TS Inter Board: ఇక ఇంటర్ ఇంగ్లీష్‌కూ ప్రాక్టికల్స్.. థియరీ 80 మార్కులే!
TS Inter Board Latest News: తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇంగ్లీష్ పరీక్ష విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది పరీక్షలో ప్రాక్టికల్స్‌ను అమలు చేయబోతుంది.
Telangana Inter English Exam: కొత్త విద్యాసంవత్సరంలో పలు సంస్కరణలు అమలు చేసే దిశగా తెలంగాణ ఇంటర్ బోర్డు అడుగులు వేస్తోంది. ఓవైపు సిలబస్ మార్పులపై దృష్టి పెట్టగా... ఇంగ్లీష్ పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. ఈ ఏడాది ఇంగ్లీష్ లో ప్రాక్టికల్స్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కొత్త విద్యాసంవత్సరం (2023-24) నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు వీటిని అమలు చేయనున్నారు. ప్రాక్టికల్స్‌కు 20 మార్కులు కేటాయిస్తే.... రాత పరీక్ష 80 మార్కులకే ఉండనుంది.
ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్‌లోని భౌతిక, రసాయన శాస్త్ర సబ్జెక్టులతో పాటు జువాలజీ,బొటనీ సబ్జెక్టులకు ప్రాక్టికల్స్ ఉన్నాయి. అయితే వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్‌లోనూ ప్రాక్టికల్స్ అమలు చేయనున్నారు. ఫలితంగా థియరీ మార్కులు తగ్గిపోతాయి. ఇటీవల జరిగిన ఇంటర్మీడియట్ బోర్డు సమావేశంలో ఇంగ్లిష్‌లో ప్రాక్టికల్స్ అమలుపై నిర్ణయం తీసుకొన్నారు. వార్షిక పరీక్షలే కాకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్‌ను కూడా ఇదే విధానంలోనే నిర్వహించే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా ఇంగ్లీష్ కు అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది. ప్రైవేటు రంగాల్లో అవకాశాలు రావాలంటే ఇంగ్లీష్ రావాల్సిందే. విషయంపై అవగాహన ఉన్న... ఇంగ్లీష్ రాకపోవటంతో చాలా మందికి అవకాశాలు రావటం లేదు. ఈ నేపథ్యంలో ఇంటర్ స్థాయిలోనే ప్రాక్టికల్స్ దిశగా విద్యార్థులను అడుగులు వేసేలా చేసేందుకు ఇంటర్ అధికారులు భావిస్తున్నారు. నూతన విధానం ప్రకారం ఇంటర్ ఇంగ్లిష్ సబ్జెక్టుకు ల్యాబ్ వర్క్ తప్పనిసరి కానున్నది. ఫలితంగా అన్ని కాలేజీల్లో ఆంగ్ల ల్యాబ్‌లు ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే ఈ విధానం ఇంజినీరింగ్ కాలేజీల్లో అమలవుతోంది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా తరగతి గదిలో విద్యార్థులతో ఆంగ్లంలో మాట్లాడిస్తారు. ఆంగ్ల నిపుణులు మాడ్యుళ్లు కూడా రూపొందిస్తున్నారు. వాటికి సంబంధించిన పుస్తకాలనూ ముద్రించాలని భావిస్తున్నారు. ఈ ప్రాక్టికల్స్ లో ప్రధానంగా వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలను పెంచుకోనేలా సాధన చేయిస్తారు. మాట్లాడినవి రికార్డు చేయటం వంటివి చేస్తారు. భాషా సామర్థ్యాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. అయితే కాలేజీలు ప్రారంభమయ్యే నాటికి ఈ ప్రాక్టికల్స్ విధానం అమలుపై ఇంటర్ బోర్డు మరింత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.
జూన్ 1 నుంచి తరగతులు….
Telangana Inter Admission Schedule: జూన్ 1 నుంచి ఫస్టియర్ తరగతులు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. జూన్ 30లోగా అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయనుంది. ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని అధికారులు స్పష్టం చేశారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను కూడా బోర్డు అధికారిక వెబ్ సైట్ టీఎస్‌బీఐఈ లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని పేర్కొన్నారు. పదో తరగతి గ్రేడింగ్ ఆధారంగానే ప్రవేశాలు జరపాలని ఆదేశించారు. ఇక కాలేజీ సీట్లలో ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్‌సీ సీ, స్పోర్ట్స్, ఇతర అర్హతలున్న వారికి 5, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సూచించారు. ప్రతీ కాలేజీలో బాలికలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని వెల్లడించారు.
ఈ సందర్భంగా పలు మార్గదర్శకాలను కూడా ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇందులో చూస్తే....ప్రతీ సెక్షన్‌లోనూ 88 మంది విద్యార్థులనే చేర్చుకోవాలని స్పష్టం చేసింది. అదనపు సెక్షన్లకు బోర్డు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పకుండా నమోదు చేయటంతో పాటు... అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాల్సి ఉంటుంది. జోగిని, తండ్రి లేని పిల్లల విషయంలో పేరెంట్స్ కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలని సూచించింది.