Angry and Hungry : ఆకలిగా ఉన్నప్పుడు సర్రున కోపం ఎందుకు వస్తుంది? శాస్త్రీయ కారణాలు
28 May 2024, 15:30 IST
- Angry and Hungry Connection : ఆకలిగా ఉన్నప్పుడు ఎప్పుడూ లేనంత కోపం వస్తుంది. ఆకలితో వచ్చినప్పుడు ఫుడ్ లేకుంటే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా విసిరిపారేస్తాం. ఆకలికి కోపానికి మధ్య ఉన్న సంబంధం ఏంటి?
ఆకలితో ఉన్నప్పుడు కోపం ఎందుకు వస్తుంది?
ఆకలితో ఉండటం అనేది సహజమైన ప్రక్రియ. కానీ చాలా మందికి ఆకలి పరిమితికి మించి ఉన్నప్పుడు అదుపు చేసుకోలేని కోపం వస్తుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? ఆకలి, కోపం మధ్య సంబంధం ఏంటి? దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని తెలుసుకోండి.
ఆకలికి మానసిక స్థితికి సంబంధం ఉంది. కడుపు నిండుగా ఉన్నప్పుడు ఒకలా ప్రవర్తిస్తే, ఆకలిగా ఉన్నప్పుడు మరోలా ప్రవర్తిస్తాం. ఇలా ఎందుకు జరుగుతుంది? దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. అలాగే మనం కొంత ఒత్తిడికి లోనైనప్పుడు అతిగా తింటాం, కొంతమంది ఒత్తిడికి గురైనప్పుడు ఏమీ తినరు. ఇదంతా ఎందుకు? అనే ఆలోచన మీ బుర్రలోకి రావొచ్చు. ఇవన్నీ ఆలోచిస్తే.. మీకు ఇప్పటికే అసలు విషయం అర్థమై ఉండాలి. మనం తినే ఆహారం మన మానసిక ఉల్లాసంపై ప్రభావం చూపుతుంది.
ఉదాహరణకు మనం వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, ప్రోటీన్లను తీసుకుంటే ఇవి మన శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచుతాయి. ఇది మంచి మానసిక స్థితికి దోహదం చేస్తుంది. అలాగే అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు మన నిరాశ, ఆందోళన భావాలను పెంచుతాయి.
భావోద్వేగాలు, ఆహారం మధ్య సంబంధం
మన భావోద్వేగాలు, ఆహారం మధ్య సంబంధం ఉంది. అందుకేగా ఆకలిగా ఉన్నప్పుడు, సరిపడా ఆహారం తీసుకోకపోయినా తెలియకుండానే సర్రున కోపం కింద నుంచి మీది దాకా వస్తుంది. మీరు కూడా ఇలాంటి పరిస్థితిని చాలాసార్లు ఎదుర్కొని ఉంటారు. అకస్మాత్తుగా కోపం వచ్చి చుట్టూ ఉన్న వారిపై అరిచే ఉంటారు. ఆకలిగా ఉండటమే దానికి కారణం. మీరు ఈ రకమైన అనుభవాన్ని అనుభవిస్తే దానిని ఆకలి బాధ అని పిలుస్తారు.
రక్తంలో చక్కెర స్థాయిలు
ఇది రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడం వల్ల కలిగే సాధారణ అనుభూతి అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మెదడు పనితీరు, భావోద్వేగ నియంత్రణను ప్రభావితం చేస్తుంది. చుట్టుపక్కల వారిని చూస్తే చిరాకు, ఒక్కసారిగా కోపం వస్తుంది. మెదడు శక్తి డిమాండ్‌ను తీర్చలేనప్పుడు ఇది తాత్కాలిక అనుభూతి. తర్వాత సెట్ అయిపోతుందిలే.
మెదడుకు సంకేతాలు
డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని డా.అంకిత ప్రియదర్శిని ఈ విషయంపై మాట్లాడారు. ఆకలిగా ఉన్నప్పుడు ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని చెప్పారు. మనం సరైన సమయంలో ఆహారం తీసుకోనప్పుడు, మన శరీరం గ్రెలిన్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది తినడానికి సమయం ఆసన్నమైందని మెదడుకు సంకేతాన్ని పంపుతుంది. ఈ సంకేతాన్ని నిర్లక్ష్యం చేస్తే, కార్టిసాల్ హార్మోన్లు ఒత్తిడికి గురవుతాయి. ఈ సందర్భంలో మనకు చిరాకు వస్తుంది. కోపం పెరుగుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గినప్పుడు, శక్తి కోసం గ్లూకోజ్‌పై ఎక్కువగా ఆధారపడే మన మెదడు కుంగిపోవడం ప్రారంభమవుతుంది. అప్పుడే మనకు చిరాకు మొదలవుతుంది. రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు, కార్టిసాల్, అడ్రినలిన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ రెండు హార్మోన్లు ఒత్తిడి హార్మోన్లు.
హార్మోన్ల ప్రభావం
సుదీర్ఘమైన ఆకలి సెరోటోనిన్ స్థాయిలను తగ్గిస్తుంది. మన భావోద్వేగాలను నియంత్రించే హార్మోన్ల విడుదల కూడా తగ్గుతుంది. సెరోటోనిన్ స్థాయిలు తగ్గడం కూడా చిరాకు పెరుగుదలకు దారితీస్తుంది. కాబట్టి ఆకలితో ఉన్నవారికి ఈ సమస్య వస్తుంది. అయితే ఈ విధంగా కోపం అందరికీ వస్తుందా అని అడిగితే కాదు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల వచ్చే సమస్య కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అనుభూతిని ఇలానే అనుభవిస్తారని చెప్పలేం. కొందరు సైలెంట్‌గా కూడా ఉంటారు.
ఆకలి కోపం నుంచి తప్పించుకోవడం ఎలా?
ఆకలి, కోపం కలగడం వల్ల కలిగే ఉద్వేగాలను మీరు ఏదైనా తినేటప్పుడు తగ్గుతుంది. మీరు ఆకలితో ఉన్నప్పుడు మీ కోపాన్ని పక్కవారిపై తీర్చుకునే బదులుగా.. కోపానికి కారణం మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కాదని మీ మెదడుకు సమాధానం చెప్పి ఒప్పించాలి. కోపాన్ని అదుపు చేసుకోలేని వారు కనీసం ఒక్క చాక్లెట్ అయినా తమ వద్ద ఉంచుకోవాలి. లేదంటే పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇలా ఉంచుకోవచ్చు. ఇది తక్షణమే మీ ఆకలిని తగ్గిస్తుంది, మిమ్మల్ని ప్రశాంతంగా చేస్తుంది.
టాపిక్