Amitabh Bachchan: కౌన్ బనేగా కరోడ్‌పతిలో అవివాహిత మహిళలపై నోరుజారిన కంటెస్టెంట్.. క్లాస్‌పీకిన అమితాబ్
Kaun Banega Crorepati: కౌన్ బనేగా కరోడ్‌పతిలో అవివాహిత మహిళల గురించి నోరుజారిన కంటెస్టెంట్‌కి అమితాబ్ బచ్చన్ క్లాస్‌పీకారు. ఇంటికి ఆ మహిళలు భారమని అర్థం వచ్చేలా కంటెస్టెంట్ మాట్లాడటగా అమితాబ్ వారిస్తూ చెప్పిన మాటలకి నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తన హుందాతనంతో మరోసారి అభిమానుల మనసుని గెల్చుకున్నారు. ‘‘కౌన్ బనేగా కరోడ్‌పతి’’ షోతో సుదీర్ఘకాలంగా అభిమానుల్ని మెప్పిస్తున్న అమితాబ్.. ఇటీవల విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లని రాబట్టింది. వచ్చే ఏడాది కల్కి 2898 సీక్వెల్ కూడా తెరకెక్కనుంది.
కౌన్ బనేగా కరోడ్‌పతి షోలో పాల్గొన్న ఒక కంటెస్టెంట్ అవివాహిత మహిళలపై నోరుజారగా.. అమితాబ్ బచ్చన్ అతని మాటల్ని సరిదిద్దుతూ సున్నితంగా అక్షింతలు వేశారు. దాంతో నెటిజన్ల నుంచి అమితాబ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
కోవిడ్ -19 సమయంలో ఉద్యోగం కోల్పోయిన కృష్ణ సేలుకర్ అనే కంటెస్టెంట్ తన పరిస్థితిని అవివాహిత మహిళలతో పోల్చారు. పెళ్లికాని మహిళలు కుటుంబానికి భారం అంటూ వెటకారంగా కృష్ణ సేలుకర్ చెప్పుకొచ్చారు. దాంతో వెంటనే స్పందించిన అమితాబ్ బచ్చన్.. అతని మాటల్నివిభేదిస్తూ పెళ్లికాని ఆడబిడ్డలు కుటుంబానికి భారం కాదు గర్వం అని కితాబిచ్చారు.
కృష్ణ సేలుకర్ ఏమన్నారంటే.. ‘‘పెళ్లికాని స్త్రీ తన కుటుంబానికి ఎలా భారమో.. ఒక నిర్దిష్ట వయసు తర్వాత నిరుద్యోగి కూడా ఆ కుటుంబానికి భారమే’’ అని చెప్పుకొచ్చారు. కానీ ఆ వ్యాఖ్యలను అమితాబ్ సున్నితంగా తిరస్కరిస్తూ ‘‘ఒక విషయం చెప్పనా? కుటుంబానికి మహిళ ఎప్పటికీ భారం కాదు. కుటుంబానికి ఆమె గర్వం’’ అని చెప్పుకొచ్చారు.
కుటుంబానికి మహిళ గౌరవం, భారం వ్యాఖ్యలపై నెటిజన్లు రెండుగా విడిపోయి వాదించుకుంటున్నారు. కొంత మంది కృష్ణ సేలుకర్ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే.. మరికొందరు అమితాబ్‌ని సమర్థిస్తున్నారు.
ఒక నెటిజన్ భారం అనేది బాధ్యతతో సమానం అని కామెంట్ చేయగా.. మరొకరు ఈ జెండర్ మైండ్ సెట్ ఇప్పటికీ ఉండటం చాలా బాధాకరం అని రాసుకొచ్చారు. అయితే చాలా మంది నెటిజన్లు ‘‘డబ్బు సంపాదించని వారిని కుటుంబంలో భారంలానే చూస్తారు’’ అనే కామెంట్‌తో ఏకీభవించారు. మరి కొందరు ‘‘కృష్ణ కామెంట్స్‌పై మరీ శూలశోధన వద్దు.. అతను పెరిగిన, చూసిన పరిస్థితులు మనకు తెలియదు. అతని అభిప్రాయం అది’’ అని రాసుకొచ్చారు.
ఒక నెటిజన్ మాత్రం ‘‘కంటెస్టెంట్ కృష్ణ సేలుకర్ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చాడు. కాబట్టి అతనికి స్త్రీవాదం, లింగ సమానత్వం వంటి పదాలు, భావనల గురించి తెలియదు. బయట కూడా మహిళలను కించపరచడం తప్ప సమాజంలో మరేమీ లేదు. అలా అని నేను అతనికి మద్దతిస్తున్నానని చెప్పను. కానీ అతను తన మనసులోని మాటను చెప్పారు’’ అని రాసుకొచ్చారు.
అమితాబ్ బచ్చన్ మూవీస్
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి 2898 ఏడీలో కనిపించిన అమితాబ్.. దీపికా పదుకొణెతో కలిసి ఆర్ బాల్కీ రూపొందించిన ఇంటర్న్ రీమేక్‌లోనూ నటించారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు కౌన్ బనేగా కరోడ్‌పతి షోను కూడా విజయవంతంగా అమితాబ్ హ్యాండిల్ చేస్తున్నారు.