Walking Barefoot: మీరు ఎప్పుడైనా బేర్‌ఫుట్ వాకింగ్ చేశారా? ఒకసారి ట్రై చేయండి మంచి ఫీల్ పొందుతారు
09 October 2024, 16:12 IST
మనలో చాలా మంది వాకింగ్ చేస్తుంటారు. కానీ.. ఎప్పుడైనా షూస్ లేకుండా వాకింగ్ చేశారా? ఇంట్లో తిరగడం కాదు పచ్చ గడ్డి లేదా ఇసుకలో బేర్‌ఫుట్ వాకింగ్‌తో ఎన్ని ప్రయోజనాలో ఇక్కడ తెలుసుకుందాం.
వాకింగ్
ఆరోగ్యకరమైన జీవితం కోసం రోజుకి కనీసం 20 నిమిషాలైనా నడవాలని వైద్యులు సూచిస్తుంటారు. సాధారణంగా అందరూ షూస్ వేసుకుని వాకింగ్ చేస్తుంటారు. అయితే.. ఎప్పుడైనా పచ్చని గడ్డి లేదా ఇసుకపై కాసేపు షూ లేకుండా వాకింగ్ చేశారా? ఒకవేళ ఇప్పటి వరకు అలా ట్రై చేయకపోతే.. రేపు ఒకసారి ప్రయత్నించండి. మీరు గొప్ప అనుభూతి పొందుతారు.
బుడి బుడి అడుగుల నుంచి మొదలు
వాకింగ్‌తో పాటు ఆఫీస్‌కి చాలా మంది షూస్ వేసుకుని వెళ్తుంటారు.ఆ తర్వాత ఇంటికొచ్చాక మాత్రమే సాక్స్ లేకుండా పాదాల్ని నేలపై ఉంచుతారు. అయితే.. కొంత మంది ఇంట్లో కూడా సాక్స్‌లు లేదా స్లిప్పర్స్‌తోనే తిరుగుతుంటారు. అలా తిరిగితే నేలతోనే మీకు ఉన్న కనెక్టివిటీ పూర్తిగా దెబ్బతింటుంది.
చెప్పులు లేకుండా కాసేపైనా నడవడం మంచిదని ఇంట్లో పెద్దలు చెప్తుంటారు. సాధారణంగా పసి పిల్లలను ఎక్కువగా సాక్స్ లేదా షూస్ లేకుండా నడిపిస్తుంటారు. అలా నడిస్తే పాదాలు సహజంగా వృద్ధి చెందుతాయని, కండరాలు, ఎముకలు కూడా దృఢంగా మారుతాయని అలా చెప్తుంటారు. కానీ.. పెద్దయ్యాక అందరం షూస్ లేదా చెప్పులతో పాదాలకి నొప్పి తగలనివ్వకుండా చేస్తున్నాం.
బేర్‌ఫుట్ వాకింగ్‌తో ప్రయోజనాలు
షూస్ లేదా పాదరక్షలు లేకుండా నడిస్తే మీ పాదాలు సహజసిద్ధంగా ఉంటాయి. పాదాలు స్వేచ్ఛగా కదులుతాయి కాబట్టి శరీరంలోని ఇతర భాగాలపై కూడా ఒత్తిడి తగ్గుతుంది.
బేర్‌ఫుట్ వాకింగ్‌తో మీ పాదాలు, కాళ్లల్లోని కండరాలు కష్టపడి పనిచేస్తాయి. ఇది మీ పాదాలకు మాత్రమే కాకుండా మీ చీలమండలానికి బలంతో పాటు స్థిరత్వాన్ని పెంచుతుంది.
మనలో కొందరికి నిత్యం షూస్ ధరించడం వాటి బిగుతు కారణంగా బొటన వేలితో పాటు కాళ్లలోని కొన్ని వేళ్లు కాస్త వంకరగా కనిపిస్తుంటాయి. అలాంటి వారు బేర్‌ఫుట్ వాకింగ్ చేస్తే పాదాలపై ఒత్తిడి తగ్గి అవి సాధారణ స్థితికి వస్తాయి.
బేర్‌ఫుట్ వాకింగ్‌తో ప్రమాదాలు
ఆరుబయట బేర్‌ఫుట్ వాకింగ్ చేస్తే నేలపై పడి ఉన్న గాజు లేదా వస్తువులతో గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది. అలానే పచ్చగడ్డిలో ఏవైనా పుల్లలు లేదా ఇనుప వస్తువులతో గాయాలయ్యే ప్రమాదాలు లేకపోలేదు. కాబట్టి.. మీరు వాకింగ్ చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా చూసుకుని అడుగులు వేయాలి.
ఎలా అలవాటు చేసుకోవాలి?
మొదట ఇంటి లోపల బేర్‌ఫుట్ వాకింగ్ ప్రారంభించండి. ఆ తర్వాత నెమ్మదిగా మీ ఇంటి చుట్టూ నడవడం చేయండి. దాంతో మీరు బేర్‌ఫుట్ వాకింగ్‌లో గాయపడే ప్రమాదాల్ని తగ్గించుకోవచ్చు. తొలుత రోజుకి 15-20 నిమిషాల ట్రై చేయండి.. ఆ తర్వాత పెంచుకోవచ్చు.ఒకవేళ మీకు ఎక్కువగా ఇబ్బంది అనిపిస్తే.. బేర్‌ఫుట్ వాకింగ్ సమయాన్ని తగ్గించుకోండి. మీ పాదాలకి బేర్‌ఫుట్ వాకింగ్ అలవాటైన తర్వాత శుభ్రమైన గడ్డి, ఇసుక బీచ్‌లు లేదా రబ్బరు ట్రాక్‌ల వంటి వాటిని ఎంచుకోవాలి.
వాకింగ్‌తో పాటు రోజూ కాసేపు పాదాలకి బలం పెంచే వ్యాయామాలు చేయండి. పాదాలకి కోతలు, పొక్కులు లేదా ఇతర గాయాల ఏవైనా ఉంటే బేర్‌ఫుట్ వాకింగ్ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇబ్బందిగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించి సలహాలు తీసుకోవచ్చు.