ్యాధి రావచ్చు.
ఎప్స్టీన్-బార్ వంటి కొన్ని అంటువ్యాధులు, ఇన్ఫెక్షియస్ మోనోన్యూక్లియోసిస్‌కు కారణమయ్యే వైరస్ మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధికి సంబంధం కలిగి ఉండవచ్చు. విటమిన్ డి తక్కువగా ఉండటం, సూర్యరశ్మిని పొందలేకపోవడమ్, ఊబకాయం, ధూమపానం, థైరాయిడ్ వ్యాధి, హానికరమైన రక్తహీనత, సోరియాసిస్, టైప్ 1 డయాబెటిస్ లేదా ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి వంటి కొన్ని స్వయం ప్రతిరక్షక వ్యాధులు కూడా ఈ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతాయి.
MRI స్కాన్, రక్త పరీక్షలు, ఇతర పరీక్షల ద్వారా వైద్యులు ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.
మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధికి చికిత్స
మల్టిపుల్ స్ల్కెరోసిస్ వ్యాధికి కచ్చితమైన చికిత్స అనేది లేదు. అయినప్పటికీ లక్షణాలను తగ్గించే చికిత్సను అందించడం ద్వారా వ్యాధిని నియంత్రించవచ్చు. ఇందుకు రోగులకు ఇప్పుడు కొత్త ఇమ్యునోమోడ్యులేటర్ ఆధారిత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. నోటి ద్వారా మందులు తీసుకోవచ్చు. అయితే ఈ వ్యాధి లక్షణాలు తగ్గించుకోవాలంటే రోగులు శారీరకంగా దృఢంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి.