Children's Studies: మీ పిల్లలు ఇంట్లో బుక్ ఎత్తడం లేదా? ఇందులో ఏదో ఒక కారణం ఉండొచ్చు
13 October 2024, 11:30 IST
Children lose interest in studies: కొంత మంది పిల్లలు ఇంట్లో బుక్ ఎత్తడానికి అస్సలు ఇష్టపడరు. తల్లిదండ్రులు బలవంతం పెట్టినా బుక్ ముందేసుకుని కూర్చుంటారు తప్ప చదవరు.
పిల్లల చదువు
స్నేహితులతో ఉత్సాహంగా ఆడుకునే పిల్లలు చదువు దగ్గరికి వచ్చేసరికి ఢీలాపడిపోతున్నారా? మొబైల్ లేదా టీవీని గంటల తరబడి ఇంట్రస్ట్‌గా చూసే మీ పిల్లలు హోంవర్క్ రాయడానికి ఇష్టపడటం లేదా? మీ సమాధానం అవును అయితే.. మీ పిల్లలు చదువు దగ్గర అలా ముభావంగా ఉండటానికి కారణాలు తెలుసుకోండి.
కొంతమంది తల్లిదండ్రులు కనీసం కారణం కూడా తెలుసుకోకుండానే పిల్లలను బలవంతంగా చదివించడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ.. తాత్కాలికంగా మీ లక్ష్యం అక్కడ నెరవేరినా.. దీర్ఘకాలిక ప్రయోజనం మాత్రం మీకు ఉండదు. కాబట్టి .. వారు ఎందుకు చదువు విషయంలో అశ్రద్ధ చూపుతున్నారో స్పష్టమైన కారణాన్ని తల్లిదండ్రులు చొరవ తీసుకుని తెలుసుకోవాలి.
పోటీతత్వం
ప్రైవేట్ స్కూళ్ల పోటీ ప్రపంచంలో ఇప్పుడు మార్కులే ప్రామాణికంగా అందరూ చూస్తున్నారు. దాంతో పిల్లలపై మోయలేని మార్కుల భారాన్ని అటు స్కూల్ యాజమాన్యం, ఇటు తల్లిదండ్రులు మోపుతున్నారు. మితిమీరిన ఈ పోటీలో మీ పిల్లలు ఏమాత్రం వెనకబడినట్లు భావించినా వాళ్లు నేర్చుకోవాలనే ఆసక్తిని కోల్పోతారు. కాబట్టి మార్కులే ప్రపంచం కాదని తల్లిదండ్రులు నెమ్మదిగా పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి.
క్లాస్‌లు బోర్
ఈ మార్కుల పోటీలో చాలా స్కూళ్లు యాక్టివిటీస్‌ను పూర్తిగా తగ్గించేసి కేవలం పాఠ్యాంశాలనే పిల్లల బుర్రలోకి ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయి. దాంతో వారికి ఆ క్లాస్‌లు బోరింగ్‌గా అనిపించొచ్చు. అలా మీ పిల్లలు ఫీలవుతుంటే వారికి ఆ పాఠ్యాంశాల విలువని అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
అసైన్‌మెంట్ మార్కులు
కొంత మంది పిల్లలు రెగ్యులర్ అసైన్‌మెంట్ పరీక్షల్లో మార్కులు తక్కువ వస్తే నిరాశకి గురవుతారు. దాంతో వారు నెమ్మదిగా చదువుపై ఆసక్తిని కోల్పోయే అవకాశం ఉంటుంది. అలా మీ పిల్లలు ఉంటే వారికి ప్రేరణ కలిగించేలా తల్లిదండ్రులు మాట్లాడాలి.
సపోర్ట్ లేకపోతే
ఒక పిల్లవాడు తనకి తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల సపోర్ట్ లేదని భావిస్తే చదువుపై ఆసక్తిని కోల్పోవచ్చు. ఒకవేళ కారణం అదే అయితే.. టీచర్స్‌తో మాట్లాడి వారితో పాటు తల్లిదండ్రులు కూడా పిల్లల్లో స్కూర్తి నింపేలా మాట్లాడాలి.
అనారోగ్య సమస్యలు
దీర్ఘకాలిక అనారోగ్యాలు, నిద్ర సమస్యలు లేదా ఇతర శారీరక, ఆరోగ్య సమస్యలు పిల్లల ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. దాంతో వాళ్లు చదువుపై దృష్టి పెట్టడం కష్టమవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకుని వ్యవహరించాలి.
ఫోన్ అడిక్షన్
అతిగా ఫోన్ చూడటం లేదా సోషల్ మీడియాకి పిల్లలకి అడిక్ట్ అయితే.. వారికి చదువుపై ఆసక్తి తగ్గవచ్చు. అలాంటి పిల్లలు నిరంతరం పరధ్యానంతో కనిపిస్తుంటారు. అలాంటి వారిని మళ్లీ చదువుపై దృష్టి పెట్టేలా చేయడం తల్లిదండ్రులకి కష్టమే. కానీ.. అడిక్షన్‌ను నెమ్మదిగా తగ్గిస్తూ ప్రయత్నించాలి.
మీ పిల్లలను మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి వారితో ఓపెన్‌గా మాట్లాడటం మంచిది. అయినప్పటికీ మీ పిల్లల సమస్య మీకు అర్థం కానప్పుడు లేదా సమస్యని పరిష్కరించలేనప్పుడు వారిని సైకాలజిస్ట్ లేదా ఇతర నిపుణుల సహాయం తీసుకోవడం ద్వారా మార్చే ప్రయత్నం చేయాలి.
టాపిక్