Green Roof | మీ ఇంటి పైకప్పుకు ఆకుపచ్చదనం అద్దండి.. ఎన్ని ప్రయోజనాలో చూడండి!
06 June 2022, 12:40 IST
- Green Roof Day - నగరాలు కాంక్రీట్ అడవులుగా మారుతున్నాయి. కాబట్టి పచ్చదనం పెంచేందుకు తగిన స్థలం లేకపోతే భవంతులపైనే గ్రీన్ రూఫ్ ఏర్పాటుచేసుకోవాలి. దీని వలన మళ్లీ పచ్చదనం చిగురిస్తుంది. ప్రజలు తమ పవర్ బిల్లులను సేవ్ చేసుకోవచ్చు, ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చు. అదెలాగో ఈ స్టోరీ చదవండి..
Green Roof
ఈరోజుల్లో అభివృద్ధికి అర్థమే మారిపోయింది. ఖాళీ స్థలాలు కరువైపోతున్నాయి. విస్తరిస్తున్న పట్టణీకరణ కారణంగా పచ్చదనం నశించి, ఆ స్థానంలో పెద్దపెద్ద భవంతులు వెలుస్తున్నాయి. నగరాలు 'కాంక్రీట్ జంగల్' లా తయారవుతున్నాయి. అయితే ఇలాంటి ఆందోళల నుంచి ఒక గొప్ప ఆలోచన పురుడు పోసుకుంది. అదే గ్రీన్ రూఫ్. దీనినే లివింగ్ రూఫ్ అని కూడా పిలుస్తున్నారు. ఈ గ్రీన్ రూఫ్‌ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా పట్టణాలు, నగరాలు మళ్లీ ఆకుపచ్చగా మారుతున్నాయి.
ఇంతకీ ఏమిటి ఈ గ్రీన్ రూఫ్ అనుకుంటున్నారా? ఇంట్లో మొక్కలు పెంచుకున్నట్లే ఇంటి పైకప్పున వాటంతటవే పెరిగే నాచు, గడ్డి, సెడమ్ లేదా చిన్న పువ్వులు పూచేటు మొక్కలను ఏర్పాటు చేయడం. ఇలాంటి మొక్కలతో భవనం పైభాగం పూర్తికంగా గానీ, పాక్షికంగా గానీ కప్పేయటం. ఇలా ఏర్పాటు చేస్తే భవనం మొక్కలతో ఆకుపచ్చగా కనిపిస్తుంది. చూడటానికి ఇంపుగా కూడా ఉంటుంది. దీనినే గ్రీన్ రూఫ్ అంటారు.
ఇప్పుడు ప్రపంచంలోని చాలా పట్టణాల్లో గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. కొన్ని దేశాల్లో అయితే అక్కడి ప్రభుత్వాలు గ్రీన్ రూఫ్‌ల ఏర్పాట్లను తప్పనిసరి చేశాయి. గ్రీన్ రూఫ్ ఏర్పాటు హామీలపైనే భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్‌లు, వర్క్‌స్పేస్, రిటైల్ స్పేస్ ఇలా జనావాసాలు, వాణిజ్యపరమైన భవనాలు అన్నీ గ్రీన్ రూఫ్‌లతో పచ్చదనం సంతరించుకుంటున్నాయి.
ఈ తరహా గ్రీన్ రూఫ్‌ల ఏర్పాటుపై అవగాహన కల్పించేందుకు జూన్ 6న 'ప్రపంచ గ్రీన్ రూఫ్ దినోత్సవం' గా కూడా నిర్వహిస్తున్నారు.
గ్రీన్ రూఫ్ ఉండటం వలన కలిగే ఉపయోగాలు
- గ్రీన్ రూఫ్‌లు భవనానికి అలంకరణగా మారతాయి. చూడటానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
- వాయు కాలుష్యం, ఇతర కార్బన ఉద్గారాలను తగ్గిస్తాయి. హానికరమైన కాలుష్య కారకాలను గ్రహించి గాలిని స్వచ్ఛంగా మారుస్తాయి.
- గ్రీన్ రూఫ్ భవనాన్నిఇన్సులేట్ చేస్తుంది. కాబట్టి వాతావరణంలో మార్పులకు అనుగుణంగా వేడిని నియంత్రిస్తుంది. సహజమైన శీతలీకరణిగా పనిచేస్తూ వేసవిలో చల్లగా ఉంటుంది. చలికాలంలో వెచ్చదనాన్ని అందిస్తుంది. ఈ రకంగా ఆకుపచ్చ పైకప్పులు ప్రజల జీవన వ్యయాన్నితగ్గిస్తుంది.
- ఏసీలు, కూలర్లు, హ్యుమిడిఫైయర్ల వాడకాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి పవర్ సేవ్ అవుతుంది. డబ్బు ఆదా అవుతుంది.
- పక్షులకు ఆవాసంగా ఉంటాయి. జీవవైవిధ్యాన్ని కాపాడుతాయి. పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
- గ్రీన్ రూఫ్ ఏర్పాటు చేసుకోవడం వలన పైకప్పు ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్రీన్ రూఫ్ ఏర్పాటు చేసుకోవడం వలన ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీలైతే మీ ఇంటి పైకప్పును కూడా ఆకుపచ్చగా మార్చుకోండి. దీనికి నిర్వహణ వ్యయం కూడా చాలా తక్కువే అవుతుంది.