తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Home Cooling | మీ ఇంట్లో ఏసీ లేకపోయినా చల్లటి అనుభూతిని పొందాలంటే ఇవిగో మార్గాలు

Home Cooling | మీ ఇంట్లో ఏసీ లేకపోయినా చల్లటి అనుభూతిని పొందాలంటే ఇవిగో మార్గాలు

HT Telugu Desk HT Telugu

19 April 2022, 16:31 IST

    • Home Cooling Ideas - గదిలోనే చల్లని సమీరం, గదిలోనే హిమాలయ మారుతం.. ఇలా ఏసీలు, కూలర్లు లేకుండానే ఇంట్లో ఏసీ తరహా చల్లదనం తీసుకురావాలంటే ఈ పద్ధతులను అనుసరించండి..
Home Cooling Methods
Home Cooling Methods (Pixabay)

Home Cooling Methods

మన దగ్గర ఏ కాలం వచ్చినా తట్టుకోవచ్చేమో గానీ ఎండాకాలం వస్తే మాత్రం అస్సలు తాళలేం. ఎండలో బయట తిరగలేం, వేడికి ఇంట్లో ఉండలేం అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. వేడి, ఉక్కపోతలకు ప్రాణమంతా తాయిమాయి అవుతుంది. దీంతో కూలర్లు, ఏసీలు తప్పనిసరిగా నిరంతరాయంగా నడుస్తూనే ఉండాలి. ఆపై కరెంటు బిల్లులను భరిస్తూ ఉండాలి.

అయితే ఏసీలు, కూలర్లు ఏం లేకుండానే ఇంట్లో చల్లని వాతావరణం కల్పించవచ్చు. ఎలాగంటారా? మీరు ఎప్పుడైనా తాతల కాలంలో కట్టినవంటి ఇంటిని చూశారా? ఆ ఇంట్లో ఏ కాలంలోనైనా స్థిరమైన ఉష్ణోగ్రత ఉంటుంది. ఇప్పుడున్నంతా టెక్నాలజీ అప్పట్లో లేకపోయినా, ఆనాటి నిర్మాణాలు ఎంతో సాంకేతిక కోణాలను అనుసరించి నిర్మించారు. కూనపెంకులు, మట్టిగోడలు, వెంటిలెటర్లు, పెరట్లో చెట్లు ఇలా ఒకటేమిటి ఎన్నో అంశాలు ఇంటిని ఎంతో చల్లగా ప్రశాంతంగా ఉంచేవి. మరి ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది, నిర్మాణ విలువలు చెడిపోయాయి. అందుకే పరిస్థితి ఇలా ఉంది.

ఏదేమైనా ఇప్పుడు కొన్ని మార్గాలను అనుసరిస్తే ఇంటిని చల్లబరుచుకోవచ్చు, ఏసీ అవసరం కూడా ఉండదని ఆర్కిటెక్ట్ స్మ్రితి చెప్తున్నారు. ఇందుకోసం ఆమె సూచించిన చిట్కాలు ఇలా ఉన్నాయి..

ఇంటిని చల్లబరిచే విధానాలు

ఇంటికి లేత రంగు

ఇంటికే లామినేషన్ వేసినా వేయకపోయినా. ఇంటి గోడలకు వేసే పెయింట్స్ ముదురు రంగులు కాకుండా తెలుపు, క్రీమ్, స్కై బ్లూ మొదలైన తేలికపాటి షేడ్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. ముదురు రంగు పెయింట్లు ఎండను శోషించుకొని ఇంట్లో వేడిని పెంచుతాయి, లేత రంగులు ఇంటిని చల్లబరచడంలో సహాయపడతాయి.

టెర్రస్ మీద మొక్కలు

ఇంట్లో ఉష్ణోగ్రతలు తగ్గించడానికి అద్భుతమైన మార్గం మొక్కలు పెంచడం. ఇంటి టెర్రస్ మీద ప్లాస్టిక్ గార్డెనింగ్ షీట్లను ఉపయోగించి మడుల్లాగా మార్చి అందులో మొక్కలకు అనువైన మట్టిని నింపి, మొక్కలు నాటాలి. ప్రతిరోజూ నీరు పట్టాలి. ఈ మొక్కలు, బురద ఎండవేడిని గ్రహించి స్లాబ్‌ను చల్లగా ఉంచుతుంది. 

మొక్కలకు బదులుగా గడ్డి కట్టలను వేసి అప్పుడప్పుడు మడులను తడుపుతూ ఉన్నా కూడా ఇలాంటి ఫలితమే ఉంటుంది.

ప్లాంటర్లు

టెర్రస్‌పైనే కాదు, కిటికీల వద్ద కూడా మొక్కలు పెరిగేలా చిన్నచిన్న ప్లాంటర్‌లను ఉంచాలి. ఇవి బయటి నుంచి వచ్చే వేడి గాలులను అడ్డుకుంటాయి, అలాగే వీటి గుండా ప్రసరించే పొడి గాలిని తేమగా మారుతాయి. దీంతో గాలి చల్లగా వీస్తుంది.

టెర్రస్ మీద తెల్లటి సున్నం

టెర్రస్‌పై తెల్లటి లైమ్‌వాష్ కూడా ఎండకు ఒక రిఫ్లెక్టర్ లాగా పని చేస్తుంది. దీంతో మీ స్లాబ్ ఎండను గ్రహించదు. కాబట్టి వేసవి అంతా చల్లగా ఉంచవచ్చు.

వెదురు బ్లైండ్స్

కిటికీలపై వెదురు బ్లైండ్‌లు (తడక లాంటి కర్టెన్లు) అమర్చుకుంటే సూర్యుని నుంచి వచ్చే కఠినమైన కిరణాలను ఇవి లోనికి ప్రసరింపజేయవు. ఇవి తేమను ఫిల్టర్ చేయడమే కాకుండా గది సౌందర్యాన్ని కూడా పెంచుతాయి.

క్రాస్ వెంటిలేషన్

ఇంట్లోకి గాలి రావడానికి వెంటిలేషన్ ఎంత అవసరమో, ఇంట్లోని వేడి గాలి బయటకు పోయేలా క్రాస్ వెంటిలేషన్ కూడా అవసరం. క్రాస్ వెంటిలేషన్ విధానం ఇంట్లోకి స్వచ్ఛమైన గాలిని ప్రసరించేలా చేస్తుంది. తెల్లవారుజామున, సాయంకాలం పూట వీలైనన్ని ఎక్కువ కిటికీలు తెరిచి ఉంచండి. ఉదయం 5 నుండి 8 గంటల వరకు, సాయంత్రం 7 నుండి 10 గంటల వరకు కిటికీలు తెరిచి ఉంచాలి.

మట్టి ప్లాస్టర్

ఇంటి బాహ్య గోడలపై మట్టి ప్లాస్టర్ వేయాలి. ఇది గోడలను చల్లగా ఉంచుతుంది.

పైచిట్కాలు పాటిస్తే ఏసీలు అవసరం లేదు, ఇంటినే ఊటీలాగా మార్చేయవచ్చు. ఈ ఎండాకాలంలోనూ చలిచలిగా అల్లింది, గిలిగిలిగా గిల్లింది అంటూ పాటలు పాడుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం