Tea and Biscuits: వేడి వేడి టీలో బిస్కెట్ అద్దుకుని తింటున్నారా? రోజూ తింటే ఏమవుతుందో తెలుసా?
12 October 2024, 14:00 IST
టీ, బిస్కెట్ డెడ్లీ కాంబినేషన్ అని అందరూ చెప్తుంటారు. కానీ.. ఈ కాంబినేషన్ కారణంగా మనకి ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.
టీతో కలిపి బిస్కెట్స్ ప్రమాదం
మనలో చాలా మంది ఉదయాన్నే వేడి వేడి టీలో బిస్కెట్‌ను అద్దుకుని తింటుంటారు. అలానే సాయంత్రం వేళ కూడా టీ, బిస్కెట్‌తో రిలాక్స్ అయ్యేవారు ఉన్నారు. ఒకవేళ మీకు ఈ అలవాటు ఉంటే వెంటనే తగ్గించుకోండి అని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. డైటీషియన్స్ అభిప్రాయం ప్రకారం.. బిస్కెట్లు, టీ కలయిక మీ హార్మోన్ల పనితీరుని దెబ్బతీస్తుంది. అలానే వివిధ అనారోగ్య సమస్యలకు ఈ అలవాటు దారితీస్తుంది.
షుగర్ ట్రాప్
బిస్కెట్లు అనేవి ముఖ్యంగా ప్యాక్ చేసి ఉంటాయి. ఆ ప్యాకెట్లలో ఉండే బిస్కెట్లలో శుద్ధి చేసిన చక్కర అంటే.. రిఫైన్డ్ చక్కర అధికంగా ఉంటుంది. కాబట్టి.. ఆ బిస్కెట్లను టీలో కలుపుకుని తినడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలలో పెరుగుదలతో పాటు హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది మీ బరువు పెరగడానికీ కారణం అవుతుంది.
మితిమీరిన మైదా
బిస్కెట్ల తయారీలో ఎక్కువగా మైదాని వినియోగిస్తుంటారు. కాబట్టి మనం రోజూ ఇలా రిఫైన్డ్ మైదాతో తయారు చేసిన బిస్కెట్లను తింటే అది ఊబకాయానికి దారితీస్తుంది. అలానే అతిగా మైదా వాడకం వాపు, హార్మోన్ల సిగ్నలింగ్ సమస్యలకు దారితీస్తుంది. మైదా అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.
పామాయిల్ వాడకం
బిస్కెట్ల తయారీలో పామాయిల్ వాడకం కూడా ఉంటుంది. సాధారణంగా బిస్కెట్స్ లాంటి ప్రాసెస్డ్ ఫుడ్ తయారీలో పామాయిల్‌నే తయారీదారులు ఎక్కువగా వాడుతుంటారు. కాబట్టి.. ఆ బిస్కెట్లను తింటే ఇన్సులీన్, ఇన్‌ఫ్లమేషన్‌తో పాటు అనారోగ్య సమస్యల బారినపడే ప్రమాదం ఉంది.
బిస్కెట్, టీ కాంబినేషన్ కాకుండా హార్మోన్ బ్యాలెన్సింగ్ టీలను తాగడానికి ప్రయత్నించండి. కొత్తిమీర సీడ్స్ టీ, కరివేపాకు టీ తదితర ప్రకృతి ప్రసాదిత వాటితో రోజూ ఉదయాన్నే టీ తాగితే ఆరోగ్యానికి మంచిది అని డైటీషియన్లు సూచిస్తున్నారు.